పాపాయికి... సరైనవే వాడుతున్నామా?

పాపాయి పుట్టినప్పటి నుంచి ఎంతో అపురూపంగా చూసుకుంటాం. సంరక్షణ కోసం శక్తికి మించి ఖర్చు పెడుతుంటాం. మనం వాడుతున్న ఉత్పత్తులు నిజంగానే చిన్నారికి రక్షణనిస్తున్నాయా? అంటే అనుమానమే. ఈ మధ్య ఓ ప్రముఖ సంస్థ తయారు చేస్తోన్న బేబీ పౌడర్‌ వల్ల పిల్లల్లో క్యాన్సర్‌ వస్తోందని కొన్ని దేశాల్లో దాని వాడకాన్ని నిలిపివేశారు! మరి మిగతావైనా సురక్షితమేనా? దీనికి నిపుణులేం చెబుతున్నారో చదివేయండి....

Published : 03 Sep 2022 00:28 IST

పాపాయి పుట్టినప్పటి నుంచి ఎంతో అపురూపంగా చూసుకుంటాం. సంరక్షణ కోసం శక్తికి మించి ఖర్చు పెడుతుంటాం. మనం వాడుతున్న ఉత్పత్తులు నిజంగానే చిన్నారికి రక్షణనిస్తున్నాయా? అంటే అనుమానమే. ఈ మధ్య ఓ ప్రముఖ సంస్థ తయారు చేస్తోన్న బేబీ పౌడర్‌ వల్ల పిల్లల్లో క్యాన్సర్‌ వస్తోందని కొన్ని దేశాల్లో దాని వాడకాన్ని నిలిపివేశారు! మరి మిగతావైనా సురక్షితమేనా? దీనికి నిపుణులేం చెబుతున్నారో చదివేయండి.

శుభ్రత కాదు..

పిల్లల్ని అలర్జీలు, క్రిమికీటకాల నుంచి రక్షించాలన్న ఉద్దేశంతో రోజూ ఫ్లోర్‌ క్లీనర్లతో శుభ్రం చేస్తున్నారా? దోమల నుంచి కాపాడటానికి స్ప్రేలు, రెపలెంట్‌లూ వాడుతుండుంటారు. కానీ వాటితో బుజ్జాయిలకి హానే ఎక్కువని తెలుసా! బ్యాక్టీరియాతో పోరాడటానికి, ఉత్పత్తులు నిల్వ ఉండటానికి వీటిల్లో క్లోరిన్‌, ఫార్మాల్డిహైడ్‌ వంటి రసాయనాలు వాడతారు. ఇవి పిల్లల్లో దద్దుర్లు, కళ్లు ఎరుపెక్కడం, ఊపిరిలో ఇబ్బంది, రోగనిరోధకత తగ్గడం నుంచి నరాల బలహీనత, క్యాన్సర్‌ వరకూ దారి తీయొచ్చు. కాబట్టి.. సహజ పద్ధతుల్లో తయారైన క్లీనర్లు వాడాలి. దోమల విషయంలోనూ స్టికీ ట్రాప్స్‌ లేదా రసాయన రహిత పద్ధతులను ఎంచుకోండి.

పసిపిల్లల దుస్తులు శుభ్రం చేయడానికి చాలామంది బ్లీచ్‌ వాడుతుంటారు. దీనివల్ల దురద, కళ్లు మసకబారడం, గొంతు మంట, శ్వాస సమస్యలు వంటివి వస్తాయి. బదులుగా... హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ను వాడండి. పిల్లలకీ సురక్షితం, బ్యాక్టీరియా, వైరస్‌ల బెడదా ఉండదు.

ఫర్నిచర్‌కు త్వరగా నిప్పు అంటుకోకూడదని పీబీడీఏఎస్‌గా పిలిచే ఫ్లేమ్‌ రిటార్డెన్స్‌ను కోటింగ్‌గా వాడతారు. కారు సీట్లు సోఫాలు, కుషన్లు, కార్పెట్లు మొదలైన వస్తువుల తయారీలో దీన్ని ఉపయోగిస్తున్నారు. హార్మోన్లలో అసమతుల్యత, మానసిక ఎదుగుదల లోపాలు, త్వరగా యవ్వనంలోకి అడుగుపెట్టడం, హైపర్‌ ఆక్టివిటీ వంటి లక్షణాలు దీని చలవే. కొనేముందే ఇలాంటివేమైనా వాడారేమో చెక్‌ చేసుకోవాలి.

సంరక్షణేనా?

సబ్బు, షాంపూ.. నురగొస్తే కానీ శుభ్రపడిన భావన కలుగదు కదా! కానీ నురగ రావడం కోసం ఎస్‌ఎల్‌ఎస్‌, ఎస్‌ఎల్‌ఈ సల్ఫేట్లు వాడతారు. ఇవి 2 శాతానికి మించి ఉంటే ఊపిరితిత్తులపై దుష్ప్రభావం పడుతుంది. స్నానం చేశాక చిన్నారి సువాసనతో నిండిపోవాలి అనుకుంటాం కానీ ఇవి కృత్రిమ వాసనలే. దీనికోసం ఫ్తలేట్స్‌ని వాడతారు. ధర తక్కువని సంస్థలూ ఈ సింథటిక్‌ ఫ్రాగ్రెన్స్‌కి ప్రాధాన్యమిస్తాయి. ఇవేమో పునరుత్పత్తి, ఎదుగుదల లోపాలు కొన్నిసార్లు క్యాన్సర్‌కీ కారణమవుతాయి. ఉత్పత్తులు ఎంచుకునేప్పుడు ఎస్‌ఎల్‌ఎస్‌, ఎస్‌ఎల్‌ఈ లేనివీ ఫ్రాగ్రెన్స్‌ ఫ్రీవీ ఎంచుకోవాలి. చిన్నారుల కోసం వృక్షాధారిత ఉత్పత్తులు వస్తున్నాయి. వీటిల్లో కోకో గ్లైసనేట్‌ ఉంటుంది. ఇవి చర్మాన్ని శుభ్రం చేయడంతోపాటు సురక్షితంగా ఉంచుతాయి. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉన్నవి తీసుకుంటే సహజ సువాసన ఇస్తాయి.

పౌడర్‌.. వాడాలా వద్దా అన్నది ఇప్పుడు పెద్ద చర్చ. టాల్కమ్‌ పౌడర్‌ డస్ట్‌ పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. పైగా తయారీలో కలుషితమయ్యే అవకాశమెక్కువ. ఆస్‌బెస్టాస్‌ వంటి వాటి ఆనవాళ్లూ కనిపిస్తున్నాయి. దీంతో తుమ్ములు, దగ్గు, ఉదర భాగంలో నొప్పి వంటివి వస్తాయి. కానీ పిల్లల్ని దద్దుర్లు, చెమట నుంచి కాపాడటానికని దీన్ని వాడక తప్పదు. కాబట్టి, టాల్క్‌ ఫ్రీ బేబీ పౌడర్‌నో సహజ ప్రత్యామ్నాయంగా
మొక్క జొన్న పొడినో వాడటం మేలు.

ఉత్పత్తులు ఎక్కువకాలం నిల్వ ఉండటానికి పారాబెన్స్‌, ఫార్మాల్డిహైడ్‌ వంటివి కలుపుతారు. వీటిని చాలా దేశాల్లో నిషేధించారు. వీటివల్లా సంతానోత్పత్తి సమస్యలు, బరువు పెరగడం వంటి వాటికి అవకాశాలెక్కువ. బదులుగా గ్లుకనో లాక్టోన్‌ ఉన్నవి వాడాలి.

కాటుక.. కళ్లు పెద్దవి అవుతాయనో, దిష్టనో, కళ్లకి మంచిదనో పెడుతుంటాం. దీనిలో దురద, ఇన్ఫెక్షన్లను కలిగించే లెడ్‌ వంటి రసాయనాలు ఉంటాయి. ఇంట్లో తయారు చేసిన దానిలోనూ కార్బన్‌ ఉంటుంది. పెట్టేటప్పుడు చేతులు శుభ్రంగా లేకపోయినా ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. కాబట్టి, వాడొద్దు. పెట్టాల్సొస్తే కాలుపైనో, చెవి వెనకో పెట్టాలి. దాన్నీ స్నానానికి ముందే తుడిచేయాలి.

డైపర్లు.. పక్కతడవకుండా వేసే షీట్లు, డైపర్లలో ట్రైబ్యుటలిథీన్‌ (టీబీటీ) ఉంటుంది. దీంతో గుండె, పునరుత్పత్తి అవయవాలకు హాని. బదులుగా సేంద్రియ, వృక్షాధారిత, రసాయన రహిత, బయోడిగ్రేడబుల్‌, క్లాత్‌ డైపర్లు వాడాలి.


కడుపులోకి పంపిస్తున్నామేమో!

నం ఉపయోగించే ఉత్పత్తులూ పిల్లలకు చేటు చేయొచ్చు. ఉదాహరణకి సన్‌స్క్రీన్లలో ఆక్సిబెంజోన్‌ 2.2- 6 శాతం ఉంటుంది. ఇది శరీరంలోకి ఇంకి, పాలద్వారా పిల్లల్లోకి చేరి.. అలర్జీలు, హార్మోన్లలో మార్పులకు కారణమవుతుంది. కాబట్టి, జింక్‌ ఆక్సైడ్‌, టైటానియం ఆక్సైడ్‌ ఉన్నవే రాసుకోండి. ఆరు నెలల తర్వాత పిల్లలకి కొన్నిరకాల ప్యాక్డ్‌ ఆహారాన్నిస్తుంటాం. వాటి నిల్వకు ఫినాక్సీ ఇథనాల్‌ వాడతారు. పిల్లలకు స్తన్యం ఇచ్చేప్పుడు ఇరిటేషన్‌, చర్మం దెబ్బతినడం లాంటి సమస్యలకు నిప్పల్‌ క్రీమ్‌ వాడతాం కదా. దానిలోనూ ఈ రసాయనం ఉంటుంది. ఇది పిల్లల్లో డయేరియా, వాంతులకు కారణమవుతుంది.

పాలకోసం వాడే బాటిళ్లు, సిప్పింగ్‌ కప్‌లు, ప్రాసెస్‌డ్‌ ఆహార పదార్థాల్లో బీపీఏ అనే రసాయనం ఉంటుంది. వీటిని డిష్‌ వాషర్‌, మైక్రోవేవ్‌ అవెన్‌లో పెట్టడం, నీళ్లలో మరిగించడం చేస్తే ఈ బీపీఏ శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది.

ఇది మన ఒంట్లో ఈస్ట్రోజన్‌లా ప్రవర్తిస్తుంది. ఫలితమే ఊబకాయం, ఎర్లీ ప్యుబర్టీ, ఒవేరియన్‌ క్యాన్సర్‌ వంటివి. బదులుగా గ్లాస్‌, స్టీల్‌ సీసాలను వాడాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్