హిమోగ్లోబిన్‌ పెరిగేందుకు..

మహిళల్లో మూడొంతుల మంది రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో హిమోగ్లోబిన్‌ ఎక్కువగా ఉన్నప్పుడే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మరి అది సహజంగా పెరగాలంటే ఇలా చేయమంటున్నారు నిపుణులు.

Updated : 08 May 2023 02:50 IST

మహిళల్లో మూడొంతుల మంది రక్తహీనతతో ఇబ్బంది పడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రక్తంలో హిమోగ్లోబిన్‌ ఎక్కువగా ఉన్నప్పుడే పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. మరి అది సహజంగా పెరగాలంటే ఇలా చేయమంటున్నారు నిపుణులు.

కాడలతో.. క్యాలిఫ్లవర్‌ కూర వండేటప్పుడు కింది భాగంలో ఉండే కాడల్ని పడేస్తాం. వీటిల్లో ఐరన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కూడా కూరల్లో ఉపయోగించటం వల్ల శరీరానికి తగినంత ఐరన్‌ అందుతుంది. ఏ కూర వండినా ఉల్లిపాయని వాడినట్లు క్యాలిఫ్లవర్‌ కాడల్ని కూడా సన్నగా తరిగి వినియోగించొచ్చు.

ఆకుకూరలు.. మన రోజువారీ డైట్‌లో భాగంగా ఆకుకూరలు తీసుకోవాలి. జంక్‌ ఫుడ్‌ తింటే... బరువు పెరుగుతారు. శరీరంలో ఐరన్‌ శాతం తగ్గిపోతుంది. కనీసం ఇంట్లో రోజుకొక ఆకుకూర వండాలనే నియమాన్ని పెట్టుకోండి. పాలకూరలో ఎక్కువ మోతాదులో ఐరన్‌ ఉంటుంది. రోజూ కూర తినలేకపోతే రోటిపచ్చడి, ఆకుకూర రైస్‌ లాంటి వాటితో ఇష్టంగా తినొచ్చు. చపాతీ పిండి కలిపేటప్పుడు పలు రకాల ఆకుకూరల పేస్టులను దాంట్లో వేయొచ్చు. పిల్లలకు  స్నాక్స్‌ రూపంలో పెట్టి చూడండి. వాటి రంగుని చూసి తినేందుకు కూడా ఇష్టపడతారు.

జ్యూసులతో.. బీట్‌రూట్‌, క్యారెట్‌ రసాలతో శరీరంలో తొందరగా రక్తం వృద్ధి చెందుతుంది. నల్లద్రాక్ష, యాపిల్‌, దానిమ్మ వంటి పండ్లను తినలేకపోతే రసం తీసుకొని తాగొచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే  దీంట్లో పంచదారకు బదులుగా తేనె కలుపుకొంటే సరి.

డ్రైఫ్రూట్స్‌తో..  డ్రైఫ్రూట్స్‌ తీసుకోవటం వల్ల శక్తితో పాటు ఐరన్‌ కూడా అధిక మోతాదులో లభిస్తుంది. ప్రతి రోజూ బాదం, ఎండుద్రాక్ష, ఖర్జూరం నానపెట్టుకొని తినాలి. అలా తినలేకపోతే నూనె లేకుండా దోరగా వేయించి మిక్సీలో మెత్తగా చేసి ఖర్జూరంతో కలిపి లడ్డూ చుట్టుకోవచ్చు. పిల్లలు కూడా ఇలా తినడానికి ఇష్టపడతారు. గుమ్మడి, దోస, పలురకాల గింజల్ని వీటికి కలిపితే రుచి, ఆరోగ్యం రెండూ అందుతాయి.

బెల్లంతో.. ఐరన్‌ ప్రధానంగా దొరికే పదార్థం బెల్లం. దీన్ని తరచూ ఆహారంలో తీసుకుంటే రక్తహీనత దరికి చేరదు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే వేరుశనగలు, నువ్వులతో బెల్లాన్ని కలిపి లడ్డూలు, చిక్కీలు వంటివి చేసుకొని తినాలి. రోజూ కనీసం ఒక చిన్న ముక్క బెల్లాన్ని అయినా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్