వివక్ష... ఎదగనీయడం లేదు!
లింగ వివక్ష ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని మహిళల మెదడు కుచించుకుపోతున్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది.
లింగ వివక్ష ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని మహిళల మెదడు కుచించుకుపోతున్నట్లు తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. లండన్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, మానసిక రుగ్మతల శాస్త్ర విభాగంతో నేతృత్వంలో నిర్వహించిన ఈ అధ్యయనం ఇంకేం చెబుతుందంటే...
ఇండియా సహా లండన్, అమెరికా, చైనా, లాటిన్ అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల్లో 18 నుంచి 40 ఏళ్లలోపు 3,798మంది పురుషులు, 4,078మంది మహిళల ఎమ్మారై స్కాన్‌లను పరిశోధకులు అధ్యయనం చేసి.. వారి మెదడు పరిమాణంలో తేడా ఉన్నట్లు తెలుసుకున్నారు. నేషనల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్స్‌లో ఈ మేరకు పలు నివేదికలను ప్రచురించారు. లింగ అసమానత అత్యధికంగా ఉండే ప్రాంతాల్లోని మహిళల మెదడు పరిమాణంలో మగవారితో పోలిస్తే తేడా కనిపించింది. మహిళల్లో మెదడును కప్పి ఉంచే పొర కుడివైపు మగవారిలో కన్నా పల్చగా ఉన్నట్లు గుర్తించారు. అయితే లింగ సమానత్వాన్ని పాటించే దేశాల్లో మాత్రం ఈ తేడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. లింగ వివక్ష ప్రభావంతో మహిళల మెదడు పనితీరులో జరిగిన మార్పులే దీనికి కారణమంటున్నారు.
పనితీరులో... మెదడులో ఆందోళన, ఒత్తిడి, లింగ వివక్షత ప్రభావం ఎక్కువగా కనిపించింది. దీనివల్ల నాడీకణాల పనితీరులో మార్పులు రావడం, నిరాశ, ఒత్తిడి ఏర్పడి, చివరకు పలురకాల రుగ్మతలకు దారితీస్తున్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు. సామాజికపరంగా ఆడ, మగ అంటూ తేడాలు, తీవ్రమైన అసమానతలు కాలక్రమేణా వీరి మెదడు నిర్మాణంలో ప్రభావం చూపిస్తున్నాయని పరిశోధన ద్వారా బయటపడింది. దీనివల్ల మెదడు కుచించుకుపోవడం వంటి మార్పులు ఏర్పడటానికి కారణమవుతోందని పరిశోధకులు భావిస్తున్నారు. లింగ అసమానత, మానసిక అనారోగ్య సమస్యలకు మధ్య బలమైన సంబంధం ఉండటం మూలంగా విద్య, వ్యాపార రంగాల్లో మహిళలు ముందడుగు వేయలేరని పరిశోధకులు వివరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.