నిద్ర.. రావట్లేదా?

తల.. దిండు మీదకి వాలగానే నిద్రొచ్చేస్తుంది కొందరికి. రోజంతా తీరిక లేకుండా శ్రమపడినా కొందరు గృహిణులను కునుకే పలకరించదు.

Published : 03 Jul 2023 00:39 IST

తల.. దిండు మీదకి వాలగానే నిద్రొచ్చేస్తుంది కొందరికి. రోజంతా తీరిక లేకుండా శ్రమపడినా కొందరు గృహిణులను కునుకే పలకరించదు. దీనికి బోలెడు కారణాలు.. జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు... సమస్యకి చెక్‌ పెట్టేయొచ్చంటారు నిపుణులు.

  • పక్క మీదకి చేరతామా.. ‘రేపు ఫలానా మీటింగ్‌.. పిల్లాడిని ఈ బుక్స్‌ పెట్టుకోమనాలి’.. లాంటివన్నీ గుర్తొస్తుంటాయి. బుర్రంతా ఆలోచనలు తిరిగేస్తుంటే ఇక నిద్రేం పడుతుంది? వీరిని ‘వర్రీ స్లీపర్‌’ అంటారు. రోజూ పడుకునే సమయానికి గంట ముందే మంచం మీదకి చేరండి. రేపటి గురించి ఆలోచించడం మాని పుస్తకం చదవడమో, ధ్యానమో అలవాటు చేసుకోండి. వేరే ఆలోచనలు వస్తున్న ప్రతిసారీ మనసు మళ్లించుకోవాలి. నచ్చిన ఎసెన్షియల్‌ ఆయిల్‌ని దిండు మీద చల్లుకున్నా మనసు కుదుటపడుతుంది.
  • ఒళ్లంతా వేడి ఆవిర్లు వస్తున్న భావనా? మెనోపాజ్‌లో చాలామందికి ఈ సమస్య ఉంటుంది. ఏసీలో ఉన్నా ఉక్కపోత అంటుంటారు. కూల్‌ మాట్రెసెస్‌, దిండ్లు, దుప్పట్లు దొరుకుతున్నాయి. అవి ప్రయత్నించొచ్చు. రాత్రి వదులుగా ఉండే వస్త్రాలకే ప్రాధాన్యమివ్వండి. సమస్య నియంత్రణలోకి వస్తుంది.
  • కొందరికి తమ మంచం లేనిదే నిద్రపట్టదు అంటుంటారు. ప్రయాణాలు, ఫంక్షన్లు వగైరా ఉంటే కోపం ముంచుకొచ్చేస్తుంది. వేళలు దాటి పడుకుంటే కునుకూ దరిచేరదు. మీదీ అదే కోవా? పడుకునే ముందు సంగీతం వినడం.. పుస్తకాలు చదవడం లాంటివి చేయండి. ఎక్కడికెళ్లినా ఈ అలవాటు నిద్రను రప్పిస్తుంది.
  • చిన్న శబ్దానికే కొందరు లేచి కూర్చుంటారు. పిల్లలు పుట్టాక చాలామంది అమ్మలకిదో అలవాటుగానూ మారుతుంది. దీంతో గాఢనిద్ర పట్టక నీరసపడిపోతుంటారు. దీన్నే ఫెదర్‌ స్లీపింగ్‌ అంటారు. నిర్ణీత సమయానికి పడుకోండి. నీరసంతో సమయం దొరికినప్పుడల్లా కునుకు తీయొద్దు. పడుకునే గంట ముందు టీవీ, ఫోన్లకు దూరంగా ఉండటాన్ని అలవాటు చేసుకోండి.  ముఖ్యంగా కళ్లకు ఐమాస్క్‌ అలవాటు చేసుకుంటే ఇంకా మేలు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని