వేధించే మెడనొప్పికి ఉపశమనం

ఉద్యోగినుల్లో చాలామంది మెడ, భుజాల నొప్పులతో ఇబ్బందిపడటం చూస్తుంటాం. అలా సర్వైకల్‌ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న వాళ్లకి సూక్ష్మయోగా దివ్య ఔషధం. దీన్ని గ్రీవా శక్తి వికాసం అంటారు. గ్రీవా అంటే మెడ. ఇందులో నాలుగు విధాలున్నాయి. అన్నీ తప్పనిసరిగా చేయాలి...

Updated : 18 Jun 2022 05:20 IST

ఉద్యోగినుల్లో చాలామంది మెడ, భుజాల నొప్పులతో ఇబ్బందిపడటం చూస్తుంటాం. అలా సర్వైకల్‌ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న వాళ్లకి సూక్ష్మయోగా దివ్య ఔషధం. దీన్ని గ్రీవా శక్తి వికాసం అంటారు. గ్రీవా అంటే మెడ. ఇందులో నాలుగు విధాలున్నాయి. అన్నీ తప్పనిసరిగా చేయాలి.


సుఖమైన స్థితిలో నిటారుగా కూర్చోవాలి. మెడ పక్కకు తిప్పడం లేదా వాలి పోయినట్లు లేకుండా తిన్నగా ఉండాలి. కుడి చేతిని కుడి చెంపకు ఆనించి నొక్కిపట్టాలి. దాంతో మెడమీద ఒత్తిడి పడుతుంది. కొద్దిసేపు నొక్కిపట్టి చేతిని తీసి మళ్లీ పెట్టాలి. ఇలా మూడుసార్లు చేయాలి. ఇదే విధంగా ఎడమ చేత్తో మూడుసార్లు చేయాలి.


ఫొటోలో చూపినట్లు అర చేతులను గడ్డం కింద ఆనించి పైకి నొక్కాలి. చేతులు చుబుకాన్ని పైకి తోస్తున్నట్టు, చుబుకం చేతులను కిందికి నెడుతున్నట్టు చేయాలి. ఇలా రెండు వైపుల నుంచీ ఒత్తిడి కలగజేయడం వల్ల కండరాలు, నరాలు బలోపేతం అవుతాయి. నొప్పి, వాపు లాంటి సమస్యలు రావు.


నుదుటి మీద చెయ్యి పెట్టి నొక్కాలి. తలతో చేతిని ముందుకు తోస్తున్నట్టు, చేత్తో తలను వెనక్కి నెడుతున్నట్టు చేయడం వల్ల వ్యతిరేక దిశలో ఒత్తిడి తగిలి మెడ కండరాలన్నీ దృఢమౌతాయి.


మెడ మీద ఎడమ అరచేయి, దాని మీద కుడి అరచేతిని ఉంచాలి. రెండు మోచేతులూ దగ్గరగా పెట్టి మెడను ముందుకు తోయడానికి ప్రయత్నించాలి. తల కదలకుండా ఉండేలా చూడాలి. దాంతో రెండు వైపులా ఒత్తిడి తగులుతుంది. ఒత్తిడి కల్పించి, వదిలేసి ఇలా మూడు నుంచి ఐదుసార్లు చేయాలి. మెడనొప్పి, మెడ పట్టేయడం లాంటి సమస్యలు తగ్గి, సేదతీరినట్లుంటుంది.


మెడ సంబంధ ఇబ్బందులకు ఈ నాలుగూ చేస్తే ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలంగా బాధ పడుతున్న వారు రాత్రి పడుకునే ముందు, ఉదయం లేచాక చేస్తే సత్వర ఫలితం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్