ప్రశ్నించనివ్వండి..

అమల కొడుకు ప్రశ్నల పుట్ట. తనేమో సమాధానం చెప్పకుండా విసిగించొద్దంటూ నోరు మూయిస్తుంది. చిన్నారుల సందేహాలను నీరుకార్చొద్దంటున్నారు నిపుణులు. వారికి ప్రశ్నించే స్వేచ్ఛనివ్వాలని సూచిస్తున్నారు.

Published : 22 Jun 2022 01:54 IST

అమల కొడుకు ప్రశ్నల పుట్ట. తనేమో సమాధానం చెప్పకుండా విసిగించొద్దంటూ నోరు మూయిస్తుంది. చిన్నారుల సందేహాలను నీరుకార్చొద్దంటున్నారు నిపుణులు. వారికి ప్రశ్నించే స్వేచ్ఛనివ్వాలని సూచిస్తున్నారు.

చిన్నారులడిగే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు. అలాకాకుండా వారి సందేహాలను తీరిస్తే ఇరువురి అనుబంధం గట్టిపడటానికి అది వారధిగా మారుతుంది. కొందరు చిన్నారులైతే ‘నేనెలా పుట్టా’ అని అడుగుతుంటారు. మరికొందరు పిల్లలు తెలిసిన వారెవరైనా చనిపోతే వారి గురించి ఆరా తీస్తారు. పోయిన వారెక్కడికెళతారు అనేది వారి సందేహం. అటువంటప్పుడు ఈ వయసులో ఇవన్నీ ఎందుకంటూ అనకుండా,  పుట్టుక, చావు గురించి వారికర్థమయ్యేలా వివరించడం పెద్దవాళ్ల బాధ్యత అంటున్నారు నిపుణులు. తోబుట్టువుల మధ్య జరిగే చిన్న చిన్న తగాదాల్లో ఎవరిది తప్పు అంటూ ప్రశ్నించినప్పుడు విసుక్కోకుండా, న్యాయం ఎవరివైపు ఉందో విడమరచడం మంచిది. 

తమ గురించి..

కొందరు పిల్లలు తమ శరీరవర్ణం, ఎత్తు వంటి అంశాల గురించి అడుగుతుంటారు. తోటివారి నుంచి ఎదురవుతున్న విమర్శలు దీనికి కారణం కావొచ్చు. అటువంటి సందర్భంలో వారి మాటలను కొట్టిపారేయకుండా అవగాహన కలిగించాలి. నలుపు, తెలుపు, ఎత్తులో వత్యాసాలు వంటి వాటికి ఎంతవరకు ప్రాముఖ్యతనివ్వాలో వారికి తెలిసేలా చేయాలి. ఉన్నత విద్యాభ్యాసం, వ్యక్తిత్వం, ఇతరులకు సాయం చేసే గుణం, ఏదైనా లక్ష్యాన్ని ఎంచుకోవడం వంటి అంశాలపై ఆసక్తి కలిగేలా చేయాలంటే వారి ప్రశ్నలు ఆధారమవుతాయి. అలా పిల్లల మనసును చదవాలంటే ప్రశ్నించే స్వేచ్ఛనిస్తేనే వీలవుతుంది. అప్పుడే వారికీ అవగాహన కలుగుతుంది. 

పెద్దవాళ్లను..

చిన్నారులు తమకు నచ్చని విషయాన్ని వెంటనే ప్రశ్నించి సమాధానం రాబట్టుకోవడానికి వెనకడుగు వేయరు. అలా ప్రశ్నించే గుణాన్ని నియంత్రించకుండా తగిన జవాబు పెద్దవాళ్లు ఇవ్వగలగాలి. టీవీ చూడటం లేదా ఫోన్‌లో గేమ్స్‌ ఆడటం వంటి వాటికి పిల్లలను దూరంగా పెడుతూ వాటిని పెద్దవాళ్లు చేస్తుంటే మాత్రం చిన్నారులు తప్పక ప్రశ్నిస్తారు. మమ్మల్ని ఎందుకు వద్దంటున్నారనే సందేహం వారి చిన్ని మెదడులో మొదలవుతుంది. దానికి తగిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. లేదంటే ఆ తర్వాత ఏ విషయం చెప్పినా దాన్ని పాటించడంలో నిర్లక్ష్యధోరణి ప్రదర్శించే ప్రమాదం ఉంది. అందుకే పిల్లలకు చెప్పేముందు తల్లిదండ్రులు ఆ నియమాలను పాటించాలి. అప్పుడే పెద్దవాళ్లంటే మర్యాద, ప్రేమ పెరిగి, వారినే స్ఫూర్తిగానూ తీసుకుంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్