Updated : 13/11/2021 11:16 IST

కుక్కల డ్రస్సులతో కోట్ల వ్యాపారం!

పెంపుడు జంతువులు చాలా మందికి కుటుంబ సభ్యుల్లానే. వాటికీ పుట్టినరోజులు, పెళ్లిళ్లు చేస్తున్నారు. వాటికీ దుస్తులు, అలంకరణలు, ప్రత్యేక వస్తువులు... ఇలా చాలా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఎవరికి వాళ్లు చేస్తున్నవి. ఫ్యాషన్‌ డిజైనర్‌గా తనకో ప్రత్యేకత ఉండాలనుకున్న నిమిషా దీక్షిత్‌ దీన్నే వ్యాపారంగా మలచుకుంది. డాగ్‌ ఓ బౌ పేరుతో స్టార్టప్‌ పెట్టి విదేశాలకూ సరఫరా చేస్తోందీ హైదరాబాదీ అమ్మాయి. ఈ ఏడాది రూ.కోటిన్నర టర్నోవర్‌నూ సాధించింది. తన వ్యాపార ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుందిలా...!!

మేం హైదరాబాద్‌లో స్థిరపడ్డ మరాఠీలం. నాన్న ప్రవీణ్‌ దీక్షిత్‌, అమ్మ అనితా దీక్షిత్‌. ఇద్దరం ఆడపిల్లలం. అక్క అమెరికాలో స్థిరపడింది. నేను ఫ్యాషన్‌ డిజైనింగ్‌, బీఏ ఆనర్స్‌ చేశా. తర్వాత ప్రముఖ డిజైనర్‌ దగ్గర కొన్నాళ్లు పనిచేశా. కొత్తగా, భిన్నంగా డిజైన్‌ చేయాలన్నది నా కోరిక. వ్యాపార ఆలోచన మాత్రం లేదు. నాలుగేళ్ల క్రితం అమెరికాలో పెట్స్‌ కోసం దుస్తుల షోరూమ్‌లుండటం చూసి ఆశ్చర్యపోయా. దాని వల్లేనేమో.. తిరిగొచ్చాక మా పెంపుడు కుక్క మైలోకు రెయిన్‌ కోట్‌ కుట్టించాలనుకున్నా. నేనే డిజైన్‌ చేసి, టైలర్‌తో కుట్టించా. ఆ ఫొటో ఇన్‌స్టాలో పెడితే తమకీ చేసిపెట్టమని బోలెడు మెసేజ్‌లు. అలా మొదటిసారి 2018లో స్నేహితురాలి కుక్కకి డిజైన్‌ చేసిచ్చా. దానికొచ్చింది రూ.300. అప్పటినుంచి కొనసాగించా. సినీ నటి సమంత, మహేష్‌ బాబు భార్య నమ్రతల పెట్స్‌కు చేసిచ్చాక వాటి ఫొటోలను వాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచారు. దాంతో గుర్తింపు వచ్చింది. ఆర్డర్లూ పెరిగాయి.

2019లో కూకట్‌పల్లిలో ‘డాగ్‌ ఓ బౌ’ సంస్థను స్థాపించి పెంపుడు జంతువులకు అలంకరణ సామగ్రి, దుస్తులు, దుప్పట్లు, బెడ్స్‌ను రూపొందించి, అమ్మడం మొదలుపెట్టాం. ఒక టైలరు, రూ.5 లక్షల పెట్టుబడితో ప్రారంభించాం. ఒక్కో డిజైన్‌కు 4-5 గంటలు పట్టేది. మా పెంపుడు జంతువులు మైలో, మియాలే మోడళ్లు. కస్టమర్లు కోరినట్టుగా చేసిచ్చే వాళ్లం. చాలామంది నా వ్యాపారం ఇదీ అంటే నవ్వే వాళ్లు. ‘ఆ.. ఏముంది క్లాత్‌ తెచ్చి కుట్టివ్వడమేగా!’ అనే వారు. కానీ నా ఆలోచన మీద, నా మీద నాకు నమ్మకం ఉంది. మనకీ, జంతువుల దుస్తులకు చాలా తేడా ఉంది. వాటి ఎత్తు, శరీరాకృతికి తగ్గట్టుగా, ఇబ్బంది కలగకుండా రూపొందించాలి. అందుకే జాగ్రత్తగా, అలర్జీ అవకాశం లేని వస్త్రాలను ఎంపిక చేస్తా. నెలకోసారి నేనే దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌ల్లో షాపింగ్‌ చేసి కొంటా. డిజైన్లను స్కెచ్‌ గీసి, ఫొటో తీసి.. వస్త్రం, కుట్టే తీరులను మాస్టర్‌కు సూచిస్తా. పెట్‌కి వేశాక లోపాలుంటే సరిదిద్ది... కస్టమర్‌కి అందిస్తా. 250కు పైగా డిజైన్లు చేస్తున్నాం. పెళ్లిళ్లు, పండుగల సమయంలో సంప్రదాయ దుస్తులు అడుగుతారు. తమిళులు లుంగీలు, చీరలు తెలుగు వాళ్లు షేర్వాణీ, ఫ్యాషన్‌ దుస్తులు కోరుతున్నారు.

మూడేళ్లలో ఎన్నో ఒడుదొడుకులు చూశా. రిటైల్‌ దుకాణాల్లో కొందరు డబ్బులిచ్చేవారు కాదు. 3-4 నెలలు తిప్పేవాళ్లు. ఏడాదిపాటు అర్ధరాత్రి వరకు డిజైన్‌, కుట్టించడం, మార్కెటింగ్‌లతోనే సరిపోయింది. సెలవులు, పండుగలకూ దూరమయ్యా. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అమ్ముతున్నాం. బంజారాహిల్స్‌, కేపీహెచ్‌బీల్లో రెండు స్టోర్లున్నాయి. దిల్లీ, ముంబయి, పట్నా, అహ్మదాబాద్‌ తదితర మెట్రోనగరాల్లోని రిటైల్‌ షాపులకూ సరఫరా చేస్తున్నాం. అమెరికా, ఇంగ్లండ్‌ వంటి దేశాల నుంచీ ఆర్డర్స్‌ వస్తున్నాయి. ప్రస్తుతం నా దగ్గర 50 మంది ఉద్యోగులున్నారు. నిత్యం ఎన్నో సవాళ్లు. ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వెళ్తున్నాం. ఒక్కోసారి నేనేనా వ్యాపారం చేసేది అని ఆశ్చర్యమేస్తుంది.

మా కుటుంబంలో వ్యాపారస్థుల్లేరు మరి! ఫ్యాషన్‌ డిజైనర్‌గా స్థిరపడితే చాలనుకునే దాన్ని. అమ్మావాళ్లూ హాబీగా చేస్తున్నా అనుకున్నారు. ఇందులో నాకు శిక్షణ ఇచ్చే వాళ్లు కానీ, సందేహాలొస్తే తీర్చే వాళ్లు కానీ ఎవరూ లేరు. ఒక్కోటీ నేర్చుకుంటూ వస్తున్నా. ఎదగడానికి క్రమశిక్షణ, గెలవాలనే పట్టుదలతోపాటు సవాళ్లను అధిగమించే సహనం కూడా కావాలని ఈ మూడేళ్లలో తెలుసుకున్నా. ఈ ఏడాది రూ.కోటిన్నర టర్నోవర్‌ సాధించాం. వచ్చే ఏడాది రూ.3 కోట్లకు చేరాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నా. నా కాబోయే జీవిత భాగస్వామి ఇబాబత్‌ శర్మ, మా అమ్మానాన్నల తోడ్పాటే నన్ను ముందుకు నడిపిస్తోంది!

- గణాది సాంబశివరావు, హైదరాబాదుగమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని