Updated : 05/07/2022 05:18 IST

పండంటి జీవితానికి పంచ సూత్రావళి

కథలూ, సినిమాలకు మల్లే నవ్వుతూ తుళ్లుతూ కబుర్లు చెప్పుకోవాలని అందరికీ ఉంటుంది. కానీ కొన్ని జంటలే అలా అన్యోన్యంగా ఉండగలుగుతున్నాయి. అధికశాతం పిల్లీ ఎలుకల్లా కయ్యానికి కాలు దువ్వుకోవడం, మాట్లాడుకోవడం కంటే పోట్లాడుకోవడమే ఎక్కువ. ఈ నేపథ్యంలో భార్యాభర్తల్లో గొడవకు దారి తీసే అంశాలు ముఖ్యంగా ఐదని, వాటిని తేలిగ్గానే నివారించవచ్చని చెబుతున్నారు ఫ్యామిలీ కౌన్సిలర్లు. అవేంటో మీరూ చూడండి...

ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒక్కలా ఉండరు. ఇక వేరే వేరే కుటుంబాలూ, నేపథ్యాల్లో పెరిగి పెళ్లితో ఒకటైన భార్యాభర్తల్లో ఎన్నో వ్యత్యాసాలుండొచ్చు. ఆలోచనలూ, ఆచారాలూ కలవకపోవచ్చు. కనుక విభేదాలు తలెత్తడం మామూలే. కానీ అలాంటప్పుడు ఇద్దరూ సంయమనంతో మాట్లాడుకుంటే, భాగస్వామి తీరు తనను బాధిస్తున్న సంగతి చెబితే మార్పు తప్పకుండా వస్తుంది. కానీ ఇద్దరిలో ఒక్కరే సర్దుకుపోవాలి లేదా రాజీ పడాలంటే కష్టమే. ఇద్దరూ చర్చించుకుని చెరి కాస్త మారినా సరిపోతుంది.

ఎంత భార్యాభర్తలైనా కొన్ని హద్దులుంటాయి. తమకంటూ ఒక స్పేస్‌ ఉంటుంది. దాన్ని విచ్ఛిన్నం చేసేసి ఆ వ్యక్తికి సొంతమంటూ ఏదీ ఉండకూడదు.. అమ్మానాన్నలు, అక్కచెల్లెళ్లు - ఇలా ఎవరితోనైనా తన ఎదుటే మాట్లాడాలి, తనతో చెప్పకుండా పైసా ఖర్చుపెట్టకూడదు, తన జోక్యం లేకుండా ఏమీ చేయకూడదు.. లాంటి ఆంక్షలు విధిస్తే ఊపిరి సలపదు. అది సంసారంలా కాక జైల్లో ఉన్న భావన కలుగుతుంది. ప్రేమకు బదులు కసి, ద్వేషం ఏర్పడతాయి.

మరో వ్యక్తి మీద మోజు అనేది సంసారాన్ని కుప్పకూల్చే అంశాల్లో చాలా ముఖ్యమైంది. భార్య లేదా భర్త మరో వ్యక్తి మీద ఆశపడినా, ఆకర్షణకు లోనైనా వాళ్ల సంసారంలో భయానక ఉత్పాతాలు తప్పవు.

కేవలం ప్రేమతో జీవితం సాగదు. సంసార శకటం నడవాలంటే ఇం‘ధనం’ కావాల్సిందే. ఆ విషయంలో భార్యా భర్తలిద్దరూ జాగ్రత్తగానే ఉండాలి. ఏ ఒక్కరు దుబారా చేసినా, బాధ్యతారాహిత్యం చూపినా వైరుధ్యాలూ, విరోధాలూ తప్పవు.

భార్యభర్తల అనుబంధంలో బోర్‌డమ్‌ అనే మాట వినిపించకూడదు. రోజూ తినే అన్నమే అయినా కూరలను, ఇతర వంటకాలను  విభిన్నంగా చేసుకుంటాం కనుక విసుగేయదు. సంసార జీవితమూ అంతే. రోజూ చేసే పనులేనంటూ చిరాకుపడకుండా కొంచెం ఇష్టంగా, ఇంకొంచెం బాధ్యతగా, కాస్త భిన్నంగా, ఇంకొంచెం మెరుగ్గా చేసేందుకు ప్రయత్నిస్తే సరి.. ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని