కౌమారంలో అతిగా ఆహారం...

ఆహారాన్ని తీసుకోవడంలో తల్లిదండ్రులు తమ పట్ల అనుసరించే కొన్ని పద్ధతులు పిల్లల ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. ఇది వారిని కౌమార దశకొచ్చే సరికి అతిగా తినే అలవాటును చేస్తుందని చెబుతున్నారు.

Published : 19 Nov 2022 01:00 IST

ఆహారాన్ని తీసుకోవడంలో తల్లిదండ్రులు తమ పట్ల అనుసరించే కొన్ని పద్ధతులు పిల్లల ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తాయంటున్నారు నిపుణులు. ఇది వారిని కౌమార దశకొచ్చే సరికి అతిగా తినే అలవాటును చేస్తుందని చెబుతున్నారు.

మనసుకు నచ్చకపోయినా, పెద్దవాళ్లు బలవంతం చేస్తే ఆహారాన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ ఆందోళన, ఒత్తిడిని సమన్వయం చేయలేక తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లలు తినడం మొదలుపెడతారు. పోషకాహారాన్ని తీసుకోవడానికి ముందుకు రాని చిన్నారులకు కొందరు తల్లిదండ్రులు ప్రత్యామ్నాయంగా జంక్‌ఫుడ్స్‌ అలవాటు చేస్తారు. పిల్లలు ఏదో ఒకటి తింటున్నారు, అంతే చాలని భావిస్తారు. అయితే ఇవన్నీ పిల్లల ఆహారపుటలవాట్లపై చెడు ప్రభావం చూపిస్తున్నాయి. క్రమేపీ అది అతిగా తినే అలవాటుగా మారుతోంది. క్రమశిక్షణ లేకుండా, నిర్ణీత సమయాలకు ప్రాధాన్యమివ్వకుండా మొదలయ్యే ఈ అలవాట్లు పిల్లలకు కౌమారదశలోనే అధిక బరువు సమస్యకు గురి చేస్తున్నాయి.

చిరుతిళ్లు.. పిల్లలతో ఎలాగైనా తినిపించాలని ప్రత్యేక పద్ధతులను అవలంబిస్తారు. ఫలానాదే తినాలి అన్న ఆంక్షలు పిల్లలకు ఆహారంపై ఆసక్తిని తగ్గిస్తాయి. నచ్చకపోయినా బలవంతంగా తింటారు. అలాగే అమ్మానాన్న ఇచ్చే బహుమతుల కోసం మనసుకు నచ్చకపోయినా, ప్లేటులో భోజనమంతా పూర్తి చేస్తుంటారు. ఈ భావోద్వేగాలు పిల్లల ఆహారపుటలవాట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ఆకలితో నిమిత్తం లేకుండానే ఆహారాన్ని తీసుకుంటారు. ఈ అసంతృప్తి నుంచి బయటపడటానికి చిరుతిళ్లవైపు అడుగులేస్తారు. యుక్త వయసుకు రాకమునుపే అతిగా తినడం మొదలై, అధిక బరువుకు చేరువవుతారు.

బాల్యం నుంచి.. చిన్నారులకు ఆహారం రుచిని తెలిసేలా చేయాలి. పోషక విలువలపై అవగాహన పెంచుతూ.. చిన్నప్పటి నుంచి వర్ణభరితమైన కాయగూరలు, పండ్లు వంటివి చేరువ చేయాలి. ఆహారం తీసుకోవడమంటే.. కష్టమైన పనిగా కాకుండా ఇష్టంగా తినాలని పిల్లలకు నేర్పించాలి. కుటుంబమంతా ఒకేసారి భోజనం చేయడం, ఆహారం గురించి మాట్లాడుకోవడం వంటివన్నీ చిన్నప్పటి నుంచి పిల్లలకు తాము తినేదానిపై ఆసక్తిని పెంచుతాయి. వారికిష్టమైన కూరగాయల గురించి అడిగి తెలుసుకొని, ఎలా పండిస్తారు, వాటిలో ఏయే పోషకాలు ఉంటాయి, అవి శరీరానికి ఎలా మేలు చేస్తాయి అన్నవి చెప్పాలి. అప్పుడే ఆహారం విలువ తెలిసి, తృప్తిగా తింటారు. అది వారి ఆరోగ్యాన్ని పెంచుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్