అర్థం చేసుకుంటున్నారా..

భార్యాభర్తల మధ్య అనుబంధం గట్టిపడాలంటే అందుకోసం ఇద్దరూ కృషి చేయాలి. దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ.. ముందుకెళితేనే అనుబంధం పెరుగుతుంది. అప్పుడే అది నూరేళ్ల బంధమవుతుంది.

Published : 27 Jun 2022 02:14 IST

భార్యాభర్తల మధ్య అనుబంధం గట్టిపడాలంటే అందుకోసం ఇద్దరూ కృషి చేయాలి. దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ.. ముందుకెళితేనే అనుబంధం పెరుగుతుంది. అప్పుడే అది నూరేళ్ల బంధమవుతుంది. ఇందుకోసం నిపుణులు కొన్ని సూచనలు, సలహాలు చెబుతున్నారు.

పెళ్లైన కొత్తలో ఒకరంటే మరొకరు ప్రేమగా ఉంటారు. ఎదుటివారికిష్టమైనవాటిని అందించడానికి నిత్యం సిద్ధమంటారు. అది కొంతకాలం మాత్రమే కొనసాగుతుంది. ఈ సమయంలోనే ఈ బంధాన్ని శాశ్వతంగా మార్చుకోలేకపోతే వారి మధ్య అనుబంధం బీటలువారే ప్రమాదం ఉంది. కొందరు దూరంగా జరిగితే, మరికొందరు సర్దుకుంటూ అసంతృప్తితోనే కాలాన్ని నెట్టుకొస్తారు. ఇలాకాకుండా ఉండాలంటే వైవాహికబంధం మొదట్లోనే ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వారు మాట్లాడేటప్పుడు మంచి శ్రోతగా మారి వారి మనసును చదవాలి. సమయం ఉన్నప్పుడల్లా ఇరువురూ కలిసి ఇష్టమైన ప్రాంతాలకు తిరిగిరావడం, ఎదుటివారి అభిరుచులను గౌరవించడం, వారి బలం, బలహీనతలు అడిగి తెలుసుకొని దానికి తగినట్లుగా ప్రవర్తించడం చేయాలి. ఇవన్నీ ఇరువురి మనసును పెనవేసుకునేలా చేసి, శాశ్వతమైన స్నేహబంధంతో ముడివేస్తాయి.

నిర్లక్ష్యం వద్దు..

పెళ్లైన కొన్ని రోజులకే ఎవరిపనుల్లో వారు మునిగిపోయి ఎదుటివారిని నిర్లక్ష్యం చేయకూడదు. తమకంటూ ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించుకోవడం మరవకూడదు. మీకోసం మీరుగా అన్నట్లుగా ఆ విలువైన సమయాన్ని వినియోగించుకోవాలి. భాగస్వామి మనసుకు నచ్చిన చిన్నచిన్న కానుకలు అందించడం, పారదర్శకంగా ఉండటం వంటివి చేయాలి. ఇవన్నీ ఎదుటివారి మనసులో మన మనిషి అనే భరోసాను కల్పిస్తాయి. ఇది ఇద్దరి మధ్య మానసిక బంధాన్ని పెంచుతుంది. తన తర్వాతే మిగతావారు అనే భావన భాగస్వామికి కల్పిస్తే చాలు. జీవితమంతా అవతలివారు మీకు నీడలా మారి కలకాలం మీతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. 

కోపంతో..

ఏదైనా సందర్భంలో కోపం వచ్చినా ఎదుటివారిపై ప్రదర్శించకుండా కొన్ని క్షణాలు సమన్వయం పాటించాలి. ఆవేశంలో మాట్లాడే మాటలు ఎదుటివారిని బాధించొచ్చు. తిరిగి వాటిని వెనక్కి తీసుకోలేం. కొంతసేపు ఒంటరిగా ఉండి జరిగినదాన్ని మరోసారి ఆలోచించుకుంటే కోపం తగ్గే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దాని గురించి ఇరువురూ కూర్చొని  మాట్లాడుకుంటే, సమస్యకు పరిష్కారం దొరకొచ్చు. అలా ఒకరిపై మరొకరికి ప్రేమ తగ్గకుండా కాపాడుకోవచ్చు. ఎప్పుడూ ఒకే వైపు నుంచి కాకుండా ఎదుటివారి కోణం నుంచి కూడా ఆలోచించి అర్థం చేసుకుంటే ఎంతటి పెద్ద సమస్యనైనా దాటి ముందడుగు వేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్