ఆ సమస్య ఉండదిక!
సమయానికి శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేకపోతే అమ్మాయిలు పడే ఇబ్బంది తెలియంది కాదు. ఈ సమస్యని గుర్తించి మహిళల ఆత్మ గౌరవం పెంపొందించే దిశగా స్కాట్లాండ్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. పీరియడ్స్ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తుల్ని ఆ దేశంలో ఉచితంగా అందించే చట్టాన్ని తీసుకొచ్చింది...
సమయానికి శానిటరీ ప్యాడ్లు అందుబాటులో లేకపోతే అమ్మాయిలు పడే ఇబ్బంది తెలియంది కాదు. ఈ సమస్యని గుర్తించి మహిళల ఆత్మ గౌరవం పెంపొందించే దిశగా స్కాట్లాండ్ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. పీరియడ్స్ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తుల్ని ఆ దేశంలో ఉచితంగా అందించే చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రపంచంలో ఈ రకమైన చట్టాన్ని చేసిన మొట్టమొదటి దేశం స్కాట్లాండ్. దీని ప్రకారం శానిటరీ ప్యాడ్లు, ట్యాంపూన్లు ప్రభుత్వ భవనాల్లో ఉంచడం తప్పనిసరి. స్కూళ్లు, కాలేజీలూ, యూనివర్సిటీలూ, ప్రభుత్వ కార్యాలయాలూ, స్థానిక కమ్యూనిటీ సెంటర్లూ, ప్రభుత్వ జిమ్‌లూ, గ్రంథాలయాల్లో ఈ ఉత్పత్తుల్ని ఉచితంగా అందుబాటులో ఉంచుతారు. తమ దగ్గర్లో ఈ ఉచిత ఉత్పత్తులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి ‘పికప్ మై పీరియడ్’ యాప్‌నీ తెచ్చారు. స్కాట్లాండ్ ప్రభుత్వ నిధులతో యూకేకు చెందిన సామాజిక వ్యాపారసంస్థ ‘హే గర్ల్స్’ దీన్ని అభివృద్ధి చేసింది. ఇదే కాకుండా అక్కడ పీరియడ్స్‌పైన అవగాహనా కార్యక్రమాల్నీ తెస్తున్నారు. నార్తర్న్ ఐర్లాండ్ కూడా ఇలాంటి చట్టాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోందట. న్యూజిలాండ్, సియోల్ పాఠశాలల్లో శానిటరీ ప్యాడ్లను ఇప్పటికే ఉచితంగా అందిస్తున్నారు. ‘ప్రస్తుతం స్కాట్లాండ్‌లో అన్ని రకాల వస్తువుల ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో కొందరు శానిటరీ ఉత్పత్తుల వినియోగంలో రాజీ పడుతున్నారు. ఇకపైన వారికా సమస్య ఉండదు. ప్రపంచంలోనే ఈ దిశగా చర్యలు తీసుకున్న మొదటి దేశం మాదే కావడం గర్వంగా ఉంది’ అని చెబుతున్నారు ఆ దేశ మహిళా శాసనకర్తలు. ఈ మార్పు మన దగ్గరా వస్తే బావుణ్ణు కదా!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.