నెలసరి ఆటాడుకుంటోంది!
‘ నేను అబ్బాయినై పుట్టుంటే బాగుండేది...’ ఈ మాటలని ఈమధ్య ఇద్దరు క్రీడాకారిణులన్నారు. వాళ్లలో ఒకరు అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి ఝెంగ్ క్విన్వెన్ కాగా రెండో ఆమె మనకి బాగా తెలిసిన సెరెనా విలియమ్స్. ‘అవును..
‘ నేను అబ్బాయినై పుట్టుంటే బాగుండేది...’ ఈ మాటలని ఈమధ్య ఇద్దరు క్రీడాకారిణులన్నారు. వాళ్లలో ఒకరు అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి ఝెంగ్ క్విన్వెన్ కాగా రెండో ఆమె మనకి బాగా తెలిసిన సెరెనా విలియమ్స్. ‘అవును.. మా నెలసరి కష్టాలపై పరిశోధన జరగాలంటూ’ క్రికెటర్ ఝులన్గోస్వామి స్వరం కూడా వీరికి తోడైంది.. వీళ్లని ఇంతగా బాధించిన ఆ ఇక్కట్ల గురించి లోతుగా తెలుసుకుందాం..
ఈ ఏడాది మేలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌లో.. చైనా క్రీడాకారిణి ఝెంగ్ క్విన్వెన్ ఆట మధ్యలో బాధతో విలవిల్లాడుతూ, కన్నీళ్లు పెట్టుకుంది. ‘నేను అబ్బాయినైతే బాగుండేది’ అంటూ నిరాశతో మైదానం నుంచి వెనుతిరిగింది. అదే కోర్టులో ఉన్న కొంతమంది మగవాళ్లు ఈ విషయాన్ని ‘ఆడాళ్ల విషయం’(గర్లీ థింగ్) అంటూ తేలిగ్గా కొట్టిపారేశారు. కానీ ఝెంగ్ మాత్రం అసలు విషయాన్ని దాచిపెట్టలేదు. ‘నా కాలికైన గాయాన్ని కూడా తట్టుకుని విజయం సాధిద్దాం అనుకున్నా. కానీ నెలసరి వచ్చినప్పుడు మొదటిరోజు ఎదురయ్యే నొప్పిని జయించడం మాత్రం నా వల్ల కాలేదు’ అంది. తాజాగా ఝులన్ గోస్వామి కూడా అదే మాట అంది. ఓ క్రికెటర్ మైదానంలో ఆరుగంటల సమయం ఉండాలి. ఈ నొప్పితో అంత సమయం ఉండలేం. క్రీడాకారిణుల నెలసరి ఇక్కట్లపై శాస్త్రీయమైన పరిశోధనలు జరగాలంటూ అభిప్రాయపడింది.
ఆటతీరుపై ప్రభావం...
‘ఏమైంది తనకి.. ఈసారి మరీ పేలవంగా ఆడింది’, ‘ఒక విజయం అందుకోగానే ఇంత నిర్లక్ష్యమా’... ఒక క్రీడాకారిణి మైదానంలో సరైన ఆటతీరుని ప్రదర్శించనప్పుడు మనకి తరచూ వినిపించే మాటలివి. వాళ్ల ఈ వైఫల్యం వెనుక.. నెలసరి సమస్య ప్రధాన కారణమై ఉండొచ్చు అంటున్నారు పరిశోధకులు. బీబీసీ ఎలైట్ బ్రిటిష్ స్పోర్ట్స్ ఉమెన్ సర్వే ప్రకారం... 60శాతం మంది క్రీడాకారిణులు తమ ఆటతీరుపై నెలసరుల ప్రభావం ఉందని ఒప్పుకొన్నారు. 40 శాతం మంది అమ్మాయిలు నెలసరి ఇబ్బందులని కోచ్‌తో పంచుకోలేక, ఆటపై ఏకాగ్రత పెట్టలేక ఇబ్బంది పడుతూ కాంట్రాసెప్టివ్ మాత్రలని వాడుతున్నామన్నారు.
ఇవీ ఇబ్బందులు...
‘నాప్కిన్ని మార్చకుండా గంటల తరబడి ఉండాలి. దీనికి తోడు చెమట. చిరాకు. వీటన్నింటితో ఏకాగ్రత దెబ్బతింటుంది. కండరాలు పట్టేయడం, కడుపునొప్పి, కడుపుబ్బరం వంటి సమస్యలు ఉంటాయి. కడుపుబ్బరంగా ఉన్నప్పుడు.. ఆ బరువుతో పరుగు పెట్టలేం. ఏదైనా తినాలనిపించినా తినలేం. ఎందుకంటే పెరిగిన బరువు కొన్నిసార్లు అవకాశాలని దెబ్బతీస్తుంది. ఇవి మాత్రమేనా! క్రీడా చట్టాలు, నిబంధనలు, స్టేడియమ్‌లు అన్నీ మగవాళ్లకోసం రూపొందించినవే. చాలాచోట్ల శిక్షణా శిబిరాల్లో ..వాడేసిన నాప్కిన్లు పారేయడానికి విడిగా డస్ట్బిన్లు కూడా ఉండవు. నాప్కిన్ మార్చుకోవడానికి వాష్‌రూమ్‌కి అందరిలోంచి పదిసార్లు పరుగుపెట్టాలి. వాస్తవానికి క్రికెట్లాంటివి ఆడేటప్పుడు మైదానం వదిలి వెళ్లకూడదని నిబంధన. మగవాళ్లైతే డ్రెస్సింగ్రూమ్కెళ్తారు. మేమలా కాదుగా. వాష్‌రూమ్‌కి వెళ్లాలి’ అంటూ తమ కష్టాలని చెప్పుకొచ్చారు ఫుట్‌బాల్ క్రీడాకారిణులయిన ఇసాబెల్లా బుర్కే, రేచల్ న్యూబరోలు. అంతటితో అయిపోలేదు. ‘మ్యాచ్ సమయంలో పీరియెడ్స్ వస్తే నా ముందు రెండు మార్గాలుండేవి. ఒకటి ఏకాగ్రత లేకుండా ఆడటం. రెండు ఆ బాధ తట్టుకోలేక మాత్ర వేసుకోవడం. కానీ ఆ మాత్రతో హార్మోన్లు ప్రభావితం అయ్యి విపరీతమైన తలనొప్పి వచ్చేది. ఒక రోజు డాక్టర్.. ‘పిల్ అయినా మానేయ్. ఆటైనా వదులుకో’ అన్నాడు. ఆటని వదులుకోవడం ఇష్టం లేక రెండున్నరేళ్లు తలనొప్పిని భరించా’ అంటూ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది రేచల్న్యూబరో. టోక్యో ఒలింపిక్స్‌లో ఈతలో మనదేశానికి ప్రాతినిధ్యం వహించింది మానా పటేల్...‘నిరంతం నీటిలో ఉండటం వల్ల నా నెలసరుల క్రమం దెబ్బతింది. సరిగ్గా ఆట సమయానికి ఈసమస్య ఎదురైంది’... ‘వింబుల్డన్‌లో తెల్లని దుస్తులు ధరించాలి. గెలుపు మీదకన్నా... మరక పడితే? అన్న ఆలోచనతోనే ఆడాను’ అంటూ తన అనుభవాన్ని గుర్తుచేసుకుంది టెన్నిస్ క్రీడాకారిణి అంకితా రైనా.
కోచ్‌లు, ట్రైనర్లు, ఫిజియోథెరపిస్టులు అంతా మగవాళ్లే. ముఖ్యంగా నడివయసు కోచ్‌లతో అమ్మాయిలు వాళ్ల సమస్యలని చెప్పలేరు. అంతెందుకు శానిటరీ నాప్కిన్ల ప్రకటనల్లో కూడా రక్తాన్ని ఎర్రగా చూపించకుండా నీలిరంగులో చూపిస్తారు. అంటే ఈ విషయాన్ని ఇంకా గోప్యంగా దాచిపెడుతున్నట్టే కదా. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి అంటారు ఇంగ్లండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో పనిచేస్తున్న డాక్టర్ అనితా బిశ్వాస్. త్వరలో జరగబోయే స్కాటిష్ ఉమెన్ ఇన్ స్పోర్ట్స్ 2022 కాన్ఫరెన్స్‌లో ... క్రీడాకారిణులు- హార్మోన్లు అన్న విషయంపై చర్చలు జరగనున్నాయి. ఏ క్రీడాకారిణీ ఈ హార్మోన్ తేడా వల్ల ఆటలో వెనకబడ కూడదని ఈ సమావేశం లక్ష్యం. ఈ విషయంలో పరిశోధకులు మేలైన పరిష్కారాలని చూపాలని అవి మిగిలిన వారికీ ఉపకరిస్తాయనీ ఆశిద్దాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- వేసవిలో ట్యాన్ సమస్య తగ్గాలంటే..!
- అడ్డిగ... అందాల నగ!
- ఇలా చేస్తే.. అందం తగ్గదు..!
- నాకు ఏ క్రీమ్?
- స్ట్రెచ్ మార్క్స్.. తగ్గట్లేదా..?
ఆరోగ్యమస్తు
- అందుకే వీటిని ఇలా తీసుకోవాలట..!
- వసంతంలో ఆరోగ్య జాగ్రత్తలు..!
- ప్రెగ్నెన్సీ.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
- ఉత్తేజంగా మారాలంటే..!
- రక్తహీనత తగ్గించే బీట్రూట్!
అనుబంధం
- ఒక మెట్టు దిగితే చాలు...
- ఆ అమ్మాయితో ఆ చాటింగ్.. ఆయన్ని నమ్మలేకపోతున్నా..!
- అలా చదివితే మేలే...
- చిన్నవే... చక్కదిద్దుతాయి!
- యుక్త వయసు నుంచీ...!
యూత్ కార్నర్
- అప్పుడు ఫ్యాన్... ఇప్పుడందరి ఫేవరెట్!
- భూగోళాన్ని చుట్టేస్తానంటోంది!
- దాంతో మాట్లాడుతుంటే మతి పోయిందనేవాళ్లు!
- ఎరీ... ఆ ఊరి పట్టు..!
- అందరికీ నచ్చేవి.. నాకు నచ్చవు.. ఎందుకిలా?
'స్వీట్' హోం
- పుల్లటి పెరుగుతో.. పెరిగే రుచి!
- రిస్క్ లేకుండా దాచేద్దాం!
- వేసవిలో ఇల్లు చల్లగా...
- కళ్లు తిరిగే కార్పెట్లు...
- ఆ చోటు గుర్తిస్తే చాలు...
వర్క్ & లైఫ్
- మీకు ‘ట్రావెలింగ్’ అంటే ఇష్టమా..?
- పనికి ‘బ్రేక్’ వేయండి!
- ఇవి టైంపాస్ కోసమే కాదు.. సంపాదనకూ..!
- మారాలని గట్టిగా అనుకోండి!
- Samantha: చిన్న చిట్కాలతోనే 45 కిలోల బరువు తగ్గా..!