రెండు పండ్లు.. మూడు కూరలు.. నిండు నూరేళ్లు!

రోజూ ఆహారంలో కనీసం అయిదు భిన్న రకాల కూరగాయలూ/ఆకుకూరలూ, పండ్లూ తీసుకునేవారిలో అనారోగ్య సమస్యలు తగ్గి ఆయష్షు పెరుగుతోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

Published : 17 Oct 2022 00:28 IST

రోజూ ఆహారంలో కనీసం అయిదు భిన్న రకాల కూరగాయలూ/ఆకుకూరలూ, పండ్లూ తీసుకునేవారిలో అనారోగ్య సమస్యలు తగ్గి ఆయష్షు పెరుగుతోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

* రోజూ అయిదు విడతల్లో రెండే రకాల పండ్లూ, కూరగాయలు తీసుకునేవాళ్లతో పోల్చితే రెండు పండ్లూ, మూడు కూరగాయలు/ఆకుకూరలు తీసుకునేవాళ్లలో.. గుండె జబ్బుల ముప్పు 12 శాతం, క్యాన్సర్‌ ముప్పు 10 శాతం, శ్వాసకు సంబంధించిన సమస్యలు 35 శాతం తక్కువని పలు అధ్యయనాల్లో తేలింది.

* ఒక విడతలో 125 గ్రాముల కూరగాయలూ/పండ్లూ, లేదా 250 గ్రాముల ఆకుకూరల్ని సలాడ్‌లుగా ఎలా తీసుకున్నా.. రెండింటి నుంచీ సమాన మోతాదులో విటమిన్లు, ఖనిజాలూ, ఫైబర్‌ అందుతాయి. కానీ కూరగాయలూ, ఆకుకూరల్లో క్యాలరీలూ, చక్కెర నిల్వలు తక్కువ. అందుకే వీటికే ఎక్కువగా తీసుకోమంటున్నారు. ముఖ్యంగా టైప్‌-2 మధుమేహం ఉన్నవాళ్లు పండ్లకంటే కూడా వీటికే ప్రాధాన్యమివ్వాలంటున్నారు.

* పండ్లూ, కూరగాయల్లో నిత్యం భిన్నమైనవి తీసుకోవడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. అలాంటప్పుడే శరీరానికి భిన్నమైన పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్లు అందుతాయి. దాదాపు అన్ని రకాల పండ్లూ, కూరగాయలూ ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే మొక్కజొన్న, బంగాళాదుంప, బఠానీ లాంటివాటిలో ఉండే అధిక గ్లైసమిక్‌ వల్ల శరీరంలో చక్కెర స్థాయులు పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి వీటిని తక్కువగా తీసుకోవాలి.

* తాజావీ, ఫ్రిజ్‌లో ఉంచినవీ, సాధారణ లేదా సేంద్రియ విధానంలో పండించినవి.. వేటినైనా తీసుకోవాలి. స్థానికంగా అందుబాటులో ఉండే వాటిలో ఏవి తీసుకున్నా మేలే.

* సలాడ్లగానే కాకుండా స్మూథీలూ చేసుకోవచ్చు. ఉడికించి తినొచ్చు. కూరలూ వండుకోవచ్చు... ఇలా ఏ రూపంలో తీసుకున్నా వాటితో ప్రయోజనాలుంటాయట. కొద్దిగా నూనెలో కలవడంవల్ల శరీరం విటమిన్లనీ, యాంటీ ఆక్సిడెంట్లనూ బాగా శోషించుకుంటుందనీ చెబుతున్నారు నిపుణులు.

మరెందుకు ఆలస్యం ‘రెండు, మూడు.. నూరు’ని మీ ఇంట్లోనూ అవలంబించేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని