Published : 12/07/2022 01:59 IST

పిల్లలు కుయుక్తులు చేేస్తున్నారా...

హారతి కొడుకు అప్పటివరకు బాగానే ఉంటాడు. స్కూల్‌కు టైం అవుతున్నప్పుడు అకస్మాత్తుగా కడుపు నొప్పి అని ఏడుస్తాడు. తీరా స్కూల్‌ బస్‌ వెళ్లిన తర్వాత మామూలుగా ఉంటాడు. ఇలాంటి ప్రవర్తన వెనుక ఉండే కారణాలను తల్లిదండ్రులు గుర్తించి, పిల్లలెదుర్కొనే నిజమైన సమస్యలను పరిష్కరించాలని నిపుణులు సూచిస్తున్నారు.

చదువులో బాగా అలసినట్లు అనిపించినా, పాఠశాలలో అసౌకర్యంగా ఉన్నా, టీచర్లు లేదా సహ విద్యార్థులతో ఇబ్బంది ఎదురైనా పిల్లలు స్కుల్‌కు వెళ్లడానికి ఇష్టపడరు. వారి సమస్యలను చెప్పడం తెలియక అబద్ధం ఆడటానికి ప్రయత్నిస్తారు. ఏది చెబితే అమ్మ ఆగిపోతుందో ఆ దిశగా నటిస్తారు. లేదా ప్రణాళికగా సమయాన్ని చూసి మరీ కొత్త ప్లాన్స్‌ వేయడానికి సిద్ధపడుతుంటారు. అలా వీరి ప్రవర్తన వెనుక కారణాలను పెద్ద వాళ్లు కనిపెట్టగలగాలి. దానికి తగిన పరిష్కారాన్ని అందిస్తే క్రమేపీ ఈ తరహా ఆలోచనల నుంచి పిల్లలు బయటపడతారు.

నిజమేమో..

కొన్ని సందర్భాల్లో పిల్లలు ఆరోగ్యపరంగా నిజంగానే ఇబ్బంది పడుతుండొచ్చు. ఇంట్లో ఆహారాన్ని తీసుకోవడమే కాదు, స్కూల్‌కు తీసుకెళుతున్న లంచ్‌ను తింటున్నారా లేదా కనుక్కోవాలి. అలాగే పెద్దవాళ్లకు తెలియకుండా చాక్లెట్స్‌ వంటి తీపి పదార్థాలెక్కువగా తీసుకున్నా కూడా కడుపునొప్పి రావడం సహజం. ఈ కోణంలో కూడా తల్లిదండ్రుల పరిశీలన చాలా ముఖ్యం. ఆరోగ్యపరంగా వారిలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, వాతావరణానికి తగిన ఆహారాన్ని అందించాలి. మంచి ఆహారపుటలవాట్లను అలవరచాలి. అప్పటికీ ఈ సమస్య ఉంటే వైద్యులను సంప్రదిస్తే మంచిది.

స్నేహితులు..

పిల్లల ప్రవర్తన ఇంట్లోలా బయట ఉండకపోవచ్చు. స్నేహితుల ప్రభావంతో వారిలో మార్పు రావడానికి అవకాశం ఉంది. చదువు, క్రీడలపై ఆసక్తి ఉండే స్నేహితులైతే సమస్య లేదు. అలాకాకుండా చదువంటేనే శ్రద్ధలేని పిల్లలతో మీ చిన్నారులు స్నేహం చేస్తే మాత్రం ఆ ప్రభావం వారిని తప్పుదోవ పట్టిస్తుంది. అబద్ధాలు ఆడటం, చదువులో వెనుకబడుతున్న విషయం ఇంట్లో తెలియకుండా ఉండటానికి రకరకాల కుయుక్తులు మొదలు పెడతారు. ఆదిలోనే దీన్ని గుర్తిస్తేనే, పిల్లలను ఇందులోంచి బయటకు తేవొచ్చు. తెలిసీ తెలియని వయసులో వారు వేసే తప్పటడుగులను గుర్తించి, వారిపై కోపాన్ని ప్రదర్శించకుండా, సున్నితంగా మాట్లాడాలి. భవిష్యత్తుపై అవగాహన కలిగించి మార్చడానికి కృషి చేయాలి. అదీ ఒక రోజు రాదు.. ఓర్పుతో క్రమంగా వారిలో మార్పు తేవడానికి ప్రయత్నించాలి.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని