ఇండియాలో పెళ్లి..అమెరికాలో విడాకులు సాధ్యమా?
మా అమ్మాయికి పెళ్లై ఐదేళ్లు. పెద్దలు కుదిర్చిన సంబంధమే. మాది విజయవాడ. అబ్బాయిది హైదరాబాద్. నాలుగేళ్లు ఇక్కడే కలిసున్నారు. అమ్మాయి అత్తగారివల్ల ఇద్దరికీ గొడవలు వస్తుండేవి. ఏడాది కిందట అల్లుడు అమెరికాలోని జార్జియా వెళ్లాడు.
మా అమ్మాయికి పెళ్లై ఐదేళ్లు. పెద్దలు కుదిర్చిన సంబంధమే. మాది విజయవాడ. అబ్బాయిది హైదరాబాద్. నాలుగేళ్లు ఇక్కడే కలిసున్నారు. అమ్మాయి అత్తగారివల్ల ఇద్దరికీ గొడవలు వస్తుండేవి. ఏడాది కిందట అల్లుడు అమెరికాలోని జార్జియా వెళ్లాడు. ఆ రాష్ట్రంలో ఆరునెలలు విడిగా ఉంటే విడాకులు ఇవ్వడం తేలికట. అందుకే వెళ్లినట్టు అనుమానం. అమ్మాయి డిపెండెంట్ వీసాతో అమెరికా వెళ్లాక అల్లుడు తనని కలవలేదు. దాంతో బంధువుల ఇంట్లో ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ఈ మధ్య విడాకుల నోటీస్ పంపాడు. అక్కడ రాయబార కార్యాలయాన్ని ఆశ్రయిస్తే పెళ్లి ఇండియాలో అయింది కాబట్టే అక్కడే తెల్చుకోమంటున్నారు. అమ్మాయికి విడాకులు ఇష్టంలేదు. సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలంటే ఏం చేయాలి?
- ఓ సోదరి
అమెరికాలో విడాకులు తనకి ఇష్టంలేదని ఇండియాలో పెళ్లి జరిగింది కాబట్టి ఇండియాలోనే తేల్చుకుంటానని అక్కడి కోర్టువారికి మీ అమ్మాయి చెప్పొచ్చు. అతను విడాకుల నోటీసు పంపినా, మీ అమ్మాయి జార్జియా స్టేట్ లాని ఆశ్రయించనవసరం లేదు. డిపెండెంట్ వీసా మీద వెళ్లింది అంటున్నారు. అది భర్త విడాకుల కేసు మీద ఆధారపడి ఉంటే వీసా పొడిగింపు కాకపోవచ్చు కూడా. అమెరికాలో కోర్టు కేసులో ముందర కోర్ట్ జ్యురిస్‌డిక్షన్ కావాలా వద్దా అనేది తేల్చుకోమని అడుగుతారు. అప్పుడే విడాకులు ఇష్టం లేదు. జ్యురిస్‌డిక్షన్ కూడా అంగీకరించడంలేదని అఫిడవిట్ వేయమనండి. తను హాజరుకాకుండా అతనికి విడాకులు వచ్చినా, ఇండియాలో చెల్లుబాటు కాదు. అమెరికాలో విడాకులు తీసుకున్న కారణం భారతీయ చట్టాల్లో లేకపోతే అది ఇక్కడ చెల్లదు. ఇద్దరికీ ఆమోదమైతేనే చెల్లుబాటు అవుతుంది. ముందు మీ అమ్మాయిని ఇండియా వచ్చి సెక్షన్-9(హిందూ వివాహ చట్టం) కింద రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్‌జ్యుగల్ రైట్స్(దాంపత్య హక్కుల పునరుద్ధరణ) కోసం పిటిషన్ వేయమనండి. ఆ కాపీ అమెరికా కోర్టులో చూపి ఇండియాలో కేసు పెండింగ్ ఉందని చెప్పమనండి. ఇండియాలో కేసుకు సంబంధించి ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌కి అనుమతి తీసుకోమనండి. తల్లిదండ్రుల్ని కూడా కౌన్సెలింగ్‌కి కూర్చోబెట్టి సమస్య పరిష్కారానికి ప్రయత్నించమనండి. తను భర్తతో కలిసి ఉండాలనుకుంటోంది కాబట్టి అతడిపైన క్రిమినల్, గృహహింస కేసులు పెట్టొద్దు. అక్కడ మీ అమ్మాయి సొంతంగా లాయర్‌ని నియమించుకోలేకపోతే.. కేసు డిఫెండ్ చేసుకోవడానికి అమెరికాలో లాయర్ కావాలని విదేశీ వ్యవహారాల విభాగానికి ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోమనండి. ఇండియాలో విడాకులు అంత సులభంగా దొరకవు కాబట్టి అమ్మాయి ఇండియా జ్యురిస్‌డిక్షన్ ఎంపిక చేసుకోవడమే ఉత్తమం. దేనికైనా మీ అమ్మాయి ఒకసారి ఇండియా వచ్చి లాయర్‌ని సంప్రదించడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.