పిల్లలకు గాంధీగిరి పాఠాలు

గాంధీ సిద్ధాంతాలు, అహింసా వాదం విదేశీయులనూ ప్రభావితం చేశాయి. అలాంటివాటిని నేటి తరానికి పరిచయం చేయడం చాలా అవసరం అనుకున్నారు జాన్హవి. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించడమే కాదు.. ఎన్నో కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు.

Published : 15 Aug 2022 02:21 IST

గాంధీ సిద్ధాంతాలు, అహింసా వాదం విదేశీయులనూ ప్రభావితం చేశాయి. అలాంటివాటిని నేటి తరానికి పరిచయం చేయడం చాలా అవసరం అనుకున్నారు జాన్హవి. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించడమే కాదు.. ఎన్నో కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు.

న 29వ ఏట జాన్హవి ప్రసాదా మహాత్మాగాంధీ జీవితచరిత్ర ‘మై ఎక్స్‌పెరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌’ చదివారు. ఈ పుస్తకం ఆమెపై ఎంత ప్రభావం చూపిందంటే.. తన జీవితాన్ని గాంధీ మార్గానికి అంకితం చేసేంతంగా! మహాత్ముడి అహింసా, సత్యాగ్రహ మార్గాల ద్వారా ఇతరులకు అందించిన స్ఫూర్తిపై అందరికీ అవగాహన కల్పించాలనుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పు, సామాజిక న్యాయం వంటి ఎన్నో అంశాలపై గాంధీజీకి అప్పట్లోనే ఆలోచనలున్నాయి. వీటన్నింటి పట్ల ప్రభావితురాలైన జాన్హవి, వాటిని నేటితరానికి తప్పక చేరువ చేయాలనుకున్నారు. అందుకే ఆడియో రూపంలో కథలు, యానిమేషన్‌, సంగీత రూపాల్లో గాంధీ సందేశాలను ‘యూత్‌4గాంధీ’ పేరుతో ఆన్‌లైన్‌లో ప్రచారం చేయడం ప్రారంభించారు. అలా 2010లో మొదలుపెట్టిన దీనిలో దాదాపు 2 లక్షలమంది విద్యార్థులు పాల్గొని తమ కళల్ని ప్రదర్శించారు. నాలుగేళ్ల తర్వాత ‘హ్యాష్‌టాగ్‌సెర్చ్‌4గాంధీ.కాం’ ప్రారంభించారు. దీనిలో మహాత్ముడి జీవిత విశేషాలను ఉంచారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా 9 దేశాల్లో మూడు లక్షలమందికి ఆయన సిద్ధాంతాల్ని చేరువ చేయగలిగారు. దీనిలో 3వేల పాఠశాలలు పాలుపంచుకున్నాయి. దిల్లీలోని మరో 100 స్కూళ్లు వీధినాటకాల ద్వారా గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ముందుకొచ్చాయి.
జమీందార్ల కుటుంబానికి చెందిన జాన్హవి.. పుట్టింది దిల్లీ. పెరిగింది మాత్రం ఉత్తర్‌ప్రదేశ్‌లోని నైనిటాల్‌. అక్కడ ఆమెకు 145 ఏళ్ల చరిత్ర ఉన్న భవంతి ఉంది. దానితో ఆమెకు అనుబంధమెక్కువ. చదువుతోపాటు సాహిత్యం, సంగీతం, పర్యావరణం, స్థానిక రుచులు వంటి అంశాలపై అమితాశక్తి. దీంతో వీటన్నింటిపై అవగాహన పెంచుకోవడం ప్రారంభించారు. ‘ప్రముఖుల జీవితచరిత్రలు చదివితే ఎలా జీవించాలో తెలుస్తుందని అమ్మ చెప్పేది. అదే నన్ను బాపూ గురించి తెలుసుకునేలా చేసింది. ఆయన సిద్ధాంతాలకు ప్రభావితురాలినయ్యా. స్వాతంత్య్రోద్యమంలోకి రాకముందు ఆయన జీవితం గురించి ‘టేల్స్‌ ఆఫ్‌ యంగ్‌ గాంధీ’ పేరుతో గ్రాఫిక్‌ నవలగా తీసుకొచ్చా. ఈ పుస్తకాన్ని ప్రధాని మోదీని కలిసి ఆయనకు బహూకరించడం సంతోషాన్నిచ్చింది. అలాగే ‘పీస్‌ గేమింగ్‌’ గాంధీ స్టార్టప్‌తో పిల్లలకు నిత్యజీవితంలో గాంధీతో అనుబంధం ఉండేలా తీర్చిదిద్దగలిగా. నేను పెరిగిన వారసత్వ కట్టడాన్ని పర్యటక స్థలంగా మార్చా. ఇక్కడ బస సౌకర్యాన్ని అందించి పురాతన కట్టడాల గురించి తెలిసేలా చేస్తున్నా’ అని చెబుతున్న జాన్హవి ‘యూత్‌ ఫర్‌ గాంధీ ఫౌండేషన్‌’ స్థాపించి గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, ఆయన అహింసామార్గాన్ని అందరికీ చేరువ చేసేలా పుస్తకాల పంపిణీ వంటివి చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని