మలి వయసులో మరింత అనుబంధం..

లత, రామారావులకు పెళ్లై 40 ఏళ్లు దాటుతున్నా ఇరువురికీ నిత్యం ఏదో ఒక గొడవ. వీరి స్నేహితుడు రంగారావు దంపతులదీ అదే వయసైనా, ఒకరికోసం మరొకరు అన్నట్లుగా ఉండటం లతకు అర్థంకాదు. మలి వయసులోకి అడుగుపెట్టేటప్పటికే

Published : 07 Jun 2022 01:03 IST

లత, రామారావులకు పెళ్లై 40 ఏళ్లు దాటుతున్నా ఇరువురికీ నిత్యం ఏదో ఒక గొడవ. వీరి స్నేహితుడు రంగారావు దంపతులదీ అదే వయసైనా, ఒకరికోసం మరొకరు అన్నట్లుగా ఉండటం లతకు అర్థంకాదు. మలి వయసులోకి అడుగుపెట్టేటప్పటికే దంపతుల మధ్య బంధం గట్టిగా ఉంటే, అది వారి జీవితాంతం నిలబడుతుందంటున్నారు నిపుణులు. అటువంటి అనుబంధం ఉన్న వారు పాటించే నియమాలను చెబుతున్నారిలా.

వివాహబంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒకరి కోసం మరొకరు మారడం అత్యవసరం. ఎవరి అభిరుచులు వాళ్లకున్నాకూడా.. ఎదుటివారి కోసం కొన్నింటిని మార్చుకోవడం, మరికొన్నింటిని వదిలేయడం కూడా మంచిదే అవుతుంది. అది అవతలివారిపై ప్రేమను సూచిస్తుంది. దంపతుల్లో భాగస్వామి గురించి ఆలోచించే వారు తమను మార్చుకోవడానికి వెనుకంజ వేయరు. అయితే దాన్ని అవతలివారు విలువగా స్వీకరించాలి. కాలం గడిచేకొద్దీ ఒకరి అలవాట్లు మరొకరికి, అలాగే ఎదుటివారి అభిరుచులు ఇవతలివారికి వస్తాయి. ఇలా ఒకరు మరొకరిగా మారిపోతారు. కొన్నాళ్లకు ఇద్దరూ ఒక్కటే అనే భావనలోకి అడుగుపెడతారు. ఇటువంటివారి మధ్య బంధం మలివయసులోనే నూరేళ్లు ముడిపడినట్లు అవుతుంది.

సమానమై..

మూడు ముళ్ల బంధం తర్వాత ఇరువురికీ భేదాభిప్రాయాలు ఉండటం సహజం. వాటిని ఎదుటివారికి వివరించడం, వాటిపై అవగాహన కలిగించడం వంటివి తెలిసినవారు వివాహ బంధంలో తమకంటూ విలువను నిలుపుకొంటారు. భాగస్వామికి తన ఆలోచనలను అర్థమయ్యేలా చెప్పగలిగిన వారే అవతలివారి భావాలకూ విలువనిస్తారు. అప్పుడే అభిప్రాయభేదాలను ఎలా సమన్వయం చేయాలి, ఎలా పరిష్కరించుకోవాలి అనేది ఇరువురికీ తెలుస్తుంది. ఇద్దరిలో ఎక్కువ, తక్కువ అనే భేదాలు దూరమై, సమానమే అనుకుంటారు. ఇది వారిని పరిపక్వతతో కూడిన బంధంతో ముడిపడేలా చేస్తుంది.

ఛాలెంజ్‌గా..

మలి వయసులోకి అడుగుపెడితే రానున్న శారీరక సమస్యలను ముందు నుంచే దంపతులిద్దరూ ఛాలెంజ్‌గా తీసుకుంటారు. వాటిని అధిగమించడానికి సిద్ధంగా ఉంటారు. కలిసి వ్యాయామాలు చేయడం, మనసుకు నచ్చిన పుస్తకాలను కలిసి చదవడం, పర్యాటకప్రాంతాలను చుట్టిరావడం వంటివి చేస్తారు. స్నేహితులు, బంధువులకు తమ బంధంతో స్ఫూర్తినందిస్తారు. అనుబంధ రహస్యాలను చెప్పమంటూ అందరూ అడిగేలా మెలుగుతారు. ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ, దాన్ని గర్వంగా భావిస్తూ జీవితం చివరివరకు ఒకరికొకరుగా అన్నట్లుగా ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్