బడ్జెట్‌లో ఆరోగ్యం..

నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు... ఇలా అన్నింటి ధరలూ రోజురోజుకీ పెరుగుతున్న పరిస్థితుల్లో ఉన్న బడ్జెట్‌లోనే కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం ఎలాగో అర్థం కావడం లేదు

Published : 11 Sep 2022 00:40 IST

నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు... ఇలా అన్నింటి ధరలూ రోజురోజుకీ పెరుగుతున్న పరిస్థితుల్లో ఉన్న బడ్జెట్‌లోనే కుటుంబ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం ఎలాగో అర్థం కావడం లేదు మీనాక్షికి. దీనికి నిపుణులు కొన్ని సూచనలు, సలహాలిస్తున్నారు. అవేంటో చూద్దాం.

పోషకాహారాన్ని తీసుకోవాలంటే ఖర్చుతో కూడిన పని అనుకోవడం సహజమే. అయితే మనకున్న బడ్జెట్‌లోనే ఇంటిల్లపాదినీ ఆరోగ్యంగా ఉంచొచ్చు. అందుకు ముందుగా వృథా ఖర్చులను గుర్తించి నిరోధించాలి. వారంలో ఒక రోజు కేటాయించుకొని, ఆ వారంలో ఏమేం వండాలనుకుంటున్నారో నోట్‌ చేయాలి. కావాల్సిన కూరగాయలు, నిత్యావసర వస్తువులున్నాయా లేదా చెక్‌ చేసుకోవాలి. ఫ్రిజ్‌లో కూరగాయలు, వెన్న, గుడ్లు, బ్రెడ్‌ వంటి వాటిని చూడాలి. అవి వృథాకాక ముందే చేయగలిగిన వంటకాలను ఈ వారంలో చేసేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఇలా ముందుగానే చెక్‌ చేస్తే, వాటినే తిరిగి తెచ్చుకోవాల్సిన పని ఉండదు. వాటితో ఒకట్రెండు రోజులు లంచ్‌, డిన్నర్‌ తయారు చేయొచ్చు. దుకాణానికెళ్లినప్పుడు చేతిలోని లిస్ట్‌కే కట్టుబడి ఉండాలని, కనిపించినవన్నీ కొనకుండా ఉండాలని ముందుగానే మనసులో గట్టిగా అనుకోవాలి. అప్పుడే బడ్జెట్‌లో ఉండగలుగుతాం.

ఇంట్లోనే..
ప్రత్యేక సందర్భాల్లోతప్ప, ఇంటి ఆహారానికే ఓటెయ్యాలి. దీనివల్ల ఖర్చు తగ్గుతుంది. ఆరోగ్యాన్నీ.. పరిరక్షించుకోవచ్చు. బంధువులు, స్నేహితులను ఆహ్వానించినప్పుడు మనమే వండి వడ్డించగలిగితే ఆ రుచికి అందరూ ఫిదా అవుతారు. ఇంటి బడ్జెట్‌నూ.. దాటిపోకుండా చూడొచ్చు. రోజూ సరిపడా మాత్రమే వండటం అలవరుచుకోవాలి. లేదంటే మిగిలిన ఆహారం వృథా అవుతుంది. ఎప్పుడైనా అన్నం మిగిలితే, పులిహోర, కూరగాయలు కలిపిన రైస్‌ వంటివి కొత్తగా చేసి రుచి చూపించొచ్చు. ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. అనవసర ఖర్చుకుతోడు అనారోగ్యాలనూ తెస్తాయి. వీటికోసం పెట్టే ఖర్చులో సగాన్ని తాజా పండ్ల కోసం కేటాయిస్తే ఆరోగ్యానికి మంచిది. నిత్యావసర వస్తువులను హోల్‌సేల్‌గా తీసుకుంటే ఖర్చు తగ్గుతుంది. చిన్న వస్తువులను ఏరోజుకారోజు కొనడం కన్నా,  ఒకే సారి కొంటే మంచిది. బ్రాండ్‌ అని చూసుకోకుండా నాణ్యతకు పెద్దపీట వేయాలి. విటమిన్లు, ప్రొటీన్లు, పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు, ఆకుకూరలను ఇంటి పెరట్లో పెంచితే ఆరోగ్యం సొంతమవుతుంది. బడ్జెట్‌ కూడా పెరగదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని