Published : 09/03/2023 01:13 IST

ఆలస్యమవుతోందా.. చేసేయండిలా!

నెలసరి సమయంలో నొప్పి, అసౌకర్యం.. లాంటివి సాధారణమే! అది వచ్చినపుడే కాదు.. ఆలస్యమైనప్పుడూ శారీరకంగా చాలా ఇబ్బంది అనిపిస్తుంది. వాతావరణ మార్పులు, జీవనశైలి కారణంగా చాలామందికి నెలసరి తప్పుతుంటుంది. సరైన సమయానికి రావాలంటే వీటిని అనుసరించమంటున్నారు నిపుణులు!

* కొద్దిపాటి వ్యాయామం కండరాలకు విశ్రాంతి నివ్వడమే కాదు.. నెలసరిని క్రమబద్ధీకరించడంలోనూ సాయపడుతుంది. తేలిక నుంచి మధ్యస్థ వ్యాయామాలను రోజులో భాగం చేసుకోండి. సాధారణంగా అధిక బరువు, హార్మోనుల్లో అసమతుల్యత నెలసరి ఇబ్బందులకు కారణమవుతుంది. వ్యాయామం ఈ రెంటికీ చెక్‌ పెట్టేయగలదు. నడక, ఏరోబిక్స్‌, డ్యాన్స్‌.. ఇలా నచ్చినదానికి రోజూ 30 నిమిషాలు కేటాయించాలంతే.

* శారీరక సమస్యలే కాదు.. ఒత్తిడి ప్రభావం కూడా నెలసరిపైనే పడుతుంది. కాబట్టి, వీలైనంత ప్రశాంతంగా మనసును ఉంచుకునే ప్రయత్నం చేయండి. యోగా, ధ్యానం, స్నేహితులతో సమయం గడపడం, పాటలు వినడం.. ఇలా మీ మనసుకు శాంతిని చేకూర్చే వాటిపై దృష్టిపెడితే సరి.

* విటమిన్‌ సి ఈస్ట్రోజన్‌ స్థాయులను పెంచుతుంది. అంతేకాదు శరీరక ప్రక్రియలు సక్రమంగా జరగడానికి అవసరమైన వేడినీ పుట్టించగలదు. ఇది మెన్‌స్ట్రువల్‌ సైకిల్‌కీ ప్రయోజనకరం. కాబట్టి, ఇది ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలకు రోజువారీ ఆహారంలో చోటివ్వండి.

* నెలసరిని క్రమబద్ధీకరించడంలో బెల్లానిదీ ప్రధాన పాత్రే. సంప్రదాయ విధానమే అయినా బాగా పనిచేస్తుంది కూడా! అదనంగా ఐరన్‌, హిమోగ్లోబిన్‌నీ వృద్ధి చేస్తుంది. రోజూ తీసుకుంటే సరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని