ఆయన అసూయ పడుతున్నారా!

వనిత భర్త ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ బాధ కలిగేలా చేస్తుంటాడు. పుట్టింటి నుంచి చెల్లి, తమ్ముడు వచ్చినప్పుడు కూడా అసూయ పడుతుంటాడు. ప్రతి చిన్న విషయాన్నీ పెద్దగా చేసి మాట్లాడతాడు. ఇలా భాగస్వామి పట్ల అసూయ ఉన్నవారిని మార్చడానికి ప్రయత్నించొచ్చు అంటున్నారు నిపుణులు...

Published : 07 Aug 2022 00:34 IST

వనిత భర్త ఎప్పుడూ ఏదో ఒక మాట అంటూ బాధ కలిగేలా చేస్తుంటాడు. పుట్టింటి నుంచి చెల్లి, తమ్ముడు వచ్చినప్పుడు కూడా అసూయ పడుతుంటాడు. ప్రతి చిన్న విషయాన్నీ పెద్దగా చేసి మాట్లాడతాడు. ఇలా భాగస్వామి పట్ల అసూయ ఉన్నవారిని మార్చడానికి ప్రయత్నించొచ్చు అంటున్నారు నిపుణులు.

మకోసం సమయాన్ని కేటాయించడం లేదనే ఆలోచన వచ్చినప్పుడు భాగస్వామిలో అసూయ మొదలవుతుంది. తమతోకన్నా ఎదుటివారితో ఎక్కువ సంతోషంగా ఉంటున్నట్లు భావిస్తారు. దాంతో వారిలో ఆత్మన్యూనత పెరుగుతుంది. అది నియంత్రించుకోవడానికి బదులుగా ఎదుటి వారిని మాటలతో బాధపెడుతూ సంతృప్తి పడుతుంటారు. ఇటువంటి సందర్భంలో అవతలి వారిని నిందించకుండా, వారి మానసిక పరిస్థితిని గుర్తించాలి. వారితో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయాలి. భాగస్వామికి తమ హృదయంలో ఉండే స్థానాన్ని చెప్పాలి. సమయం ఉన్నప్పుడల్లా దంపతులిద్దరూ బయటికి వెళ్లడం, సరదాగా గడపడం వంటివి భాగస్వామికి అసూయ కలగకుండా చేస్తాయి.  

నమ్మకం..

ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. ఎదుటి వారిని తాము ప్రేమిస్తున్న విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలి. భాగస్వామికి ఒక కానుక కొని, అక్కడితో పని పూర్తయింది అనుకోవడం కన్నా, దాన్ని ప్రేమగా వారికి అందించి, వారి కళ్లలో ఆనందాన్ని చూడాలి. ప్రేమను వ్యక్తీకరించే పద్ధతిలోనే వారి మనసును గెలవొచ్చు. వారి ఇష్టాయిష్టాలను తెలుసుకొని విలువనివ్వాలి. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించాలి. ఇవన్నీ దంపతుల మధ్య అనుబంధాన్ని పెంచి ఇరువురి మనసులనూ నమ్మకంతో నింపుతాయి. నమ్మకం ఉన్నచోట అసూయకు తావుండదు.

చర్చించి..

ఎదుటివారి ప్రవర్తనలో తేడా కనిపించినప్పుడు వెంటనే కారణాన్ని అడిగి తెలుసుకోవాలి. భాగస్వామిలో వచ్చే మార్పును గ్రహించగలగాలి. సమస్య గురించి ఇద్దరూ చర్చించుకోవాలి. మూడో వ్యక్తికి అవకాశమివ్వకుండా భార్యాభర్తలిద్దరే సున్నితంగా మాట్లాడుకుంటే, ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. ఎదుటి వారి మనసును చదవగలిగితే చాలు. వారి హృదయాన్ని గెలుచుకోవచ్చు. అలాగే భాగస్వామిపై నమ్మకాన్ని వదలకూడదు. అసూయపడుతున్నారంటే ఎదుటివారిపై నమ్మకాన్ని పోగొట్టుకున్నట్లే. అందుకే ఒకరికోసం మరొకరు అన్నట్లుగా ఉండాలి. ఇరువురూ ప్రేమను పంచుకుంటే.. ఆ బంధం ఎప్పటికీ దూరం కాదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్