చెబితేనే తెలుస్తుంది!

మన శరీరం గురించి అంతా తెలుసు అన్న భ్రమలో ఉంటాం. కానీ కొన్ని అనారోగ్యాల విషయాలపై మనకి కనీస అవగాహన కూడా ఉండదు.

Published : 16 Oct 2022 00:34 IST

మన శరీరం గురించి అంతా తెలుసు అన్న భ్రమలో ఉంటాం. కానీ కొన్ని అనారోగ్యాల విషయాలపై మనకి కనీస అవగాహన కూడా ఉండదు. అలాంటి సమస్యల్లో ఒకటే... పీఓపీ. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య బారిన పడుతున్న మహిళలు పెరుగుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి...

పీఓపీ అంటే.. పెల్విక్‌ ఆర్గాన్‌ ప్రొలాప్స్‌. కటి ప్రాంతంలో ఉండే.. మూత్రాశయం, గర్భాశయం, యోని అంతర్భాగం, చిన్నపేగులు వంటివి ఉండాల్సిన స్థానంలో కాక పక్కకు జరగడాన్ని పీఓపీ అంటారు. అమెరికా వంటి దేశాల్లోనే పద్దెనిమిదేళ్లు పైబడిన మహిళల్లో మూడోవంతు మంది ఈ పీఓపీ సమస్యని ఎదుర్కొంటున్నారు. మనదేశంలోనూ ఉత్తరాఖండ్‌ వంటి ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగానే ఉంది. ఈ సమస్యపై అవగాహన లేకపోవడం, చెప్పడానికి సిగ్గుపడటంతో పీఓపీ సమస్య ముదురుతోందని అలబామా విశ్వ విద్యాలయం చేసిన అధ్యయనంలో తేలింది. గర్భధారణ, సాధారణ ప్రసవాలు, మెనోపాజ్‌, అధిక బరువు, ఆగకుండా వేధించే దగ్గు, మలబద్ధకం వంటి సమస్యల వల్ల కటి కండరాలు వదులుగా మారి పీఓపీ సమస్య మొదలవుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో మూత్ర విసర్జనపై అదుపు ఉండదు. పొత్తి కడుపు దిగువన బరువుగా, అసౌకర్యంగా అనిపిస్తుంది. తీవ్రమైన నొప్పి ఉంటుంది. సాధారణంగా ఇలాంటి సమస్యల్ని మహిళలు నోరు తెరిచి బయటకు చెప్పలేరు. అందు వల్లనే పీఓపీ రోజురోజుకీ పెరుగుతోంది. దీనికి పరిష్కారం లేదా అంటే... సమస్య ఎదురైనప్పుడు గైనకాలజిస్టులనీ, యూరో గైనకాలజిస్టులని కలిస్తే పరిష్కారం దొరుకుతుంది. కెగెల్స్‌ వంటి పెల్విక్‌ ఫ్లోర్‌ వ్యాయామాలు చేయడం, అధిక బరువు తగ్గించుకోవడం, పీచు ఉండే ఆహారం తినడం ఇందుకు పరిష్కారాలు అంటున్నారు నిపుణులు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని