ఆ అడుగులు.. అప్పుడెలా?

రోజుకి పదివేల అడుగులు.. స్మార్ట్‌వాచ్‌లు వచ్చాక చాలామంది పఠిస్తున్న మంత్రం. మిగతా రోజుల్లో చేయడం ఇబ్బందేమీ కాదు. చినుకులు పడుతోంటే.. నియమం అటకెక్కాల్సిందేనా? అవసరం లేదు.. ఇలా చేసి చూస్తే సరి.

Published : 27 Jul 2023 00:02 IST

రోజుకి పదివేల అడుగులు.. స్మార్ట్‌వాచ్‌లు వచ్చాక చాలామంది పఠిస్తున్న మంత్రం. మిగతా రోజుల్లో చేయడం ఇబ్బందేమీ కాదు. చినుకులు పడుతోంటే.. నియమం అటకెక్కాల్సిందేనా? అవసరం లేదు.. ఇలా చేసి చూస్తే సరి.

  చినుకులను కారణంగా చూపిస్తాం కానీ.. ఈ వాతావరణానికి శరీరమూ బద్ధకించేస్తుంది. రోజు గడిచేనాటికి అనుకున్న టార్గెట్‌ చేరుకోలేకపోయామే అని బెంగ వచ్చేస్తుంది. అలా అవ్వొద్దంటే.. టీవీ చూస్తున్నారా? గదిలోనే తిరుగుతూ చూసేయండి. ఆహ్లాదానికి వ్యాయామాన్ని జోడించినవారవుతారు.

 పై అంతస్థుల్లో ఉండేవారైతే మెట్లు ఎక్కి, దిగడానికే ప్రాధాన్యం ఇవ్వండి. సరకులు, కూరగాయలు కూడా ఫోన్‌ కాల్‌ దూరంలోనే! అలా ఆర్డర్‌ ఇవ్వడం ఆలస్యం.. ఇంటికి వచ్చేస్తాయి. సన్న చినుకులే అయితే.. కొద్ది దూరాలకు నడుచుకుంటూ వెళ్లిరండి. చల్లగాలి.. చినుకులు చూస్తోంటే మనసు తేలిక పడుతుంది. కోరుకున్నట్లుగా అడుగులూ పడతాయి.

 ఫోన్‌ మాట్లాడుతున్నా.. ఒక చోట నిలబడటమో, కూర్చోవడమో చేయొద్దు. నడుస్తూ మాట్లాడండి. తెలియకుండానే వేల అడుగులు వేసేస్తాం. కూరలు, టిఫిన్లు చేసేప్పుడైతే స్టవ్‌ ముందు నిలబడక తప్పదు. కానీ పాలు, పులుసులు వంటివైతే అస్తమానూ కలియబెట్టాల్సిన పనిలేదు. కాబట్టి.. ఒక కన్ను వాటిపై వేసి ఉంచి కూడా అక్కడక్కడే తిరగొచ్చు.

 స్కిప్పింగ్‌ తాడు తెచ్చుకోండి. లేదూ నచ్చిన పాట పెట్టుకొని కాలు కదపండి. తెలియకుండానే వేల అడుగులు పడతాయి. దగ్గర్లోని షాపింగ్‌ మాల్‌కి వెళ్లండి.. విండో షాపింగ్‌ చేయండి. ఎక్కడ ధరలు తక్కువ.. మన్నికైనవి ఎక్కడ లభిస్తాయన్నది తెలుస్తుంది. షాపింగు మనకు ఒత్తిడి దూరం చేసే మార్గమే కాదు.. తెలియకుండానే జరిగే వ్యాయామం కూడా. ఇంకా వేడుకలు వగైరా వచ్చినప్పుడు ఎక్కడికెళితే పని తేలిగ్గా జరుగుతుందన్న సమాచారం అదనం. కాబట్టి.. అబ్బా.. వాన మన నియమాన్ని పక్కన పెట్టేలా చేస్తోందని బెంగ పడక వీటిని అనుసరిస్తే సరి. కోరుకున్నన్ని అడుగులు అవే పడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని