గెలవాలా.. నేర్పించండి!
పిల్లలు అన్నింటా ముందుండాలి. ఎన్నో సాధించాలి అని కోరుకోని తల్లుండదు. మీరూ అంతేనా! అయితే అందుకు మన వంతుగా కొన్ని చేయాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..
పిల్లలు అన్నింటా ముందుండాలి. ఎన్నో సాధించాలి అని కోరుకోని తల్లుండదు. మీరూ అంతేనా! అయితే అందుకు మన వంతుగా కొన్ని చేయాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..
చేయనివ్వండి.. గారాబం కొద్దో, స్కూల్లో కష్టపడి పోయారనో ఇంట్లో పని చెప్పం. ఇక పెద్దవాళ్లు ఉంటే మనం ఇద్దామనుకున్నా వాళ్లు ఊరుకోరు. ఇది మంచి పద్ధతి కాదు. వారికి చిన్న చిన్న పనులు అప్పగించండి. జ్ఞాపక శక్తితోపాటు పనిలో వచ్చే అడ్డంకులు, వాటిని అధిగమించడం, పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి నైపుణ్యాలు ఏర్పడతాయట. వాళ్ల సొంత పనులు, పెంపుడు జంతువుకు సంబంధించినవి అప్పగించినా సరే!
మర్యాద నేర్పండి.. ఎదగడానికీ మర్యాదకీ సంబంధమేంటీ అంటారా? సాయం పొందినప్పుడు థాంక్స్ చెప్పడం, ఎవరికైనా చేసినప్పుడు కృతజ్ఞతలు అందుకోవడం ఆనందాన్ని పెంచడమే కాదు ఒత్తిడినీ దూరంగా ఉంచుతాయట. ఎదుటి వారి పట్ల కృతజ్ఞతాభావం, బాధ్యతగా ఉండటం అనే లక్షణాలనూ పెంపొందిస్తాయి.
భావోద్వేగాలు.. వీటినెలా నేర్పించడం? అంటే.. మనం చేయడం ద్వారా! పిల్లలూ పెద్దల ప్రపంచాల మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. వాళ్లు చేసే చిన్న తప్పులకూ త్వరగా స్పందించి కోప్పడటం.. మనమే తొందర పడ్డామని తెలిసినా చూసీచూడనట్లు వదిలేయడం.. మనం చాలా చిన్న అంశాలుగా కొట్టిపడేసేవే. కానీ అవి వాళ్లు నేర్చుకునే పాఠాలు. సందర్భమేదైనా స్పందించే ముందు కొద్దిగా ఆలోచించండి. ఇది సమస్యపైనే కాదు.. తర్వాత ఏం చేయాలన్న దానిపై కొంత స్పష్టతకూ కారణమవుతుంది. మీరు దీన్ని అలవరచుకుంటే మిమ్మల్ని చూసి వాళ్లూ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ఎదుటి వారి కోణంలో ఆలోచించడం వంటి లక్షణాలను అలవరచుకుంటారు.
వీడియో గేమ్స్.. మారాం చేయకుండా ఉంటారనో, ఏడుస్తున్నారనో ఫోన్ చేతిలో పెడుతుంటాం కదా! కార్టూన్‌లకు బదులు వీడియో గేమ్‌లు ఆడేలా ప్రోత్సహించండి. పిల్లల ఐక్యూ పెరగడంలో ఇవి సాయపడతాయని యూరప్‌కు చెందిన ఓ సంస్థ అధ్యయనం చెబుతోంది.
ఎంచుకోనివ్వండి.. మనకి నచ్చింది వాళ్లు సాధించాలనుకోవడం అత్యాశే. వాళ్లకేం కావాలో దాన్ని చేయనివ్వండి. ఆనందంతో ఉరకలు వేస్తూ చేసేస్తారు. విజయానికి అసలు రహస్యమూ అదే! కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తామన్నా, చేస్తామన్నా అంగీకరించండి. దాని వల్ల అనుభవం, ఆత్మవిశ్వాసం వస్తాయి. ఇవి వాళ్లకు సాయపడేవే!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.