ఆరోగ్యానికి ‘సూపర్‌ సిక్స్‌’

ఆహార ప్రపంచంలో అత్యున్నతమైనవిగా.. సూపర్‌ఫుడ్స్‌కి పేరు. అసలు వీటిని ఎవరు, ఎప్పుడు ప్రచారంలోకి తెచ్చారో తెలియదు కానీ ఈ జాబితాలో చాలానే ఉన్నాయి. అకైబెర్రీ, అవకాడో, కాలే, మాచా వంటివి ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి.

Updated : 15 Jun 2024 07:24 IST

ఆహార ప్రపంచంలో అత్యున్నతమైనవిగా.. సూపర్‌ఫుడ్స్‌కి పేరు. అసలు వీటిని ఎవరు, ఎప్పుడు ప్రచారంలోకి తెచ్చారో తెలియదు కానీ ఈ జాబితాలో చాలానే ఉన్నాయి. అకైబెర్రీ, అవకాడో, కాలే, మాచా వంటివి ఎక్కువగా ఆదరణ పొందుతున్నాయి. వీటిల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలం. అయితే, అదే స్థాయిలో న్యూట్రియంట్లను నింపుకొన్న దేశీయ సూపర్‌ఫుడ్స్‌ ఏంటో చూద్దామా...

సూపర్‌ ఫుడ్స్‌... ఈ మధ్యకాలంలో బాగా వినబడుతోన్న పదం. వీటిల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయనీ, దీర్ఘకాలిక వ్యాధుల్ని అదుపులో ఉంచుతాయనీ చెబుతున్నారు. అలాంటివాటిల్లో ఎక్కువగా విదేశీ రకాలే కనిపిస్తున్నాయి. కానీ, వాటికి దేశీయ ప్రత్యామ్నాయాలూ ఉన్నాయంటారు పోషక నిపుణులు.


అకై బెర్రీ-ఉసిరి

చూడ్డానికి అచ్చం నల్లద్రాక్షలా ఉండే అకై బెర్రీ, ఉసిరి రెండూ ఒకే రకమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న శక్తిమంతమైన సూపర్‌ఫుడ్‌లు. విటమిన్‌ సి నిల్వల్లో అకై బెర్రీని మించిన ప్రయోజనకారి ఉసిరి. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పైగా ఉసిరిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్‌ లక్షణాలూ నిండుగా ఉంటాయి. ఇది దీర్ఘకాలిక వ్యాధుల్నే కాదు... కాలేయ ఆరోగ్యం, అధికబరువుని తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది.


మాచా-మునగ

మాచా అనేది నీడలో పెరిగే లేత తేయాకుని సంప్రదాయ పద్ధతుల్లో చేసే పొడి. తీపి, చేదు, వగరు కలగలిపిన రుచిలో ఉండే దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇవి సెల్‌ డ్యామేజీని నిరోధించడంతో పాటు వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలోనూ కీలకంగా పనిచేస్తాయి. దీనికి భారతీయ ప్రత్యామ్నాయాన్ని మునగాకు అందిస్తుంది. ఇందులో కీలక విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు తక్షణ శక్తినందించే గుణాలూ ఎక్కువే. అందుకే దీన్ని పోషకాల పవర్‌హౌస్‌ అని పిలుస్తారు.


చియా సీడ్స్‌- సబ్జాగింజలు...

చియా గింజల్నే మెక్సికన్‌ సీడ్స్‌ అని కూడా అంటారు. వీటిల్లో ఫైబర్, ఒమేగా-3 సమృద్ధిగా ఉంటాయి. ఒంట్లో వ్యాధినిరోధకతను పెంచుతాయి. ఈ గింజలు జిగురుగా ఉండటం వల్ల వీటినెక్కువగా స్మూతీలు, సాధారణ పుడ్డింగ్‌లను చిక్కబరచడానికి వాడతారు. అయితే వీటి కంటే ఖరీదు తక్కువగా ఉండే సబ్జా గింజల్ని దేశీయ సూపర్‌ఫుడ్‌గా వినియోగించొచ్చని అంటున్నారు నిపుణులు. ఎక్కువ ప్రొటీన్, తక్కువ కెలొరీలు ఉన్న ఇవి ఒంట్లో వేడిని నియంత్రించడంతో పాటు అవసరమైన శక్తినీ ఇస్తాయి. ఈ గింజల్లో ఐరన్, ఫైబర్‌ పుష్కలంగా ఉండి జీర్ణవ్యవస్థ పనితీరునీ మెరుగుపరుస్తాయి.


కాలే-పాలకూర...

కాలే సూపర్‌ ఫుడ్‌ మాత్రమే కాదు.. వంటకాలకు ప్రత్యేక రుచినీ అందిస్తుంది. దీనికి ప్రత్యామ్నాయం అదే విధమైన పోషకాలు, రుచితో కూడిన ఇండియన్‌ సూపర్‌ఫుడ్‌ పాలకూర. విటమిన్‌ ఎ,సి,కెలతో పాటు ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంది. బచ్చలికూర కూడా కాలేకు గొప్ప ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది, అదే విధమైన ఆరోగ్య ప్రయోజనాలనూ, రుచినీ అందిస్తుంది.


క్వినోవా- ముతక గోధుమ రవ్వ

ప్రోటీన్, ఫైబర్‌లు ఎక్కువగా ఉండే క్వినోవాను తీసుకోవడం మంచిదే కానీ, దానికి ప్రత్యామ్నాయంగా ముతక గోధుమ రవ్వనూ వాడుకోవచ్చు. ఇందులో మెగ్నీషియం, ఐరన్, బి- విటమిన్లతో పాటు ప్రోటీన్, ఫైబర్, పలు రకాల ఖనిజ లవణాలు దండిగా ఉంటాయి. క్వినోవా లానే ముతక గోధుమ రవ్వ కూడా తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలతో కూడిన పూర్తి ప్రోటీన్‌ ఆహారం. శాకాహారులకు మంచి ఎంపిక.


మాకా వేర్లు-శతావరి..

పెరూ దేశానికి చెందిన మాకా వేర్లు అంతర్జాల ట్రెండింగ్‌ ఆహారాల్లో సూపర్‌ఫుడ్‌గా దూసుకుపోతున్నాయి. ఇవి మెనోపాజ్‌ దశలో హార్మోన్ల అసమతుల్యతను సరిచేయగలవు. మెదడు ఆరోగ్యాన్నీ, జీవక్రియల్నీ మెరుగుపరుస్తాయి. మన దేశంలో దొరకడం కాస్త కష్టమే. లభించినా ఖరీదు ఎక్కువే. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా శతావరిని వాడొచ్చు. దీన్నే ఆస్పరాగస్‌ అని కూడా అంటారు. ఇది మాకా వేర్లకంటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, థయామిన్, విటమిన్‌ సి,ఇ,కె, క్యాల్షియం, ఇనుము, మాంగనీస్‌ వంటి పోషకాలు ఎక్కువ. ఒత్తిడి, కుంగుబాటుల్ని అదుపులో ఉంచుతుంది. అజీర్తి, గుండెల్లో మంట, మూడ్‌ స్వింగ్స్‌ వంటివాటిని తగ్గిస్తుంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్