మౌనంతో బాధిస్తోంటే...
రమణి భర్తకు కోపం వస్తే చాలు. వారం పది రోజులు మాట్లాడడు. ఏంటని అడిగినా సమాధానం చెప్పడు. ఇలా మూగనోము పట్టి భాగస్వామి మనసును బాధించే వారిని అనునయిస్తూ మార్చడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. అప్పుడే
రమణి భర్తకు కోపం వస్తే చాలు. వారం పది రోజులు మాట్లాడడు. ఏంటని అడిగినా సమాధానం చెప్పడు. ఇలా మూగనోము పట్టి భాగస్వామి మనసును బాధించే వారిని అనునయిస్తూ మార్చడానికి ప్రయత్నించాలంటున్నారు నిపుణులు. అప్పుడే ఆ బంధం నిత్యం సంతోషంగా ఉంటుందని చెబుతున్నారు.
దంపతుల్లో అభిప్రాయ భేదాలు లేదా ఒకరిపై మరొకరికి కోపం వచ్చినా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అంతేకానీ కారణం చెప్పకుండా మనసులోనే దాచుకోవడం మంచిది కాదు. భాగస్వామిపై వచ్చే కోపం, అసహనాలకు కారణాలను అప్పటికప్పుడే చెప్పగలగాలి. అప్పుడే ఆ సమస్య అక్కడితో తీరుతుంది. లేదంటే పెరిగి పెద్దదై, చివరకు మనసును ప్రతికూల ఆలోచనలతో నింపేస్తుంది. తీవ్ర సంఘర్షణకు గురి చేస్తుంది. ఇవి అవతలి వారిపట్ల వ్యతిరేక భావాలను పెంచుతాయి. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ సాధారణంగా మాట్లాడుకున్నా.. మనసులో ఆ కోపం అలాగే ఉండి, క్రమంగా బంధం బీటలువారే ప్రమాదం ఉంది.
నిర్లక్ష్యంగా..
మనసులో కోపాన్ని బయటకు చెప్పకుండా ఎదుటివారిని తమ నిశ్శబ్దంతో వేధించడం మంచిది కాదు. దీనివల్ల భాగస్వామి తీవ్ర వేదనకు గురికావొచ్చు. లేదా ఎప్పటికీ మారరు అనే అభిప్రాయానికి వచ్చి, ప్రేమ తగ్గి, అది క్రమేపీ నిర్లక్ష్యంగా మారొచ్చు. ఫలితంగా ఒకరిపై మరొకరికి ఉదాసీనత మొదలవుతుంది. ఇది ఆ దంపతుల మధ్య సంతోషాన్ని హరిస్తుంది. కష్టమైనా సుఖమైనా బంధాన్ని ముడివేసేవి మాటలే. మరి ఆ మాటే భార్యాభర్తల మధ్య కరవైనప్పుడు ఇద్దరూ మానసికంగా దూరమవడం మొదలవుతుంది. తమ కోపానికి కారణాన్ని, కారకులు క్షమాపణలు చెప్పి పరిష్కరించు కోవాలి. మరోసారి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. అప్పుడే ఒకరిపై మరొకరికి గౌరవం, ప్రేమ పెరుగుతాయి.
ఛేదించి..
ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ నిశ్శబ్దాన్ని ఛేదించేందుకు ప్రయత్నించాలి. చాలామందికి ఈ అలవాటు బాల్యం నుంచి ఉండి ఉండొచ్చు. అటువంటి వారిని క్రమేపీ మార్చడానికి భాగస్వామి కృషి చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. వారితో సున్నితంగా, అనునయంగా మాట్లాడటానికి ప్రయత్నించి మనసులోని మాటను బయటకు రప్పించాలి. వారి కోపం తీరేవరకూ మాట్లాడనివ్వాలి. వారేం చెబుతున్నారో పూర్తిగా వినాలి. ఆ తర్వాత తమవైపు ఏం జరిగింది లేదా తామెందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో వివరించాలి. అలాగే మాట్లాడకుండా కోపాన్ని ప్రదర్శించే వారు కూడా తమని తాము మార్చుకోవడానికి కృషి చేయాలి. అప్పుడే ఆ బంధం కలకాలం సంతోషంగా కొనసాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.