భాగస్వామి నియంతలా ఉంటే..

అమూల్యకు పెళ్లైన కొత్తలో తనకు, ఇంటికి కావాల్సినవన్నీ చూసుకుంటున్న భర్తను చూసి మురిసిపోయేది. క్రమేపీ తమ ఇద్దరికీ సంబంధించిన చిన్నా..పెద్ద విషయాన్ని కూడా తెలియకుండానే పూర్తిచేసేవాడు. అదేంటని అడిగితే నేను నీకు చెప్పేదేంటంటూ విలువ లేకుండా మాట్లాడేవాడు.

Published : 30 Jun 2022 00:44 IST

అమూల్యకు పెళ్లైన కొత్తలో తనకు, ఇంటికి కావాల్సినవన్నీ చూసుకుంటున్న భర్తను చూసి మురిసిపోయేది. క్రమేపీ తమ ఇద్దరికీ సంబంధించిన చిన్నా..పెద్ద విషయాన్ని కూడా తెలియకుండానే పూర్తిచేసేవాడు. అదేంటని అడిగితే నేను నీకు చెప్పేదేంటంటూ విలువ లేకుండా మాట్లాడేవాడు. ఇలాంటి నియంతృత్వ ప్రవర్తనను ఎలా మార్చుకోవాలో, సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులు సూచిస్తున్నారిలా..

దంపతుల్లో ఎదుటివారి ఆత్మాభిమానాన్ని గుర్తించి గౌరవించాలి. అప్పుడే ఆ సంసారం సజావుగా సాగుతుంది. అలాకాకుండా ఇద్దరిలో ఎవరో ఒకరు తమకే అంతా తెలుసు, తను చెప్పేదే అవతలివారు వినాలనే ఆలోచన అభిప్రాయభేదాలకు దారితీస్తుంది. తమను అగౌరవపరుస్తున్నట్లుగా భావిస్తారు. ఏ చిన్న అంశమైనా భార్యాభర్తలిద్దరూ కలిసి ఆలోచించి, చర్చించుకోవాలి. అప్పుడే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. అలాకాకుండా బంధువులు, స్నేహితులెదుట భాగస్వామి గురించి తక్కువగా మాట్లాడి కించపరచడం, బాధ్యతలన్నీ తానే చూసుకుంటున్నా అని గొప్పగా చెప్పుకోవడం మంచిదికాదు. తమ అభిప్రాయాన్ని  గౌరవించడం లేదనే ఆలోచన భాగస్వామిలో మొదలై, అది చినికిచినికి గాలివానలా మారే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరికీ ఆలోచించే శక్తి ఉంటుందని ఎదుటివారు తెలుసుకోవాలి. తమలో సగభాగమైన వ్యక్తిని సమభావంతో చూస్తేనే సమాజంలో తమ గౌరవం కూడా నిలబడుతుందనేది ఇద్దరూ అర్థం చేసుకుంటేనే ఆ దాంపత్యం సంతోషంగా ఉంటుంది. 

ఎదుటివారిని..

భార్యాభర్తల్లో ఇరువురూ ఒకరిగురించి మరొకరు తెలుసుకోవాలి. ఎదుటివారేం చెబుతున్నారో విని, వారి అభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రతి చిన్న విషయంలోనూ నీకేం తెలీదు, ఎందుకూ పనికి రావు అంటూ కించపరచడం సరైనదికాదు. ఇది భాగస్వామిని తీవ్ర కుంగుబాటుకు గురి చేస్తుంది. ఏ విషయంలోనైనా కొన్ని హద్దులుంటాయని గుర్తించి, వాటిని దాటకూడదు. మాటలతో అవమానించడం వల్ల దాంపత్యబంధం బీటలు వారుతుంది. ఈ ప్రభావం ఇంట్లో చిన్నారులపైనా.. పడుతుంది. సమాజానికి మేలు చేయాల్సిన పిల్లలు క్రమేపీ తల్లి లేదా తండ్రి పాత్రలపై నిర్దిష్టమైన అభిప్రాయాలకొస్తారు. చిన్నారుల మానసిక స్థితి ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వాతావరణం బాగుండాలి. తల్లిదండ్రులు ఒకరి పట్ల మరొకరు ప్రదర్శించే గౌరవమర్యాదలను చూస్తూ పెరిగే పిల్లలు పెద్దయ్యాక తామూ అదే బాటలో నడుస్తారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని