పళ్లనీ పట్టించుకోండి
అందంలో చిరునవ్వుదీ ప్రధాన పాత్రే! ఆత్మవిశ్వాసానికి నవ్వూ ప్రతీకే. అది సహజంగా కనిపించాలంటే దంతాలు ఆరోగ్యంగా ఉండాలి కదా? అంతేకాదు ఆరోగ్యంగా లేని నోరు ఎన్నో అనారోగ్యాలకీ దారితీస్తుంది.
అందంలో చిరునవ్వుదీ ప్రధాన పాత్రే! ఆత్మవిశ్వాసానికి నవ్వూ ప్రతీకే. అది సహజంగా కనిపించాలంటే దంతాలు ఆరోగ్యంగా ఉండాలి కదా? అంతేకాదు ఆరోగ్యంగా లేని నోరు ఎన్నో అనారోగ్యాలకీ దారితీస్తుంది. సంరక్షించుకోవాలా.. అయితే కొన్నింటికి వీలైనంత దూరంగా ఉండమంటున్నారు నిపుణులు...
పుల్లటివి.. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ సి పండ్ల నుంచి పుష్కలంగా లభిస్తుంది. కానీ అందులో ఉండే యాసిడ్ గుణాలతోనే దంతాలకు ఇబ్బంది. ఇవి పీహెచ్ స్థాయులు తగ్గేలా చేస్తాయి. దాంతో ఎనామిల్ పొర దెబ్బతింటుంది. అలాగని తీసుకోకుండానూ ఉండలేం. కాబట్టి, వీటిని తీసుకున్నాక వెంటనే నీటితో పుక్కిలించండి. జ్యూస్‌లైతే స్ట్రాతో తాగితే పళ్లపై ప్రభావం తక్కువ.
చల్లటి పదార్థాలు.. వేసవిలోనే కాదు కాలమేదైనా ఐస్‌క్రీమ్ అంటే మనసు పారేసుకుంటారు అమ్మాయిలు. చల్లటి నీరు సరేసరి! కానీ చల్లదనం పళ్లపై దుష్ప్రభావాలు పడేలా చేయగలదు. చక్కెరలూ పళ్లకు శత్రువులే. క్యారమెల్, టాఫీ, గమ్మీలూ ఈ కోవకే చెందుతాయి. ఎప్పుడో ఒకసారి అయితే సరే! తరచూ తీసుకుంటోంటే కళ్లెం వేయడమే మేలు.
బ్రెడ్, బిస్కెట్లు.. వండుకునే ఓపిక లేకపోతే.. మన చూపు మళ్లేది బ్రెడ్, బిస్కెట్ల వైపే! వీటిల్లోని కొన్నిరకాల కార్బోహైడ్రేట్లు చక్కెరలుగా మారి, పళ్లకి చేటు చేస్తాయి. బ్యాక్టీరియా ఉత్పత్తికీ కారణమవుతాయి. వీలైనంత దూరంగా ఉండటమే మేలు.
కార్బోనేటెడ్ పానీయాలు.. విందులు, స్నేహితులతో ముచ్చట్లు.. ఏదైనా చేతిలో చల్లగా సోడానో, కూల్‌డ్రింకో ఉండాల్సిందే. వీటిల్లోని యాసిడ్లు పళ్లలో పుచ్చు, నోటి అనారోగ్యాలకీ కారణమవుతాయి.
కాఫీ.. ఉదయాన్నే.. తలనొప్పిగా ఉన్నా.. ఏమీ తోచకపోయినా గుర్తొచ్చేది కప్పు కాఫీనే! మనసును ఉత్తేజపరిచే పానీయం దంతాలకు శత్రువే. దీనిలోని కెఫిన్, చక్కెరలే కాదు.. యాసిడ్ గుణాలు అన్నీ దంతసిరికి చేటు చేస్తాయి. వీలైనంత తగ్గించాలి. తాగిన వెంటనే నోరు శుభ్రం చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.