చేపలు అతిగా తినకూడదా!

మా పాపకు చిన్నప్పటి నుంచి సీఫుడ్‌ అంటే చాలా ఇష్టం. దాంతో ఇంట్లో రోజూ అవే వండుతుంటాం. బయటికి వెళ్లినా వాటినే ఆర్డర్‌ ఇస్తుంటుంది. ఇటీవల ఒక పుస్తకంలో ఇవి తినకూడదని చదివాను.

Published : 20 Jul 2023 15:46 IST

మా పాపకు చిన్నప్పటి నుంచి సీఫుడ్‌ అంటే చాలా ఇష్టం. దాంతో ఇంట్లో రోజూ అవే వండుతుంటాం. బయటికి వెళ్లినా వాటినే ఆర్డర్‌ ఇస్తుంటుంది. ఇటీవల ఒక పుస్తకంలో ఇవి తినకూడదని చదివాను. వీటిల్లో కలిసిన మైక్రోప్లాస్టిక్స్‌ వల్ల కాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువని రాశారు. ఇది నిజమేనా?

- సరస్వతి, విశాఖపట్నం

 సీఫుడ్‌ అనే కాదు ఆహారమేదైనా శరీరానికి సరిపడినంతే తీసుకోవాలి. రోజూ ఒకే తరహావి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అదే అలవాటైపోతే మిగతావి వెగటుగా అనిపించొచ్చు. అందుకే ఏదైనా మితంగానే తినాలి. ఇక మైక్రో ప్లాస్టిక్‌ విషయానికొస్తే మనం తినే ప్రతి దానిలోనూ అది కలిసే ఉంటుంది. బయట తాగే మంచినీళ్ల సీసాలతో సహా ప్రతిదీ కలుషితమే. అలాగని అన్నింటినీ తిరస్కరిస్తూ పోలేం. వీటికి బదులుగా ప్రత్యామ్నాయ ప్రొటీన్‌ ఫుడ్‌ని తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. సీఫుడ్‌లో ఉండే మైక్రో పార్టికల్స్‌, పాదరసం లాంటివి శరీరానికి తీరని నష్టాన్ని కలిగిస్తాయనడంలో సందేహం లేదు. కానీ అన్ని చేపల్లోనూ అవి ఉండవు. కొన్నింటిలో ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వాటిని మాత్రమే తినకుండా ఉంటే చాలు. ఉదాహరణకు చిన్న చేపలు, పీతలు, నత్తలు, నెత్తళ్లు లాంటి వాటి జీర్ణకోశం శుభ్రం చేయలేం. వాటిని పైపైన కడిగి తినేస్తుంటాం. ఇలాంటివి ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల విషపూరిత ఖనిజాలు శరీరంలోకి ఎక్కువగా చేరే ప్రమాదం ఉంటుంది. పెద్ద చేపలను పూర్తిగా కోసి శుభ్రం చేస్తుంటాం కాబట్టి ఇవి తినొచ్చు. పైన చెప్పిన వాటితో పోల్చితే వీటితో సమస్య తక్కువగా ఉంటుంది. దీన్ని సమతుల్యం చేయడానికి రోజులో ఏదో ఒక పూట గింజలు, తృణధాన్యాలు, మాంసకృత్తులు, గుడ్డు లాంటివి తింటే సరి. అంతేకానీ చేపలు తినడాన్ని పూర్తిగా నియంత్రించాల్సిన అవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని