సున్నితమైన పిల్లల కోసం..
అదితి ఏడేళ్ల కూతురు ప్రతి విషయానికీ కంట తడిపెడుతుంది. చిన్న మాట అన్నా బాధతో ముడుచుకు పోతుంది. ఇలాంటి సున్నితమైన చిన్నారులను జాగ్రత్తగా పెంచాలంటున్నారు నిపుణులు. వీరిలో
అదితి ఏడేళ్ల కూతురు ప్రతి విషయానికీ కంట తడిపెడుతుంది. చిన్న మాట అన్నా బాధతో ముడుచుకు పోతుంది. ఇలాంటి సున్నితమైన చిన్నారులను జాగ్రత్తగా పెంచాలంటున్నారు నిపుణులు. వీరిలో ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించాలని చెబుతున్నారు.
ఈ తరహా పిల్లలను చిన్నప్పుడే గుర్తించొచ్చు. వీరి ఆలోచనలు, ప్రవర్తన చాలా సున్నితంగా ఉంటాయి. ఎక్కువ భావోద్వేగాలను ప్రదర్శిస్తారు. ప్రతి చిన్న విషయానికీ స్పందిస్తారు. ఇతరులను అమితంగా ప్రేమిస్తారు. అలాగే వారేదైనా సరదాగా చిన్నమాట అన్నా వెంటనే బాధపడతారు. వేదనను బయటకు చెప్పరు. వారిలో వారే కుమిలిపోతారు. తమ లాంటివారితో మాత్రమే కలుస్తారు. మిగతా చిన్నారుల దగ్గరకు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. ఇవన్నీ గుర్తించి దానికి తగినట్లుగా పెంచాలి.
సౌకర్యంగా..
ఇంట్లో మిగతా పిల్లల మధ్య సున్నితమైన పాప, లేదా బాబు ఉన్నప్పుడు ప్రత్యేకంగా కొంత స్వేచ్ఛతోపాటు వారికెక్కడ సౌకర్యంగా ఉందో గుర్తించి అటువంటి వాతావరణం కల్పించాలి. అలాకాకుండా మిగతావారితో కలిపి పోల్చడం సరి కాదు. అలా చేస్తే నలుగురిలోకి రావడానికి ఆసక్తి చూపించరు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. ఈ తరహా పిల్లల్లో ఉండే నైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహిస్తే చాలు. క్రమేపీ అందరితో కలవడానికి ముందుకొస్తారు. వారు చేసే మంచి పనిని ప్రశంసిస్తే నెమ్మదిగా ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది.
గుర్తు చేయాలి..
క్రమశిక్షణ పేరుతో కఠినపదజాలంతో కోప్పడకూడదు. ఒకటికి పదిసార్లు అయినా ఆ పనిని నెమ్మదిగా, సున్నితంగా చెబుతూనే ఉండాలి. వారు చేయాల్సిన పనులను గుర్తు చేస్తుండాలి. క్రమేపీ బాధ్యతాయుతంగా మారి తమ పనులను తామే చేసుకునే స్థాయికి చేరతారు. అలాగే ఈ చిన్నారులు ఇబ్బందిపడే ప్రాంతాలు, వాతావరణాల్లోకి పదేపదే తీసుకెళ్ల కూడదు. అది వారి బలహీనతగా గుర్తించి బలవంతం చేయకూడదు. ఎక్కువ శబ్దాలు వినిపించే కార్యక్రమాలు లేదా ఇంట్లో టీవీ ఎక్కువ సౌండ్ పెట్టడం వారికి నచ్చకపోవచ్చు. వాటికి దూరంగా ఉంచడానికి ప్రయత్నించాలి.
విశ్రాంతి..
స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ పూర్తిచేసి, ఆ తర్వాత అదే వేగంతో తోబుట్టువులు ఆడుకోవడానికి వెళ్లినా, ఈ పిల్లలకు మాత్రం విశ్రాంతి అవసరం. అనుకున్నంత త్వరగా మిగతా వారిలా వీరు ప్రవర్తించలేరు. తగిన సౌకర్యం, సమయం కల్పిస్తే, కాసేపటికి ఉత్సాహంగా మారతారు. పోషకాహారం అందించడం, మృదువుగా మాట్లాడటం వంటివన్నీ వీరి సామర్థ్యాలను పెంచుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.