పొట్ట తగ్గాలా... అలవాటు చేసుకోండి!

చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడే అంశాల్లో పొట్ట దగ్గర కొవ్వొకటి. అది తగ్గడం కోసం కడుపు మాడ్చుకోవడం, కెలొరీలు లెక్కేసుకొని తినడం, కిలోమీటర్ల కొద్దీ నడవడం వంటివెన్నో చేస్తారు.

Published : 05 Jul 2024 02:06 IST

చాలామంది అమ్మాయిలు ఇబ్బంది పడే అంశాల్లో పొట్ట దగ్గర కొవ్వొకటి. అది తగ్గడం కోసం కడుపు మాడ్చుకోవడం, కెలొరీలు లెక్కేసుకొని తినడం, కిలోమీటర్ల కొద్దీ నడవడం వంటివెన్నో చేస్తారు. అవసరమైన పోషకాలు అందక కొత్త సమస్యలు తెచ్చుకుంటారు. అలా కాకూడదంటే కొన్ని అలవాట్లు చేసుకుని, క్రమంగా పాటించాలి అంటున్నారు నిపుణులు. అవేంటంటే...

  • అల్పాహారం మానొద్దు. ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, పీచు ఎక్కువగా ఉండే గుడ్లు, ఓట్స్, రాగి, తాజాపండ్లు, నట్స్‌ వంటివాటికి దానిలో చోటివ్వాలి. ఇవి మెటబాలిజాన్ని మెరుగుపరుస్తాయి. శరీరానికి కావాల్సిన శక్తినివ్వడంతోపాటు జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధకతనూ పెంచుతాయి.
  • రోజూ కొద్దిసేపైనా వ్యాయామానికి చోటివ్వాలి. మధ్యస్థ స్థాయి వాటికి వారంలో రెండున్నర గంటలైనా కేటాయించాలి. కండలతో మాకేం పని అనుకోకుండా రోజూ కొంచెం సేపు బరువులు ఎత్తి దించండి. డంబుల్స్‌ వగైరా కొనాల్సిన పనిలేదు కానీ... రెండు వాటర్‌ బాటిళ్లతో చేసినా సరే! ఇంకా గుంజీళ్లనూ జోడించుకుంటే మేలు. ఇవి కొవ్వును కరిగిస్తూనే మెటబాలిజాన్నీ మెరుగుపరుస్తాయి.
  • బోర్‌ కొట్టినా, ఒత్తిడి పెరిగినా చిరుతిళ్లవైపు మనసు మళ్లుతుంది. అందుబాటులో బాదం, తాజా పండ్లు, క్యారెట్, కీర వంటి కాయగూరల ముక్కలను దగ్గర ఉంచుకొని తింటే సరి. ఇవి ఆకలిని అదుపు చేయడమే కాదు, జీర్ణప్రక్రియనీ మెరుగుపరుస్తాయి.
  • నీళ్లు బాగానే తాగుతున్నారా? ఇదీ ‘పొట్ట’కు కారణమే! కనీసం 2 లీటర్లు తాగుతున్నారో లేదో చూసుకోండి. ఇవి శరీరాన్ని హైడ్రేట్‌ చేస్తూనే ఆరోగ్యాన్నీ మెరుగుపరుస్తాయి. మజ్జిగ, హెర్బల్‌ టీ, పండ్ల రసాల రూపంలో తీసుకున్నా మంచిదే. ఇంకా ఏం తింటున్నాం, తాగుతున్నాం అన్నది గమనించుకుంటూ ఉండాలి. కాబట్టి, తినేటప్పుడు ఫోన్, టీ, పుస్తకాలకు దూరంగా ఉండాలి.
  • చివరగా ఒత్తిడి కూడా ఈ సమస్యకు మూలమే. పైగా త్వరగా కొవ్వు కరగకుండా చేస్తుంది. కాబట్టి, ధ్యానం, బ్రీతింగ్‌ ఎక్సర్‌సైజ్‌లు వగైరా చేస్తూ దాన్నీ అదుపులో పెట్టుకోండి. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా అవ్వడమే కాదు... పొట్టదగ్గర సహా అనవసర కొవ్వు కరగడం ఖాయం. 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్