వయసు వెనక్కా..ముందుకా!

వయసు పెరగడం అనేది చర్మంపైనే కాదు.. శారీరక, మానసిక, భావోద్వేగాల పరంగా ఎన్నో మార్పులను చూపిస్తుంది. 50ల్లోకో 60ల్లోకో వచ్చాక మార్పులు సహజమే. కానీ ఒత్తిడి, జీవనశైలి, వాతావరణ మార్పులు.. ఇలా అనేక అంశాలు త్వరగా వృద్ధాప్యంలోకి నెడుతున్నాయి. మరి ఈ ప్రిమెచ్యూర్‌ ఏజింగ్‌ను ఆపాలంటే..?

Updated : 26 Aug 2022 09:16 IST

వయసు పెరగడం అనేది చర్మంపైనే కాదు.. శారీరక, మానసిక, భావోద్వేగాల పరంగా ఎన్నో మార్పులను చూపిస్తుంది. 50ల్లోకో 60ల్లోకో వచ్చాక మార్పులు సహజమే. కానీ ఒత్తిడి, జీవనశైలి, వాతావరణ మార్పులు.. ఇలా అనేక అంశాలు త్వరగా వృద్ధాప్యంలోకి నెడుతున్నాయి. మరి ఈ ప్రిమెచ్యూర్‌ ఏజింగ్‌ను ఆపాలంటే..?


సూచికలు ఇవే..

సన్‌ స్పాట్స్‌: ముఖం మీద నల్లగా, పెద్దగా వస్తుంటాయి కదా! అవే ఇవి. ఏజ్‌ స్పాట్స్‌ అనీ అంటారు. ఎండలో ఎక్కువగా తిరగడం కారణంగా ముఖం, చేతులు, వీపుపై నల్లగా తయారవుతుంది.

నిర్జీవమైన చర్మం: చర్మంలో కొల్లాజెన్‌ ఉత్పత్తి తగ్గడమే కారణం. సాధారణంగా ఇది 20ల్లోంచే కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తుంది. దీంతో చర్మం కళావిహీనంగా తయారవడమే కాదు.. చర్మంపై గీతలు, ముడతలు వంటివీ కనిపిస్తుంటాయి.

పొడిబారడం: వయసు పెరిగేకొద్దీ చర్మంలో నూనెల ఉత్పత్తి తగ్గుతుంది. ఫలితమే పొడి బారిన చర్మం. అంతే కాదు చర్మం పలచబడి త్వరగా గాయాలపాలవుతుంటుంది. దద్దుర్లు వంటివీ కనిపిస్తుంటాయి.

నరాలు కనిపిస్తాయ్‌: చేతుల మీద నరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటే అది వృద్ధాప్య సూచికే. కొల్లాజెన్‌ తగ్గే కొద్దీ కళ్ల కింద ఉబ్బుగా మారడం, కంటి పక్కన గీతలు, ముడతలు వంటివి కనిపిస్తాయి. అక్కడి రక్తనాళాలూ స్పష్టంగా కనిపిస్తుంటాయి.


కారణాలేంటి?

కొన్నిసార్లు వంశపారంపర్యమూ కారణమైనా వయసు పైబడినట్లుగా కనిపించడానికి జీవనశైలి ప్రభావమే ప్రధానమంటారు నిపుణులు.

* ఎక్కువగా ఎండలో తిరగడం వల్ల చర్మ కణాలు దెబ్బతింటాయి. చర్మంలో తేమ తగ్గి ముడతలకు కారణమవుతాయి. వాతావరణ కాలుష్యం పిగ్మెంటేషన్‌, చర్మం దెబ్బతినడానికి దారి తీస్తాయి.

* వేళ కాని వేళల్లో తిండి, నిద్ర ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతాయి. జీర్ణవ్యవస్థ, మెదడుపై ఒత్తిడిని పెంచుతాయి. ఫలితమే ఇన్‌ఫ్లమేషన్‌, హార్మోనుల్లో అసమతౌల్యత వగైరా!

* చక్కెరలు, రిఫైన్‌డ్‌ నూనెలు, కార్బోహైడ్రేట్స్‌ మొదలైనవి జీర్ణక్రియలను నెమ్మదింపజేస్తాయి. చర్మంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

* వేళకు నిద్ర పోకపోవడం, తక్కువ గంటలు పడుకోవడం.. ఆ దుష్ప్రభావాలు శరీరం, చర్మం, మనసు.. అన్నింటిపైనా పడతాయి.


ఆపేద్దామిలా..

* పనికి, జీవితానికి సమత్యులం పాటించాలని చెబుతారు. నిద్ర శరీరానికి, చర్మానికి మంచి చికిత్స. నిద్రలో శరీరం తనని తాను మరమ్మతు చేసుకుంటుంది. మలినాలన్నింటినీ బయటకు వెళ్లగొడుతుంది. కాబట్టి, కంటినిండా కునుకు ఉండేలా చూసుకుంటే మరుసటి రోజు మరింత ఉత్సాహంగా ఉంటారు. అందుకే కనీసం 7 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి.

* ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లకు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. వీటి ద్వారా శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్లు, మినరల్స్‌, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. బయటి ఆహారానికి వీలైనంత దూరం ఉండాలి. రోజులో కొద్దిసేపు తప్పక వ్యాయామానికి కేటాయించాలి. ఇది శరీరాన్ని చురుగ్గా ఉంచుతుంది. ఒత్తిడినీ దూరం చేస్తుంది.

* ఎండ చర్మానికి పెద్ద శత్రువు. బయటికి వెళ్లేప్పుడు సన్‌స్క్రీన్‌ను తప్పక రాయాలి. ఎక్కువసేపు ఉండాల్సి వస్తే స్కార్ఫ్‌ ధరించడం మంచిది. రోజువారీ చర్మ సరక్షణపై తప్పక దృష్టిపెట్టాలి. రెటినాయిడ్స్‌, పెప్టైడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉండే క్రీములకు ప్రాధాన్యమివ్వాలి. చిన్న వయసుకే ముడతలు, గీతలు వంటి లక్షణాలు ఏమాత్రం కనిపించినా నిపుణుల ఆధ్వర్యంలో చికిత్సనూ తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్