వాళ్లకీ ఓ మనసుంది...

తమకన్నీ తెలుసు, తాము చేసే ప్రతి పనీ సరైనదే అని పెద్దవాళ్లు భావించడం సహజం. పిల్లలకు తాము మంచి చేస్తున్నామని భావించి వారిని క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ విధానం వికటించి, చిన్నారుల మనసుపై అది చెడు ప్రభావాన్ని కలిగించే ప్రమాదం

Published : 11 Jun 2022 01:18 IST

తమకన్నీ తెలుసు, తాము చేసే ప్రతి పనీ సరైనదే అని పెద్దవాళ్లు భావించడం సహజం. పిల్లలకు తాము మంచి చేస్తున్నామని భావించి వారిని క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ విధానం వికటించి, చిన్నారుల మనసుపై అది చెడు ప్రభావాన్ని కలిగించే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్లు పిల్లల మానసికారోగ్యాన్ని సైతం ప్రభావితం చేస్తాయంటున్నారు.

తర పిల్లలతో పోల్చడం చిన్నారుల్లో మానసిక రుగ్మత, ఆత్మన్యూనతకు కారణమవుతుంది. పెద్దవాళ్ల విమర్శలు, ఇతరులతో పోలికలు కారణంగా పిల్లలు తాము ఏదీ సాధించలేమని, తమలో నైపుణ్యాలు లేవని కుంగుబాటుకు గురవుతారు. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. తమనితాము ప్రేమించుకోవడం మర్చిపోతారు. అందరూ ఒకలా ఉండరని, ప్రతి ఒక్కరిలో ఏదో ప్రత్యేకత నిగూఢంగా దాగి ఉంటుందని తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఆ ప్రత్యేక సామర్థ్యాన్ని గుర్తించి ప్రోత్సహించాలి తప్ప,  విమర్శలతో వేధించకూడదు.
ఆ సమయంలో.. పిల్లలకూ భావోద్వేగాలుంటాయని పెద్దవాళ్లు తెలుసుకోవాలి. కొన్ని సమయాల్లో వారి మనసులోని మాటను గుర్తించకుంటే అది వారి మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తల్లిదండ్రులు నిర్లక్ష్యధోరణి ప్రదర్శించకుండా వారి ఆలోచనలకూ ప్రాధాన్యతనివ్వాలి. మానసికంగా పిల్లలకు  తాము ఒంటరి వాళ్లమనే భావన రానీయకుండా తోడుగా నిలవాలి. ఏ సమయంలోనైనా తామున్నామనే భరోసా ఇస్తే చాలు. వైఫల్యాల నుంచి విజయాలవైపు అడుగులేస్తారు. లేదంటే బయటివారి నుంచి ప్రేమను కోరుకుంటారు. చెడు స్నేహాలు, అలవాట్లకు ఇది దారితీసే ప్రమాదం లేకపోలేదు.

బెదిరించొద్దు.. మీ సంరక్షణ కోసమే మా ఆరోగ్యాలను సైతం లెక్కచేయకుండా కష్టపడ్డాం, మీకది అర్థంకావడం లేదంటూ ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా పిల్లలను బెదిరించకూడదు. మీకు ముందుకెళ్లే సామర్థ్యం రాదు అంటూ కోపంలో కూడా విమర్శించకూడదు. ఇవన్నీ వారిని గిల్టీగా మార్చేస్తాయి. బాధ్యతగా పెంచాం, మీరూ మంచి మార్గంలో వెళ్లాలని ఆశిస్తున్నాం అంటూ సున్నితంగా సంభాషణ కొనసాగితే పిల్లలపై మంచి ప్రభావం చూపిస్తుంది. లేదంటే ఈ తరహా బెదిరింపు పిల్లలను ఆత్మన్యూనతలోకి నెట్టేస్తుంది. భవిష్యత్తులో ముందడుగు వేయడానికి కూడా భయపడుతూ, తాము విజయం సాధించలేమేమో అనే సందేహంతో వెనుకబడుతూనే ఉంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని