ఆరోగ్యానికి ఈ విత్తనం
సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా... చిన్నగా ఉన్నా మంచి ఫలితాల్నిస్తుంది గుమ్మడి విత్తనం. పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఇందులో బరువు సమస్యను తగ్గించే ఔషధ గుణాలున్నాయి.
సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా... చిన్నగా ఉన్నా మంచి ఫలితాల్నిస్తుంది గుమ్మడి విత్తనం. పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఇందులో బరువు సమస్యను తగ్గించే ఔషధ గుణాలున్నాయి. వీటిని ఏదో రూపంలో రోజూ తీసుకొంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుందని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
గుమ్మడి విత్తనాల్లో ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, కాపర్, జింక్‌సహా ఆరోగ్యకరమైన కొవ్వులున్నాయి. ఈ విత్తనాలు చక్కెర స్థాయులను అదుపులో ఉంచి, టైప్ 2 డయాబెటిస్ రాకుండా కాపాడతాయి. నిద్రలేమి సమస్య ఉన్నప్పుడు నాలుగైదు గుమ్మడి విత్తనాలను తింటే చాలు. వీటిలోని ట్రిప్టోఫాన్, జింక్ కలిసి సెరటోనిన్‌గా మారుతుంది. ఇది తిరిగి మెలటోనిన్ హార్మోన్‌గా మారి కంటి నిండా నిద్ర పట్టడానికి దోహదపడుతుంది.
అధికబరువును.. గుమ్మడి విత్తనాలను కాసిని తీసుకుంటే చాలు. పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ శక్తి అందినట్లు అనిపిస్తుంది. ఎందుకంటే వీటిలో ప్రొటీన్లు, అధిక కెలోరీలు ఉంటాయి. వీటిలోని పీచు జీర్ణశక్తిని మెరుగుపరిచి వ్యర్థాలను బయటకు పంపుతుంది. దీంతో బరువు సమస్యకు దూరంగా ఉండొచ్చు.
గాయాలకు.. వీటిలో ఉండే జింక్ బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడి, వ్యాధి నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. మాంగనీస్, కె విటమిన్ గాయాలు త్వరగా నయమవడానికి సాయపడతాయి. రోజూ ఉదయం అల్పాహారంతో పాటు 10 గింజలు తినండి. లేదా భోజనాల మధ్యలో సలాడ్‌లో కలిపి తీసుకున్నా చాలు. రుచి పెరుగుతుంది. ఆరోగ్యం సొంతమవుతుంది.
ఆరోగ్యం.. అందం: గుమ్మడి విత్తనాల్లో కుకుర్‌బిటాసిన్, అమినోయాసిడ్ శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో ఉండే ఇ విటమిన్, కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు ఎదుగుదలకు తోడ్పడతాయి. కొల్లాజెన్ తయారీని ఉత్తేజపరిచి చర్మానికి మృదుత్వంతోపాటు సాగే గుణాన్ని అందిస్తుంది. దీంతో చర్మం ఆరోగ్యంగా మెరుపులీనుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.