మెదడుకు ఒమేగా- 3

మెనోపాజ్‌ తర్వాత ఈస్ట్రోజన్‌ స్థాయులు తగ్గుతున్నప్పుడు ఎముకలకు కావాల్సిన ఖనిజ సాంద్రతను ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Published : 04 Nov 2022 01:11 IST

మెనోపాజ్‌ తర్వాత ఈస్ట్రోజన్‌ స్థాయులు తగ్గుతున్నప్పుడు ఎముకలకు కావాల్సిన ఖనిజ సాంద్రతను ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. తాజాగా చేపట్టిన ఓ అధ్యయనం ఒమేగా-3 ఫాటీయాసిడ్స్‌ మహిళల్లో జ్ఞాపక శక్తిని పెంచడంతోపాటు మెదడు సృజనాత్మకంగా, విశ్లేషణాత్మకంగా పని చేసేలా దోహదపడుతుందని చెప్పింది. ఈ అధ్యయనం.. ఇంకా ఏం చెప్పిందంటే.. 

మెదడులో రక్తప్రసరణను మెరుగుపరచడం ద్వారా జ్ఞాపకశక్తి తగ్గకుండా ఒమేగా 3 కాపాడుతుంది. దీంతో వృద్ధాప్యంలో అల్జీమర్‌ వంటి వ్యాధులు దరికి చేరవు. జ్ఞాపకశక్తికి సంబంధించి మెదడుపైన అర్ధ చంద్రాకారంలో ఎత్తుగా ఉండే భాగం (హిప్పోకాంపస్‌) అనుసంధానంగా పని చేస్తుంటుంది. అధ్యయనంలో 46 ఏళ్ల వయసున్న వారి మెదడును పరిశీలించినప్పుడు ఈ ప్రాంతంలో అత్యధికంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ను గుర్తించారు. మధ్య వయసు దాటుతున్నప్పుడు హిప్పోకాంపస్‌ పరిమాణం తగ్గుతూ వస్తుంది. ఈ సమయంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఆ ప్రాంతం శక్తిహీనం కాకుండా, పని తీరును మెరుగుపరుస్తుంది. చిన్న విషయాల్నీ జ్ఞాపకం పెట్టుకోగలగడం, ఇతరులను ప్రేమించడం, విజయం సాధించేలా ఉత్సాహంగా ఆలోచించడం వంటి లక్షణాలు కోల్పోకుండా ఉండటానికి, మెదడును ప్రేరేపించడానికి ఫ్యాటీ యాసిడ్స్‌ దోహదపడతాయి. లేటు వయసులోనూ సమస్యలను తేలికగా పరిష్కరించుకోగల నైపుణ్యం అలవడుతుంది. సాల్మన్‌ చేప, ఫ్లాక్స్‌సీడ్స్‌, చియా సీడ్స్‌, అక్రోట్లు, సోయాబీన్స్‌, గుడ్లు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, మొలకలు వంటివి నిత్యం ఆహారంలో ఉండేలా జాగ్రత్తపడాలి. రోజూ ఏడు గంటల నిద్ర మెదడుకు ఒత్తిడిని దరి చేరనివ్వదు. ఇవన్నీ మెనోపాజ్‌లో కూడా మెదడు ఆరోగ్యంగా పని చేసేందుకు దోహదం చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని