పోషకాలు.. పడేస్తున్నారా?

మట్టి పేరుకొని ఉంటుంది.. నమలడానికి ఇబ్బంది.. ఇలా రకరకాల కారణాలు చెప్పి కొన్నిరకాల పండ్లు, కూరగాయల తొక్క తీసేస్తుంటాం.

Published : 30 Jul 2023 00:05 IST

మట్టి పేరుకొని ఉంటుంది.. నమలడానికి ఇబ్బంది.. ఇలా రకరకాల కారణాలు చెప్పి కొన్నిరకాల పండ్లు, కూరగాయల తొక్క తీసేస్తుంటాం. దాని ద్వారా బోలెడు పోషకాలను వృథా చేస్తున్నామని తెలుసా?

దుంపలు.. ఉడికించాక బంగాళదుంప, చిలగడ దుంపల పొట్టు తీసేస్తుంటాం. కానీ వాటిల్లో ఫైబర్‌, బి, సి విటమిన్లు, పొటాషియం, క్యాల్షియం, ఐరన్‌ మెండుగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి, రక్తహీనత ఉన్నవారికి ఇవి చాలా మంచిది. క్యారెట్‌పై మట్టి త్వరగా వదలదని పీల్‌ చేస్తుంటాం. నిజానికి లోపలి గుజ్జులో కంటే పొట్టులోనే రెట్టింపు పోషకాలుంటాయట. దీని నుంచి సి, బి3 విటమిన్లతోపాటు ఫైటో న్యూట్రియంట్లు అందుతాయి. బ్రష్‌తో శుభ్రం చేసి వాడుకుంటే మట్టివదిలిపోతుంది. పోషకాలు పోతాయన్న భయం ఉండదు.

యాపిల్‌.. ఏ రుచీ ఉండదు.. ఈ కారణంతో యాపిల్‌పై పొట్టు తీసేస్తుంటారు చాలామంది. కానీ లోపలి గుజ్జులో కంటే దీని తొక్కలోనే విటమిన్లు ఫైబర్‌ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఈ గుణాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా కాపాడతాయి. దీనిలో ఉండే క్వెర్‌సెటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ మెదడు, ఊపిరితిత్తులు మెరుగ్గా పనిచేయడంలో సాయపడతాయి.

కీర.. గట్టిగా ఉంటుంది.. రుచిగా ఉండదన్న కారణాలతో కీర చెక్కు తీసేస్తుంటారు చాలామంది. కొందరికి మైనపు పూత వేస్తారన్న భయం ఉంటుంది. అలాంటప్పుడు మందపాటి వస్త్రం లేదా టిష్యూతో రుద్ది, ఆపై ముక్కలుగా కోసుకొని తినడం మేలు. ఈ చెక్కు ద్వారా గాయాలను త్వరగా మాన్చే విటమిన్‌ కె లభిస్తుంది. తల్లయ్యాక క్యాల్షియం తగ్గడం మనకు మామూలే. దీనిలోని పోషకాలు ఎముకల బలానికీ సాయపడతాయి.

నారింజ.. నారింజ తొక్కలో బి విటమిన్‌తోపాటు క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. అందుకే సన్నగా తురిమి, స్వీట్లు, సలాడ్లలో చేర్చుకోండి. కొత్త రుచికి ఆరోగ్యం అదనం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని