Published : 26/05/2022 00:46 IST

మీరు ఇష్టపడితే సరిపోదు...

రాధకు రమేశ్‌ అంటే చెప్పలేనంత ఇష్టం. తానెంత ప్రేమగా ఉన్నా, అతనేమో ఏ అభిప్రాయాన్నీ వ్యక్తీకరించడం లేదు. అందుకే ఎదుటివారిపై ప్రేమను పెంచుకునేటప్పుడు వారి మనసులో ఏముందో తెలుసుకొన్న తర్వాతే ముందడుగు వేయాలి అంటున్నారు నిపుణులు. దాన్నెలా తెలుసుకోవాలో చెబుతున్నారు.

ప్రేమబంధం ముడిపడాలంటే ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఇష్టం, స్నేహం, గౌరవం ఉండాలి. కొందరు తాము ప్రేమిస్తున్నాం కనుక ఎదుటి వారూ ప్రేమించాలని ఎదురు చూస్తారు. అది సరి కాదు. ముందసలు అవతలి వ్యక్తి మనసులో ఏముందో తెలుసుకోవాలి. తర్వాతే అడుగు ముందుకేయాలి. మీ ప్రేమను అవతలివారు గుర్తించనట్లుగా ప్రవర్తిస్తుంటే... అసలు వారికి ఆసక్తి ఉందో లేదో గమనించాలి. లేదా సూటిగా వారితో చర్చించగలగాలి. దాన్నిబట్టి ఎలా ముందుకెళ్లాలో నిర్ణయించుకోవచ్చు.
అపోహ.. తమతో స్నేహంగా ఉంటే, అది ప్రేమే అని కొందరు అపోహ పడతారు. స్నేహం, ప్రేమ రెండూ ఒకటి కాదు. స్నేహితులైనంత మాత్రాన ప్రేమించాలని లేదు. స్నేహంగానే ఉంటున్నావు కదా.. ప్రేమించడానికి ఏంటి అని వారిని ప్రశ్నించకూడదు. అది వారి మనసుకు సంబంధించిన విషయం. బలవంతంగా ఒప్పించకూడదు. ప్రేమ అంటే మనసు నుంచి పుట్టాలి. వారికి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛనివ్వాలి. భయపెట్టి ప్రేమను పొందినా.. మున్ముందు ఆ ప్రేమ సమస్యగా మారే అవకాశం ఉంది.
అనుమానించొద్దు.. మనల్ని ప్రేమించడం లేదంటే మరొకరిని ఇష్టపడుతున్నారేమో అని అనుమానించకూడదు. అది వారి వ్యక్తిగతం. అలా అనుమానించి అవమానిస్తే స్నేహం కూడా దూరమవుతుంది. అవతలి వ్యక్తి మంచి వారుగా అనిపించినప్పుడు ఆ స్నేహాన్ని నిలబెట్టుకోవాలి. ప్రేమ పేరుతో ఆ బంధాన్నీ దూరం చేసుకుంటే సంతోషం, బాధ వంటివి పంచుకోవడానికి కనీసం ఒక వ్యక్తి కూడా జీవితంలో ఉండరు. ఒక వేళ అతను మరొకరిని ఇష్టపడుతున్నట్లు తెలిసినా అసూయ, ద్వేషాలకు లోనుకాకూడదు. వారి ప్రేమను మనస్ఫూర్తిగా గౌరవించాలి. అప్పుడే భవిష్యత్తులో మీకు తగిన ప్రేమ దొరుకుతుంది. లేదంటే ఆత్మన్యూనత, కుంగుబాటు వంటివి దరిచేరే ప్రమాదం ఉంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని