నిద్ర పట్టడం లేదా..

హాయిగా నిద్రపోవాలని ఎవరికుండదు చెప్పండి. అయితే పని ఒత్తిడి, ఇతరత్రా సమస్యలెన్నో కునుకు రానీయకుండా అడ్డుపడుతుంటాయి. అందులోనూ ఈ ఇబ్బంది మహిళల్లో కాస్త ఎక్కువేనట. అనారోగ్య కారణాలు మినహాయిస్తే... మిగిలిన జీవనశైలిలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి.

Published : 29 Jul 2023 00:12 IST

హాయిగా నిద్రపోవాలని ఎవరికుండదు చెప్పండి. అయితే పని ఒత్తిడి, ఇతరత్రా సమస్యలెన్నో కునుకు రానీయకుండా అడ్డుపడుతుంటాయి. అందులోనూ ఈ ఇబ్బంది మహిళల్లో కాస్త ఎక్కువేనట. అనారోగ్య కారణాలు మినహాయిస్తే... మిగిలిన జీవనశైలిలోనూ కొన్ని మార్పులు చేసుకోవాలి.

గాఢ నిద్రకు మెలటోనిన్‌ హార్మోను చక్కగా ఉపయోగపడుతుంది. అయితే, గది చీకటిగా ఉన్నప్పుడు మాత్రమే ఇది విడుదలవుతుంది. ఈ పాటికే అర్థమయ్యింది కదా! జిగేల్‌మనే లైట్లూ, టీవీలూ, కంప్యూటర్‌, ఫోన్‌ తెరల్ని మీ పడకగదికి దూరంగా ఉంచండి. అప్పుడు హాయిగా పడుకోగలరు.

చక్కటి నిద్రకు గది ఉష్ణోగ్రత కూడా కీలకమే. అతి శీతలం, అతి వేడి రెండూ ఇబ్బంది పెట్టేవే. ఇవి సమంగా ఉండేలా చూసుకోండి. ఇక, పడకగదిలోకి ఘాటైన వాసనలు వ్యాపించకుండా చూసుకోండి. అలాంటివి ఇబ్బంది పెడుతుంటే కాస్త పచ్చ కర్పూరం ఉంచడమో, సాంబ్రాణి పొగ వేయడమో చేస్తే సరి. లేదా మల్లె, గులాబీ వంటివీ మనసుకి హాయినిస్తాయి. కంటికి నిదురను తెచ్చిపెడతాయి.

ఇక మీ పడక కచ్చితంగా శుభ్రంగా ఉండేలా చూసుకోండి. సీక్వెన్లు, ఇతర ఎంబ్రాయిడరీ ఉన్న దుస్తులు, బెడ్‌ షీట్ల వాటిని ఎంచుకోవడం వల్ల సౌకర్యంగా పడుకోలేరు. దుప్పట్లు, దిండ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. రాత్రి పడుకునే దుస్తులు వీలైనంతవరకూ వదులుగా ఉండే కాటన్‌ రకాలను ఎంచుకోండి.  

అతిగా తిని నిద్రపోవడం, పడుకునే ముందు వ్యాయామాలు చేయడం, లేదంటే నీళ్లు తక్కువ తాగడం వంటివాటివల్ల కూడా నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. చాలామంది నిద్రలో లేవాల్సి వస్తుందేమోనని నీళ్లు తాగడం మానేస్తుంటారు. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్‌కి గురై కూడా మెలకువ వచ్చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని