Published : 11/07/2022 00:56 IST

ఈ అలవాట్లే..

బాల్యం నుంచి నేర్పే మంచి అలవాట్లే.. పిల్లల మానసికారోగ్యాన్ని నిర్దేశిస్తాయంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో వారిని ఉన్నతస్థాయిలో నిలబెట్టడానికి కూడా ఇవే కారణమవుతాయని చెబుతున్నారు.

మానసిక వికాసం కలగడానికి చిన్నారులకు బాల్యమే సరైన సమయం. చిన్నప్పుడు చేసే కొన్ని పొరపాట్లు, వాటిని సరిదిద్దడానికి పెద్దవాళ్లు ప్రయత్నించకపోవడం వంటివే పిల్లలను చెడు మార్గంవైపు అడుగులేసేలా చేస్తాయి. ఆ తర్వాత మార్చలేని స్థాయికి చేరుకోవడంతో వారి భవిష్యత్తుకే ప్రమాదం. ఇవే కుంగుబాటు, ఆందోళన వంటివాటికి దారితీస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన ఓ అధ్యయనంలో 10-12శాతం పిల్లల మానసిక అనారోగ్యాలకు కారణం సరైన వయసులో వారికి మంచి అలవాట్లు నేర్పకపోవడమే కారణమని తేల్చింది.

కోపంలో..

బాల్యంలో పిల్లలు అతి కోపం లేదా ఆవేశాన్ని ప్రదర్శించినప్పుడు వెంటనే ఆ ప్రవర్తన వెనుక కారణాన్ని తల్లిదండ్రులు గుర్తించాలి. వారి భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం నేర్పించాలి. కోపాన్ని నియంత్రించుకోగలిగే నైపుణ్యాలను అందించాలి. ఆ ఆవేశాన్ని, దుందుడుకు స్వభావాన్ని తగ్గించే దిశగా ధ్యానం చేయించడం, క్రీడల్లో ప్రవేశించేలా ప్రోత్సహించడం చేయాలి. సాధారణంగా చిన్నారులు భావోద్వేగాలను ఎలా వ్యక్తీకరించాలో తెలియక దాన్ని కోపంగా కూడా ప్రదర్శిస్తుంటారు. ఆ సమయంలో వారి మార్గాన్ని మళ్లించడానికి ప్రయత్నించాలి. చిత్రలేఖనం, మొక్కల పెంపకం వంటివాటిలో అడుగుపెట్టేలా చేస్తే చాలు. ఏకాగ్రత పెరగడమే కాకుండా మృదువైన స్వభావాన్ని అలవరుచుకుంటారు. మనసుకు నచ్చిన అభిరుచులను నేర్చుకొని ఒత్తిడి, ఆందోళన వంటివాటికి దూరంగా ఉండగలిగేలా మారతారు. 

సమయపాలన..

ఒకే సమయానికి నిద్రపోవడం, ఉదయాన్నే నిద్రలేవడం, హోంవర్క్‌ పూర్తిచేయడం వంటి ప్రతి పనికి సమయపాలన చిన్నప్పటి నుంచే అలవరచాలి. ఇవన్నీ వారిలో క్రమశిక్షణను పెంచుతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పుతాయి. వారిలోని సృజనాత్మకతను బయటకు తీసే ప్రయత్నం చేయాలి. తోటిపిల్లలతో కలిసి ఆడటం, బృందంగా ఏర్పడి గెలుపు కోసం పోరాడటానికి అవకాశం కలిగించాలి. ఈ అలవాట్లు వారిలో ప్రత్యేక నైపుణ్యాలను పెంచుతాయి. చదువులోనూ ముందడుగు వేస్తారు. సామాజికపరమైన అంశాలపై అవగాహన తెచ్చుకుంటారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఛాలెంజ్‌లను దాటగలిగే సామర్థ్యాలను పెంచుకుంటారు.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని