Published : 11/02/2023 00:23 IST

ఆరోగ్యంతోనే అందం!

అందంగా కనిపించాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి. అయితే, మారిన జీవనశైలిలో బరువు పెరగడానికీ, ముఖం కళ తప్పడానికీ కొన్ని కారణాలు ఉన్నాయంటారు వైద్యులు. అవేంటో చెబుతూ వాటికి పరిష్కారాలను సూచిస్తున్నారు.

ఎలా తింటున్నారు... ఆరోగ్యంగా ఉండాలన్నా, అందంగా కనిపించాలన్నా... శరీరానికి పోషకాలన్నీ సమతులంగా అందాలి. బరువుని నియంత్రించు కోవాలనుకున్నప్పుడు ఈ సూత్రాన్ని మరచిపోకూడదు. అతిగా తినడం ఎంత తప్పో.. కెలొరీలు లెక్కేసుకుంటూ తినడమూ అంతే పొరపాటు. రోజూ అందాల్సిన పోషకాలేంటో గమనించుకుని ఆకుకూరలూ, కాయగూరలూ, పప్పుధాన్యాలూ, పాలూ, గుడ్లు వంటి అన్నింటి సమ్మేళనంగా డైట్‌ ఉండేలా చూసుకుంటే మీ సమస్యలన్నీ త్వరగా అదుపులోకి వస్తాయి.

నిద్రపడుతుందా... ఉపాధి, ఉద్యోగాల తీరుతెన్నులు మారాయిప్పుడు. దాంతో పగలూ, రాత్రీ తేడాలేకుండా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. కొంత సమయాన్ని డిజిటల్‌ గ్యాడ్జెట్స్‌ ఆక్రమిస్తున్నాయి. ఫలితంగా నిద్రవేళల్లో మార్పులు వచ్చాయి. కనీసం ఏడెనిమిది గంటలు గాఢనిద్ర లేనిదే... మోములో మెరుపు కనిపించదు. ఉత్సాహంగానూ ఉండలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకునే నిద్రపోండి. అది హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది.

ఒత్తిడవుతున్నారా... మారిన జీవనశైలి ప్రతి పనిలోనూ ఒత్తిడికి కారణమవుతోంది. బాధ్యతల నిర్వహణ, భావోద్వేగాల నియంత్రణ...కారణం ఏదైనా ఒత్తిడే ఆరోగ్యానికి ప్రథమ శత్రువు. దీన్ని అధిగమించడానికి ధ్యానం చేయండి. యోగాను అలవరుచుకోండి. తోటపనీ, ఇతరత్రా హాబీలపై మనసుపెట్టండి. కచ్చితంగా బాగుంటారు.

శారరీక శ్రమ కావాలి... తీసుకున్న ఆహారానికి తగినంత శ్రమలేకపోతే శరీరంలో ఈస్ట్రోజన్‌ తగ్గిపోయి టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ స్థాయులు పెరిగిపోతాయి. ఫలితంగా ఒత్తిడీ, అధికబరువూ, నెలసరి తప్పడం వంటి ఇబ్బందులూ ఎదురవుతాయి. ఇవి మీ ముఖం, శరీర బరువుపై ..ఆ తర్వాత ఆరోగ్యంపైన కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. అందుకే మీకు నచ్చినట్లుగా... ఓ అరగంట కసరత్తుల కోసం కేటాయించుకోండి. జాగింగో, వాకింగో చేయడం ఇష్టం లేకపోవచ్చు. వీలైతే ఇంట్లోనే నచ్చిన పాటను వింటూ నృత్యం చేయండి. సల్సా, జుంబా, వాటర్‌యోగా తరగతికో వెళ్లండి. సమస్యలు నియంత్రణలోకి వస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని