Published : 27/07/2022 00:17 IST

పిల్లలెందుకు.. అబద్ధాలు చెబుతారంటే

మన పిల్లలంటే మనకు బోల్డంత ఇష్టం. కానీ బుడతలు అనేకసార్లు అలవోకగా అబద్ధాలు చెప్పేస్తుంటారు. అది అలవాటుగా మారితే మట్టుకు భవిష్యత్తులో వాళ్లకీ మనకీ కూడా ఇబ్బందే.  ప్రమాదంగానూ పరిణమించవచ్చు. ఈ నేపథ్యంలో చిన్నారులు నిజాయతీగా ఉండేందుకు నిపుణుల సూచనలు చూడండి...

* పిల్లలు ఏయే సందర్భాల్లో నిజాలు చెప్పడం లేదో గమనించండి. హోంవర్క్‌ చేయకుండానే చేశాను... టీచర్‌ ప్రోగ్రెస్‌ కార్డ్‌ ఇచ్చినా ఇవ్వలేదు... లాంటి అబద్ధాలు చెబుతున్నారంటే కొన్ని సబ్జెక్టుల్లో వారికి బొత్తిగా ఆసక్తి లేదని గ్రహించండి. బోధనలో తేడా ఉందో లేక చిన్నారి అవగాహనా సామర్థ్యంలో లోపం ఉందో తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రయత్నించండి.

* ప్రవర్తనా తీరు, నిజాయతీకి సంబంధించిన కథలు తరచుగా చెబుతుండండి. అవి పిల్లలపై ఎంతో ప్రభావం చూపుతాయి. ఇంకొన్నిసార్లు మీకు తెలిసిన వ్యక్తులు అబద్ధం చెప్పడం వల్ల ఎంత ప్రమాదంలో ఇరుక్కున్నారో, ఎలా పరాభవం జరిగిందో విడమరిచి చెప్పండి. ఇలాంటి ఉదాహరణలు కూడా బలమైన ముద్ర వేస్తాయి.

* టెక్ట్స్‌ పుస్తకం పోవడం, స్కూల్‌ బ్యాగ్‌ చిరిగిపోవడం లాంటివి జరిగినప్పుడు మీరు కొడతారు లేదా కోప్పడతారని.. వాటిని కప్పిపెట్టి అబద్ధాలు చెబుతుంటారు. ఆ భయాన్ని పోగొట్టండి. నిజం చెప్పకపోతే మరిన్ని ఇబ్బందులు వస్తాయని స్పష్టంచేసి, ఈసారి నష్టం జరగకముందే అప్రమత్తంగా ఉండాలని అనునయంగా చెప్పండి. 

* వ్యక్తిత్వం రూపుదిద్దుకునేది బాల్యంలోనే కనుక మంచి నడవడిక అలవరచుకోవాలని.. ఇప్పుడు కనుక నిర్లక్ష్యంగా ఉంటే ఆ మూస పోసిన ఆకృతిని ఇక మార్చడం కుదరదని తెలియజేయండి. దొంగలా తయారైతే హేళన చేస్తారు, నీతిగా ఉంటే గౌరవం అందుకోవచ్చు.. ఏది కావాలో నువ్వే ఆలోచించుకో- తరహాలో అర్థమయ్యేలా చెప్పండి. 

* ఇంకొందరు పిల్లలు జరిగింది జరిగినట్టు చెబితే విషయంలో ఆసక్తి ఉండదు, తమపై ధ్యాస పెట్టరని అబద్ధాలు చెబుతారు. తమకు ప్రాధాన్యత, గుర్తింపు కావాలనే తాపత్రయం అది. వాళ్లేదైనా చెబుతున్నప్పుడు ‘ఇంక చాల్లే ఆపు’ అనకుండా ఓపిగ్గా వింటుంటే అబద్ధాల జోలికి వెళ్లరు. తమ మీద తమకు విశ్వాసం పెరుగుతుంది. నలుగురిలో తామొకరు కాకుండా ప్రత్యేకంగా ఉండాలనుకునే చిన్నారులు కూడా అబద్ధాలను ఆశ్రయిస్తారు. ఈ లక్షణం ముదరకముందే మంచి మాటలతో సరిచేస్తే సరిపోతుంది.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని