మన జీవితాలకు మనమే డాక్టర్‌..

దీర్ఘకాల వ్యాధులకు కారణాన్ని కనిపెడుతున్న ఈమె వైద్యురాలు కాదు. వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యలు సవాళ్లుగా మారడంతో తిండిని వ్యసనంగా మార్చుకొని అధికబరువుకు గురైంది. అయితే తన అనారోగ్యాలకు మూలాలను గుర్తించి తిరిగి

Updated : 17 Aug 2022 09:02 IST

దీర్ఘకాల వ్యాధులకు కారణాన్ని కనిపెడుతున్న ఈమె వైద్యురాలు కాదు. వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యలు సవాళ్లుగా మారడంతో తిండిని వ్యసనంగా మార్చుకొని అధికబరువుకు గురైంది. అయితే తన అనారోగ్యాలకు మూలాలను గుర్తించి తిరిగి ఆరోగ్యాన్ని పొందగలిగింది. ఫంక్షనల్‌ న్యూట్రిషనిస్ట్‌గా మారి మరెందరికో పరిష్కారాన్ని చూపిస్తోంది. టెడెక్స్‌ వంటి వేదికలపై ప్రసంగిస్తూ అవగాహన కలిగిస్తున్న ముగ్ధా ప్రధాన్‌ స్ఫూర్తికథనమిది.

కర్నాటకలో ఓ మారుమూల గ్రామం ముగ్ధ వాళ్లది. చిన్నప్పుడు సన్నగానే ఉండేది. తల్లి నర్సుగా పనిచేసేది. తన 15వ ఏట పుణె వచ్చినప్పుడు అక్కడ ఫాస్ట్‌ఫుడ్స్‌ అలవాటయ్యాయి. డిగ్రీ చదివి, ముంబయి కాలేజీలో ఫ్యాకల్టీగా చేరింది. పెళ్లైన తర్వాత భర్తతో కలిసి విదేశాలకెళ్లింది. అక్కడ టొరంటోలో ఓ కార్పొరేట్‌ సంస్థలో హెచ్‌ఆర్‌ మేనేజర్‌ అయ్యింది. తర్వాత వైవాహిక జీవితంలో సమస్యలు మొదలయ్యాయి. ‘ఆ ఒత్తిడిని భరించలేక నాకు తెలియకుండానే తిండిని ఆశ్రయించా. మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌, పీసీఓ, ఆందోళన, ఒత్తిడి వంటి అనారోగ్యాలు చుట్టుముట్టాయి. వీటిని అధిగమించే క్రమంలో తిండి వ్యసనంగా మారింది. అలా 2017లో నా 37 ఏళ్లకే 97 కేజీల బరువు పెరిగా. వైద్యులు దీన్ని క్లినికల్‌ డిప్రెషన్‌ అన్నారు. రోగనిరోధకత తగ్గి, కుంగుబాటుకు గురయ్యా. ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవి. అప్పుడే ఓ సారి నాలో ఆలోచన మొదలైంది. నా జీవితం ఎందుకిలా మారింది? నేనేం చేస్తున్నా? న్యూట్రిషన్‌ కోర్సులో మాస్టర్స్‌ చేసిన నేను నా సమస్యలనే పరిష్కరించుకోలేక పోతున్నానేంటి అనిపించింది. వీటికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలనుకున్నా. అంతే... పాపతో ఇండియాకు వచ్చేశా’ అని వివరించింది ముగ్ధ.

మూలం.. ఆసుపత్రులెన్ని తిరిగినా చికిత్సలేవీ ఆమెకు ఉపశమనమివ్వలేదు. మరింత నీరసించి పోయింది. తనే ఏదో ఒకటి ఆలోచించాలనుకుంది. ఓపక్క ఆర్థిక ఇబ్బందులు. ఓసమయంలో అయితే ఆమె చేతిలో రూ.300 మాత్రమే ఉన్నాయి. ‘ఈ ఆర్థిక ఇబ్బందిని దాటడానికి ఏదైనా చేయాలన్నా,  ముందుగా అనారోగ్యాలు, అధికబరువు నుంచి బయట పడాలి అని అర్థమైంది. దాంతో స్నేహితులను చేబదులు అడిగా. పాపను సంరక్షణ విషయంలో కోర్టులో నా వాదన వినిపించేందుకు లాయర్‌ని కూడా పెట్టుకోలేని స్థితిలో ఉన్నా. దాంతో నా భర్త గెలిచి పాపను  తీసుకెళ్లి పోయారు. అదే సమయంలో సరైన చికిత్స చేయించలేక మా అమ్మ చనిపోయింది. ఇవన్నీ నాపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. వాటి నుంచి బయటపడాలనుకున్నా. నా ఆరోగ్య సమస్యల గురించి అధ్యయనం చేశా. వీటికి మూలమేంటో కనుక్కోవడానికి కృషి చేశా. అప్పుడే ‘ఫంక్షనల్‌ మెడిసిన్‌’ గురించి తెలిసింది. అనారోగ్యాలకు మూలాన్ని కనిపెట్టి అక్కడ చికిత్స చేయడమే దీని ప్రత్యేకత. నా రక్తపరీక్షలో ఐరన్‌, విటమిన్‌ డి, జింక్‌, బీకాంప్లెక్స్‌, ప్రొటీన్లు వంటివన్నీ కావాల్సినంత లేవని తెలిసింది. ఇవన్నీ థైరాయిడ్‌ గ్రంథిపై ప్రభావాన్ని చూపించాయి. వ్యాధినిరోధక శక్తిని తగ్గించాయి. ఇక వెంటనే ఆహారపుటలవాట్లను మార్చుకున్నా. సప్లిమెంట్స్‌ తీసుకుంటూ, చక్కెర, గ్లూటెన్‌, పాల ఉత్పత్తులకు దూరం పెట్టేశా. వ్యాయామం, ధ్యానం చేశా. దాంతో కొన్ని నెలలకే నా బరువు తగ్గడం మొదలైంది. చర్మం మునుపటిలా మారింది. జుట్టు రాలడం తగ్గింది. క్రమేపీ అనారోగ్యాలు తగ్గుతూ వచ్చాయి. అలా ఏడాదయ్యేసరికి 37 కేజీలు తగ్గి, 60 కేజీల బరువుకొచ్చా’ అని చెబుతున్న ముగ్ధ ఈ వివరాలన్నింటినీ ఫేస్‌బుక్‌లో పొందుపరిచింది.

గుర్తిస్తూ.. ముగ్ధ ఆరోగ్య రహస్యాన్ని అందరూ అడిగేవారు. ఒకాయన తాను సుదీర్ఘకాలంగా బాధపడుతున్న అనారోగ్యం గురించి చెప్పాడు. నెలకు రూ.2000 ఫీజుతో అతడికి ఫంక్షనల్‌ న్యూట్రిషినిస్ట్‌గా సలహాలు, సూచనలు అందించింది. అదే ఆమె మొదటి ఆదాయం. అతడు ఆరోగ్యవంతుడయ్యాడు. ఆయన ప్రోత్సాహం, భాగస్వామ్యం్తఓ ముగ్ధ, జూలై, 2017లో ‘ఐ థ్రైవ్‌’ ప్రారంభించింది. ఇప్పటివరకు వేలమందికి పరిష్కారాన్ని చూపించింది. దీర్ఘకాల వ్యాధులెన్నింటికో మూలాలను గుర్తించడం ముగ్ధ ప్రత్యేకత. అవయవాల పనితీరు, విటమిన్లు, ఖనిజలవణాల లోపాలు, పైకి తెలియని ఇన్‌ఫెక్షన్లు, బ్యాక్టీరియాలు, వైరస్‌ల ప్రభావాలు, ట్యాక్సిన్లు, ఒత్తిడి వంటివి ముందుగా పరిశీలిస్తుంది. ఆహారపుటలవాట్ల నుంచి జీవనశైలి వరకు క్రమబద్ధం చేస్తుంది. ఎలాంటి అనారోగ్యానికైనా ఆహారానికి మించిన ఔషధం లేదంటుందీమె. ప్రస్తుతం ‘ఐ థ్రైవ్‌’లో 45 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ‘దీర్ఘకాలిక అనారోగ్యాలను ఈ భూమిపై నుంచి మాయం చేయాలన్నదే నా లక్ష్యం’ అని అంటోన్న ముగ్ధ ప్రయాణం స్ఫూర్తిదాయకంగా ఉంది కదూ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్