కండరాల నొప్పులా?
అశ్వినికి రోజులో గంటసేపైనా వ్యాయామాలు చేయాలని ఉంటుంది. అయితే రెండు మూడు రోజులకే కండరాలు, పాదాల నొప్పులు మొదలవుతాయి. దాంతో మూడు నాలుగువారాలపాటు వర్కవుట్లకు దూరమవుతుంది.
అశ్వినికి రోజులో గంటసేపైనా వ్యాయామాలు చేయాలని ఉంటుంది. అయితే రెండు మూడు రోజులకే కండరాలు, పాదాల నొప్పులు మొదలవుతాయి. దాంతో మూడు నాలుగువారాలపాటు వర్కవుట్లకు దూరమవుతుంది. గాయాలపాలవకుండా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడమెలా...
స్మార్ట్‌గా.. వర్కవుట్లు చేసేటప్పుడు ధరించే దుస్తుల నుంచి పాదరక్షల ఎంపిక వరకు జాగ్రత్త వహించాలి. వ్యాయామం మొదలుపెడుతున్నామనే ఉత్సాహంతో రంగు నచ్చిందనో, డిజైన్ బాగుందనో నచ్చిన వాటిని కొనేయకూడదు. ఎంత దూరం నడిచినా పాదాలకు అలసట తెలియని, కండరాలపై ఒత్తిడి కలిగించని మేలిరకం వాటిని ఎంచుకోవాలి. పాదాలకు చెమట పట్టినా దుర్వాసన, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చేసేవాటికి పెద్దపీట వేయాలి. ప్రస్తుతం మార్కెట్లో ప్రత్యేకంగా స్పోర్ట్స్‌వేర్ లభ్యమవుతున్నాయి. చెమటను పీలుస్తూ, శరీరానికి సౌకర్యవంతంగా అనిపించాలి. బిగుతుగా ఉంటే కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతో అనారోగ్యాలు దరి చేరే ప్రమాదం ఉంది.
సరైనరీతిలో.. వ్యాయామాలను ఎంచుకొనేటప్పుడు శిక్షకుల సలహాలను పాటించాలి. శరీర బరువుతోపాటు, వయసునూ దృష్టిలో ఉంచుకొని ఎంచుకోవాలి. ఏయే వ్యాయామం ఎంతసేపు, ఎన్నిసార్లు, ఎలా చేయాలో అవగాహన పొందాలి. కొత్తగా మొదలుపెట్టేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. లేదంటే కండరాలు, ఎముకలు గాయపడే అవకాశాలెక్కువ. దీంతోపాటు వ్యాయామాలు చేసేటప్పుడు, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిసుండాలి. డీహైడ్రేట్ కాకుండా ద్రవ పదార్థాలు, పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి.
రన్నింగ్‌లో.. వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలనుకున్నప్పుడు మొదటిరోజే ఎక్కువ దూరం ప్రయత్నించడం మంచిది కాదు. ఇది కండరాలు, ఎముకలను గాయాలపాలు చేస్తుంది. వ్యాయామం మాట అటుంచి, వారాల తరబడి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. తక్కువ దూరంతో మొదలుపెట్టి క్రమేపీ దూరం పెంచాలి. అలాగే రోజూ కిలోమీటర్ల కొద్దీ పరుగుపెట్టాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. వారంలో నాలుగైదు రోజులపాటు రన్నింగ్, మిగతా రెండు రోజులు వేరే రకమైన వ్యాయామాలు చేస్తే చాలని సూచిస్తున్నారు. ఇందుకు నిపుణులు లేదా శిక్షకుల సలహాలను పాటిస్తే మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.