ఇబ్బంది పెట్టొద్దు..
అమల వాళ్లింటికి ఎవరు వెళ్లాలన్నా ఇబ్బందే. ఎందుకంటే పిల్లలు చేసే డ్యాన్స్‌ను అతిథులు చూసి తీరాలి. అందరెదుటా చేయడానికి పిల్లలు సిగ్గుపడితే వారిని దండించడానికి కూడా తను వెనుకాడదు.
అమల వాళ్లింటికి ఎవరు వెళ్లాలన్నా ఇబ్బందే. ఎందుకంటే పిల్లలు చేసే డ్యాన్స్‌ను అతిథులు చూసి తీరాలి. అందరెదుటా చేయడానికి పిల్లలు సిగ్గుపడితే వారిని దండించడానికి కూడా తను వెనుకాడదు. చిన్నారులను అలా ఇబ్బందిపెట్టకూడదు అంటున్నారు నిపుణులు.
ఇంట్లో పిల్లల అల్లరి సహజమే. తల్లిదండ్రులెదుట వారికొచ్చిన డ్యాన్స్, ఆటలు, పాటలను సరదాగా ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగని ఇంటికొచ్చిన అతిథుల ముందు వారిని అవన్నీ చేసి చూపాలనకూడదు. చాలామంది పెద్దవాళ్లు తమ పిల్లలను అందరూ మెచ్చుకోవాలని ఆశపడుతుంటారు. ఇందులో తప్పులేకపోవచ్చు. అయితే కొత్తవారెదుట కొందరు చిన్నారులు సిగ్గు పడుతుంటారు. ఆ స్థితిలో వారిని బలవంతపెట్టి, నిన్న చేశావుగా.. ఇప్పుడు చేయడానికి ఏంటి అంటూ గద్దిస్తారు. దీంతో వారికి సిగ్గు, భయం మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇదంతా తల్లిదండ్రులపై అయిష్టత పెరగడానికి కారణమవుతుంది. వారికి వారుగా స్వేచ్ఛగా తెలిసిన వాటిని అందరి ముందు ప్రదర్శిస్తే చూసి ఆనందించాలి. లేదంటే వారి ఇష్టానికి వదిలేయాలి. ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించకూడదు.
ప్రదర్శన.. పెద్దవాళ్లు చేసే అలవాటుతో అందరెదుటా తమకు తెలిసినవి ప్రదర్శించాలని చిన్నారులనుకుంటారు. అతిథులు ఇంటికొచ్చిన వెంటనే వారెదుట డ్యాన్స్ చేయడం, లేదా ఎదుటే సైకిల్ తొక్కడం, బొమ్మలన్నీ తీసుకొచ్చి ముందేయడం చేస్తుంటారు. పెద్దవాళ్లు మాట్లాడుకోవడానికి కూడా అవకాశమివ్వరు. ఇది అతిథులకు, ఇంట్లో వాళ్లకూ.. చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. మరికొందరు చిన్నారులైతే తమ వైపు అందరూ చూడటంలేదని, మరింత అల్లరి చేస్తూ అందరి దృష్టీ ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. దీంతో తల్లిదండ్రుల కోపానికి గురవుతారు. ఒక్కోసారి అతిథులకు ఇలాంటివి చూడటానికి పెద్దగా ఇష్టం ఉండకపోవచ్చు. ఇలాంటి వాటి వల్ల వారు మన ఇంటికి రావడానికి ఆసక్తి చూపించరు.
నిబంధన.. అవసరాన్ని, ఆసక్తిని బట్టి అతిథులతో కొద్ది సేపు గడిపాక... పిల్లలను ఆడుకోవడానికో, చదువుకోవడానికో పంపించాలి. అతిథులు మాట్లాడే సమయంలో పిల్లలు అక్కడ ఉండకుండా ఉంటే మంచిది. పెద్దల సంభాషణల్లో ఎన్నో విషయాలు దొర్లుతుంటాయి. అటువంటివి చిన్నారులకు చేరాల్సిన అవసరం లేదు. చాలామంది తమ పిల్లల ప్రవర్తనను పెద్దగా పట్టించుకోరు. ఇది సరైన విధానం కాదు. పెద్ద వాళ్లు మాట్లాడుకుంటున్నప్పుడు జోక్యం చేసుకోవడం, ఆ సంభాషణల్లో పాలు పంచుకోవడం తప్పన్నవి నేర్పాలి. ఆ సమయంలో తోటి పిల్లలతో ఆడుకునేలా చేయాలి. ఆ క్రమశిక్షణ ముందుగానే నేర్పితే అతిథులెదుట వారిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.