మూడ్‌..మార్చేయండి!

కోపంతో అరవాల్సిన పనేలేదు మనకి. చిన్న మాట.. కాస్త నిర్లక్ష్యం చాలు చిరునవ్వు చెరిగిపోగలదు. ఒత్తిడి.. హార్మోనుల్లో మార్పులు కూడా ఒక్కోసారి మూడీగా చేసేస్తాయి. దాన్నుంచి తక్షణం బయటపడే మార్గాలివి!

Updated : 29 Jun 2023 00:54 IST

కోపంతో అరవాల్సిన పనేలేదు మనకి. చిన్న మాట.. కాస్త నిర్లక్ష్యం చాలు చిరునవ్వు చెరిగిపోగలదు. ఒత్తిడి.. హార్మోనుల్లో మార్పులు కూడా ఒక్కోసారి మూడీగా చేసేస్తాయి. దాన్నుంచి తక్షణం బయటపడే మార్గాలివి!

⚛ వ్యాయామం.. మనసును తేలికపరిచే హార్మోన్లుగా ఎండార్ఫిన్లకు పేరు. వ్యాయామం చేసినప్పుడు మెదడులో ఇవి విడుదలవుతాయి. కాబట్టి, బ్రిస్క్‌ వాక్‌, నృత్యం, నెమ్మదిగా పరుగు.. ఇలా నచ్చింది చేసేయండి. ఆనందం తిరిగి దరి చేరుతుంది.

ప్రేమను పంచండి.. మూడ్‌ బాలేనప్పుడు ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది కదా! అలాకాకుండా అమ్మకి ఫోన్‌ చేయండి. పోనీ నాన్నతో కబుర్లు చెప్పండి. చాలా రోజులుగా మాట్లాడని స్నేహితురాలు.. మనసుకు నచ్చినవాళ్లు ఇలా ఎవరో ఒకరితో మాట కలపండి. వాళ్లపై మీ ప్రేమను వ్యక్తీకరించండి. దిగులును పంచుకున్నా మంచిదే. మనసు భారం ‘హుష్‌’మని మాయమైపోతుంది.

⚛ పరుగాపండి.. చదువు, ఆఫీసు, ఇల్లు.. ఇలా ఏదో ఒక పనితో తీరిక లేకుండా గడుపుతున్నారా? ఈ నిరంతర ఒత్తిడి భావోద్వేగాలపై ప్రభావం చూపగలదు. అలాగని పర్యటనలకే వెళ్లక్కర్లేదు. తరచూ విరామాలు తీసుకోవచ్చు. మనసు చిరాకు పెడుతోంటే ఓ పాట వినడమో.. బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు చేయడం, కాసేపు కళ్లు మూసుకొని సేదతీరడమో చేసినా ఉపశమనం ఉంటుంది.

⚛ అవీ మంచిదే.. ఓ మంచి కామెడీ బిట్‌.. పాప్‌ మ్యూజిక్‌ ఏదో ఒకటి పెట్టుకోండి. మామూలుగా కంటే కాస్త సౌండ్‌ ఎక్కువ పెట్టేసుకోండి. అలాగని చెవులకు హాని కలిగించొద్దు. సంగీతం వింటూ పైకి పాడటం.. చుట్టూ ఎవరూ లేరన్నట్లుగా నవ్వుకోవడం.. చేయండి. మనసు తేలికపడుతుంది. ఏదైనా కొత్త పని  ప్రయత్నించాలని ఎప్పుడైనా అనిపించిందా? ఆ పనిపై పట్టు ఉండాల్సిన అవసరమే లేదు. ఆసక్తి ఉంటే చాలు. ఆ ప్రయత్నం మీ ఆలోచనలను తద్వారా మనసునీ మార్చేయగలదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని