గెలిపించడానికి ప్రయత్నించొద్దు..

పిల్లలు వారంతట వారు విజయం సాధించాలే కానీ ఏదోలా గెలిపించడానికి అమ్మానాన్నలు ప్రయత్నించద్దంటున్నారు నిపుణులు. లేకపోతే వారికి గెలుపు రుచి తప్ప, ఓటమిని భరించలేని స్థాయికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గెలిచేందుకు అవసరమైన నైపుణ్యాలను మాత్రం నేర్పాలని సూచిస్తున్నారు.

Published : 01 Jun 2022 01:11 IST

పిల్లలు వారంతట వారు విజయం సాధించాలే కానీ ఏదోలా గెలిపించడానికి అమ్మానాన్నలు ప్రయత్నించద్దంటున్నారు నిపుణులు. లేకపోతే వారికి గెలుపు రుచి తప్ప, ఓటమిని భరించలేని స్థాయికి చేరే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గెలిచేందుకు అవసరమైన నైపుణ్యాలను మాత్రం నేర్పాలని సూచిస్తున్నారు.

అందరితో కలిసి ఆడే సమయంలో ఆ ఆట నియమాలు పిల్లలకు ముందుగానే చెప్పాలి. వాటిని ఎలా అనుసరించాలో నేర్పాలి. వాటిని పాటించకపోయినా లేదా తెలివిగా ఆడకపోయినా ఓటమి తప్పదని అవగాహన కలిగించాలి. అవన్నీ గెలవాలనే ఆసక్తిని పెంచుతాయి. పట్టుదలగా ఆడతారు కూడా. గెలుపు, ఓటమి గురించి పట్టించుకునే ముందు వారెలా ఆడారో స్వీయపరిశీలన చేసుకునే స్థాయికి ఎదుగుతారు. ఓటమి ఎదురైనా తట్టుకుని తిరిగి గెలవడానికి ఏం చేయాలన్నది సానుకూలంగా ఆలోచించడాన్ని అలవరుచు కుంటారు. బాగా ఆడినప్పుడు ప్రశంసించడం, ఓడినప్పుడు చేసిన తప్పులను సున్నితంగా వివరించి మళ్లీ ప్రయత్నించమని ఉత్సాహపరచడం మంచిది.

బృందంతో...
బృందంతో కలిసి ఎలా ముందుకెళ్లాలో నేర్పాలి. తాను మాత్రమే బాగా ఆడానని, మిగతావారు సరిగ్గా ఆడకపోవడంతోనే ఓటమి చవిచూడాల్సి వచ్చిందని కొందరు పిల్లలు అంటుంటారు. అలాగే బృందంలో తాను మంచి ఆట ప్రదర్శించడం కారణంగానే గెలిచామని భావిస్తుంటారు. ఈ రెండు రకాల ఆలోచనలూ సరైనవి కావని చెప్పాలి. బృందంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఆడేలా చూసుకోవాల్సిన బాధ్యత అందరిదీనని పిల్లలకు తెలియాలి. అప్పుడే ఏది ఎదురైనా సమానంగా స్వీకరించడానికి అందరూ సిద్ధ పడతారు. గెలిస్తే అది అందరి గెలుపుగా భావించేలా వారి ఆలోచనలుండాలి. ఇవన్నీ ఇంటి నుంచే చిన్నారులకు అలవడాలి.

ఓడిపోనివ్వండి...
తమ్ముడు చిన్నోడు.. వాడిని గెలవనియ్యి అంటూ పెద్దపిల్లలను ఓడిపోయేలా చేస్తారు కొందరు. కొన్నిసార్లు పిల్లల సంతోషం కోసం పెద్దవాళ్లూ ఓడిపోతుంటారు. ఈ రెండూ సరైనవి కావంటున్నారు నిపుణులు. ఓటమి రుచి తెలియాలి. లేదంటే గెలుపు తప్ప మరొకటి స్వీకరించలేని మనస్తత్వం పిల్లలకు ఏర్పడుతుంది. ఇది వారితోపాటు పెరిగి పెద్దదవుతుంది. భవిష్యత్తులో పెను సమస్యగా మారుతుంది. మానసిక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇతరుల గెలుపును ఆస్వాదించలేని సంకుచిత స్వభావం ఏర్పడుతుంది. గెలిచిన వారిపై అసూయ, ద్వేషం పెంచుకుంటారు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే చిన్నప్పటి నుంచే ఓటమి రుచిని కూడా చూపిస్తేనే గెలుపు విలువ తెలుస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని