ప్రసవం తర్వాత...

ప్రసవానంతరం ఆరోగ్యపరంగా, శారీరకంగా పలు మార్పులు చోటు చేసుకుంటాయి. వీటి నుంచి త్వరగా కోలుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు. సాధారణ ప్రసవం లేదా సిజేరియన్‌ జరిగాక ఓ వారం రక్తస్రావం అవుతుంది. పాతవస్త్రాల జోలికి పోకుండా శానిటరీ ప్యాడ్స్‌ వాడాలి. వీటిని మార్చినప్పుడల్లా గోరువెచ్చని నీటితో జననేంద్రియాన్ని శుభ్రం...

Published : 27 Aug 2022 00:17 IST

ప్రసవానంతరం ఆరోగ్యపరంగా, శారీరకంగా పలు మార్పులు చోటు చేసుకుంటాయి. వీటి నుంచి త్వరగా కోలుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు.

రక్తస్రావం..

సాధారణ ప్రసవం లేదా సిజేరియన్‌ జరిగాక ఓ వారం రక్తస్రావం అవుతుంది. పాతవస్త్రాల జోలికి పోకుండా శానిటరీ ప్యాడ్స్‌ వాడాలి. వీటిని మార్చినప్పుడల్లా గోరువెచ్చని నీటితో జననేంద్రియాన్ని శుభ్రం చేసుకోవాలి. శుభ్రత పాటిస్తే ఇన్‌ఫెక్షన్లను నివారించ వచ్చు. రక్తస్రావం ఎక్కువగా ఉంటే తప్పక వైద్య సలహా తీసుకోవాలి.

వ్యాయామాలు..

ప్రసవంలో ఒత్తిడికి గురయ్యే కటి కండరాలను బలోపేతం చేయడానికి వైద్యుల సలహాతో చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. ఇలాచేస్తే మూత్రవిసర్జనలో ఇబ్బందులూ దూరమవుతాయి. సీ సెక్షన్‌ చేసినట్లైతే, ఆ భాగంలో నొప్పి తగ్గడానికి మాత్రలు వాడాలి. నడక, కాలకృత్యాలు తీర్చుకొనేటప్పుడూ ఇబ్బందిగా అనిపిస్తే గోడకు ఎదురుగా నిలబడి రెండు చేతులూ పైకెత్తి ఆ తర్వాత స్ట్రెచ్‌ చేసి కిందకు దించాలి. పొత్తి కడుపులోని కండరాలు ఫ్రీగా అయినట్లు అనిపించే వరకు ఇలా చేస్తే సమస్య తగ్గుతుంది. ఏవైనా ఇబ్బందులు, నొప్పి అనిపిస్తే శరీరం వ్యాయామాలకు సిద్ధం కాలేదని గుర్తించాలి. వెంటనే వైద్యుల సూచనలు పాటించాలి.    

యోగా..

ప్రసవానంతరం చేసే యోగా పాల ఉత్పత్తిని పెంచుతుంది. శరీరమంతటికీ ఉపశమనం అందుతుంది. కండరాల్లో కలిగే ఒత్తిడి, ప్రసవంలో కలిగిన ఆందోళన దూరమవుతాయి. ప్రసవానంతర కుంగుబాటుకు గురైన వారికి శవాసనం మంచి ఫలితాన్నిస్తుంది. చిన్నపిల్ల భంగిమలో ఆసనమైతే రక్తప్రసరణ మెరుగు పడుతుంది. ఇది సాగిన పొత్తికడుపును యథాస్థితికి తీసుకొస్తుంది.  

ఛాతీ వద్ద..

రొమ్ములో పాలు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు నవజాత శిశువు పూర్తిగా తాగలేక పోవచ్చు. దాంతో ఆ భాగమంతా పాలు గడ్డకట్టి నొప్పి కలుగుతుంది. అప్పుడు వేడి నీటిలో ముంచిన తువ్వాలును రొమ్ముపై పరిచి అయిదు నిమిషాలుంచాలి. ఆ భాగాన్నంతా మృదువుగా మర్దనా చేసి, తర్వాత పాపాయికి పాలుపట్టాలి. అదయ్యాక ఛాతీభాగం వద్ద ఐస్‌ గడ్డ పెట్టాలి. తరచూ ఇలా చేస్తే పాలు గడ్డ కట్టే సమస్య తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

పోషకాహారం..

ప్రొటీన్లు, పీచు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాహారాన్ని ఎంచుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు ఆహారంలో భాగం కావాలి. పాల ఉత్పత్తులు తీసుకుంటే తల్లీబిడ్డ ఆరోగ్యం పెంపొందుతుంది.మసాలాలు, కెఫైన్‌, నిల్వ ఆహారాలు, ప్రాసెస్ట్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని