చెవులను కాపాడుకుందాం

మనలో చాలామందిమి కళ్ల విషయమై చాలానే శ్రద్ధ తీసుకుంటాం కానీ చెవుల గురించే పెద్దగా పట్టించుకోం. నిజానికి కళ్లకు మల్లేనే చెవులు కూడా ముఖ్యమైనవి.

Updated : 08 Jul 2023 06:05 IST

మనలో చాలామందిమి కళ్ల విషయమై చాలానే శ్రద్ధ తీసుకుంటాం కానీ చెవుల గురించే పెద్దగా పట్టించుకోం. నిజానికి కళ్లకు మల్లేనే చెవులు కూడా ముఖ్యమైనవి. వినికిడి శక్తి తగ్గడం, చెవిలో హోరుమనే శబ్దం లేదా రింగుమనిపించే మోత, చెవిపోటు లాంటి సమస్యలు వస్తుంటాయి. వాటిని నివారించేందుకు మత్స్యాసనం, భుజంగాసనం, అధోముఖ స్వానాసనాలు ఉపయోగపడతాయి.


ఇవీ ఆసనాలు

అధోముఖ స్వానాసనం.. తిన్నగా నిలబడి మెల్లగా వంగి చేతులను కింద ఆనించాలి. బల్లలా కాళ్లూ చేతులూ కింద ఉంటాయి. మోచేతులను చెవులకు ఆనేలా చూడాలి. కొన్ని క్షణాలు ఈ భంగిమలో ఉండి యథా స్థితికి రావాలి.

భుజంగాసనం.. బోర్లా పడుకుని తల, ఉదర భాగాలను వీలైనంత పైకి లేపి చేతులను కింద ఆనించాలి. పడగ మీద లేచిన పామును తలపిస్తుంది కనుక భుజంగాసనం అన్నారు. మెల్లగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండగలిగినంత సేపు ఉండి ఆనక తల, ఉదర భాగాలను నేల మీదికి తేవాలి.

మత్స్యాసనం.. వెల్లకిలా పడుకుని చేతులు తిన్నగా కిందికి చాచాలి. అర చేతులను పిరుదుల దగ్గర పట్టుకోవాలి. మోచేతుల ఆసరాతో ఉదరభాగాన్ని పైకి లేపి నెమ్మదిగా తల నేల మీద ఆనేలా చూడాలి. కొన్ని క్షణాలు అలా ఉండి, యథాస్థితికి వచ్చి సేదతీరాలి.

మూల కారణాలు.. చెవి సమస్యలకు ఒత్తిడి, మెడ, దవడలు బిగుసుకుపోవడం, మెదడులో రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, చెవిలో గుబిలి పేరుకుపోవడం లాంటి అనేక కారణాలుంటాయి. పైన చెప్పిన ఆసనాలతో వాటిని అరికడితే చెవులు ఆరోగ్యంగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని