ఊబకాయం
కాస్త బొద్దుగా కనిపిస్తేనే పేర్లు పెట్టి ఏడిపించడం కద్దు. ఇంకా ఒళ్లు చేస్తే చెప్పేదేముంది.. వ్యంగ్యాలూ వెక్కిరింతలూ తప్పవు. పెళ్లి కావాలంటే సన్నగా నాజూగ్గా ఉండాలని మొహం మీదే చెప్పేయడం చూస్తుంటాం. ఉద్యోగాలకు అలాంటి
ఎందుకు
ఏమిటి
ఎలా?
కాస్త బొద్దుగా కనిపిస్తేనే పేర్లు పెట్టి ఏడిపించడం కద్దు. ఇంకా ఒళ్లు చేస్తే చెప్పేదేముంది.. వ్యంగ్యాలూ వెక్కిరింతలూ తప్పవు. పెళ్లి కావాలంటే సన్నగా నాజూగ్గా ఉండాలని మొహం మీదే చెప్పేయడం చూస్తుంటాం. ఉద్యోగాలకు అలాంటి నిబంధనలేమీ కనిపించకున్నా ఊబకాయులను పెద్దగా ఎంచుకోరని ఆనక ఫలితాల్లో చూస్తాం. ఇవన్నీ అలా ఉంచితే బరువైన శరీరాన్ని అనారోగ్యం తేలిగ్గా కమ్మేస్తుంది.. ఇంతకీ ఊబకాయం ఎందుకొస్తుందో, దాన్ని తిప్పికొట్టే మార్గాలేంటో చూద్దాం...
హార్మోన్ల అసమతుల్యత లేదా అనారోగ్యం కారణంగా కంటే జీవన శైలి, ఆహారపు అలవాట్ల వల్లనే ఊబకాయం అధికమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు సౌకర్యాలూ సదుపాయాలూ పెరిగాయి. శారీరక శ్రమ తగ్గింది. వ్యాయామం చేసేవారి సంఖ్య కూడా స్వల్పమే. ఇంటా బయటా ఏసీలు ఎక్కువై స్వేదం రూపంలోనూ కేలరీలు ఖర్చవడంలేదు. పర్యవసానమే ఊబకాయం. సహజ కాయగూరలకు బదులు ప్రాసెస్ చేసిన ఆహారం, తాజా పండ్లకు బదులు రసాయనాల శీతల పానీయాలు మరో కారణం. ఉన్నపళాన ఒళ్లు తెప్పించే మాయాజాలం వాటిల్లో ఉంటుంది మరి. మళ్లీ సన్నబడాలంటే జిమ్ముల్లో ఎన్నాళ్లు కసరత్తులు చేయాలో! ఎంత డబ్బును వెయిట్ లాస్ సెంటర్లలో కుమ్మరించాలో! ఇంకో కారణం నిద్రలేమి... వేళకు పడుకోకపోవడం లేదా తగినంత నిద్ర లేకపోవడం.
విరుగుడేంటి...
* ఆఫీసు లేదా ఇతర ప్రదేశాలకు వాహనాలు తప్పకున్నా కూరగాయల మార్కెట్టు, కొద్ది దూరంలో ఉన్న బంధుమిత్రుల ఇళ్లకు లేదా పార్కుకు కాలి నడకన వెళ్లడం అలవాటు చేసుకుంటే అది మంచి వ్యాయామం అవుతుంది. ఊబకాయమూ రాదు, అనారోగ్యాలూ దరిచేరవు.
* బయట దొరికే పిజ్జాలూ, బర్గర్లూ, బజ్జీలూ, బోండాల్లాంటివి మానేస్తే సరి. ఫలహారం చేసుకుని తినే వీలూ వసతీ లేకుంటే కాసిని అటుకులు కొద్దిగా పాలల్లో వేసుకు తినడం లాంటి మార్గాలెన్ని లేవు? మన ఆరోగ్యం గురించి మనమే శ్రద్ధ తీసుకోవాలి! ఇంటి తిండిలోనూ నూనె పదార్థాలు తగ్గించక తప్పదు. ఆకలి తీరడానికి ఏదో ఒకటి అనుకోకుండా సంపూర్ణ పోషకాహారం తగినంత తినాలి. కాఫీ, టీలు తగ్గించాలి. శీతల పానీయాలూ జంక్‌ఫుడ్ జోలికి అసలే వద్దు!
* మనదేశ మహిళల్లో తక్కువ బరువున్నది 2 శాతం మాత్రమే. కానీ 20.7 శాతం అధిక బరువున్నారని దానివల్ల మధుమేహం, హృద్రోగం, గుల్ల ఎముకల వ్యాధులతో బాధపడుతున్నారని- మొన్న మార్చిలో జరిపిన అధ్యయనాల్లో తేలింది. మరి మనమంతా జాగ్రత్తపడాల్సిన అవసరమున్నట్టేగా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.