బాలింతలకు పాలు పడాలంటే!

పసిపిల్లలకు తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెంచడానికి ఇవి ఎంతో దోహదం చేస్తాయి. కానీ కొంతమంది తల్లుల దగ్గర పిల్లలకు సరిపడా పాలు ఉండవు.

Updated : 05 Jul 2023 00:34 IST

పసిపిల్లలకు తల్లిపాలు ఎంతో ఆరోగ్యకరం. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు, రోగనిరోధక శక్తి పెంచడానికి ఇవి ఎంతో దోహదం చేస్తాయి. కానీ కొంతమంది తల్లుల దగ్గర పిల్లలకు సరిపడా పాలు ఉండవు. అలాంటివారు ఈ ఆహార పదార్థాలను తీసుకోండి అంటున్నారు నిపుణులు.

ఓట్స్‌ తల్లిపాల వృద్ధికి ఇవి చక్కగా ఉపయోగపడతాయి. ప్రసవానంతరం జరిగే రక్తస్రావం వల్ల ఐరన్‌ శాతం తగ్గుతుంది. తద్వారా ఎనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. ఓట్స్‌ దీనిని అడ్డుకుంటాయి. వీటిని పాలతో కానీ, తేనెతో కానీ కలిపి తీసుకుంటే చక్కగా పాలు పడతాయి. ఓట్స్‌ బిస్కెట్లు తిన్నా కూడా ప్రయోజనం ఉంటుంది.

కమలా పండు రోజుకు ఒక గ్లాసు ఆరెంజ్‌ జ్యూస్‌ తీసుకోవడం మంచిది. తల్లి విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల,  బిడ్డకు ఇచ్చే పాలల్లో అది సమృద్ధిగా లభిస్తుంది. తద్వారా పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు వంటి వాటి నుంచి ఉపశమనం లభిస్తుంది.

బ్రౌన్‌ రైస్‌ దీనిలో ఫైబర్‌, న్యూట్రియెంట్స్‌ ఎక్కువ. రోజుకి ఒక కప్పు బ్రౌన్‌రైస్‌ తీసుకోవడం వల్ల తల్లీబిడ్డలకి  కావాల్సిన కార్బోహైడ్రేట్స్‌ లభిస్తాయి. వీటిని రెండు గంటల ముందు నానపెట్టి వండాలి.

పాలకూర దీనితో పాటు మిగిలిన ఆకుకూరలు బాలింతలకు మంచిదే. ఇది ముఖ్యంగా సిజేరియన్‌ ద్వారా బిడ్డని కన్న వారికి ఎంతో మేలు చేస్తుంది.

నట్స్‌.. జీడిపప్పు, వాల్‌నట్స్‌, బాదం పప్పులు పాలిచ్చే తల్లులకు బాగా ఉపయోగపడతాయి. వీటిలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్‌, మినరల్స్‌, విటమిన్లు, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు తల్లీబిడ్డలకు ఎంతో మేలు చేస్తాయి. రోజుకు ఐదు బాదం గింజలను నానబెట్టి తింటే చక్కని ఫలితం ఉంటుంది.

గుడ్లు.. ప్రొటీన్‌, విటమిన్‌లు డి, బి12 ఉంటాయి. ఇవి చిన్నపిల్లల్లో మెదడు ఎదుగుదలకు తోడ్పడతాయి. బాలింతలు రోజుకి కనీసం రెండు గుడ్లు ఉడికించి లేదా  ఆమ్లెట్‌ రూపంలో తిన్నా మంచిదే.

క్యారెట్‌ గర్భిణులు,  బాలింతలకు విటమిన్‌ ‘ఎ’ చాలా అవసరం. క్యారెట్‌లో ఉండే బీటా కెరటిన్‌తో ఎ విటమిన్‌ లోపం రాకుండా ఉంటుంది. సూప్‌, సలాడ్‌, జ్యూస్‌ రూపాల్లో తీసుకోవచ్చు.

చేపలు ఇవి గర్భిణిలు, బాలింతలకి మంచి పోషకాహారం. వీటిలో ‘డి’ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది పిల్లల నరాల వృద్ధికి ఉపయోగపడుతుంది. వారానికి రెండు సార్లు చేపలు తినడం వల్ల ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్‌లు లభిస్తాయి.

ఇవి కాకుండా వెల్లుల్లి, బార్లీ, జీలకర్ర వంటి వాటిని ఆహారంలో తీసుకోవడం వల్ల కూడా బిడ్డకి సరిపడా పాలు పడతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని