ప్రేమ కాకూడదు ఒత్తిడి

సుమితకు పెద్దలే చక్కటి సంబంధం కుదిర్చి చేశారు. అందరూ ఆ వధూవరులను చూసి మంచి జంట అన్నారు. పెళ్లైన తర్వాత ప్రతి చిన్నపనికీ కూడా ఉండే భర్తను చూసి మురిసిపోయిన సుమిత్రకు క్రమేపీ ఆ పద్ధతి నచ్చలేదు. ఏదైనా హద్దు మీరితే అవతలి వారికి ఇబ్బందే అంటున్నారు నిపుణులు...

Published : 18 Aug 2022 01:23 IST

సుమితకు పెద్దలే చక్కటి సంబంధం కుదిర్చి చేశారు. అందరూ ఆ వధూవరులను చూసి మంచి జంట అన్నారు. పెళ్లైన తర్వాత ప్రతి చిన్నపనికీ కూడా ఉండే భర్తను చూసి మురిసిపోయిన సుమిత్రకు క్రమేపీ ఆ పద్ధతి నచ్చలేదు. ఏదైనా హద్దు మీరితే అవతలి వారికి ఇబ్బందే అంటున్నారు నిపుణులు...

పెళ్లైన వెంటనే అవతలి వ్యక్తికి పూర్తిగా తమ గురించి చెప్పేయడం చాలా మందికి అలవాటు. తమ బలాలు, బలహీనతలు, అభిరుచులు, స్నేహితులు, చిన్నప్పటి విశేషాలతో పాటు బంధువులపై  తమ ప్రతికూల అభిప్రాయాలు... ఇలా సమాచారమంతా ఒకేసారి కుమ్మరించేస్తారు. కొత్తలో అన్నీ బాగున్నట్లే ఉంటుంది. ఆ తర్వాత స్వీయవివరాలు లేదా బంధువుల గురించి మాట్లాడేటప్పుడు మొదట్లో మీరు ఏర్పరిచిన ప్రభావమే ప్రతిఫలిస్తుంది. దాంపత్యంలో క్రమేపీ ఒకరికొకరు అర్థం కావాలి తప్ప, ఒకేసారి ఇతరులకు పూస గుచ్చినట్లు తమ గురించి చెప్పకూడదు. ఇరువురూ తమ కోసం కొంత స్పేస్‌ ఉంచుకుంటే, అది మనపై గౌరవాన్నీ కాపాడుతుంది.

స్వేచ్ఛ.. కొందరు భర్తలు తమ భార్యలకు దుస్తుల నుంచి ఆమెకు కావాల్సిన వస్తువులన్నీ అడగకుండానే తెస్తుంటారు. తమ లాంటి భర్త మరెవరికీ ఉండరని అపోహ పడతారు. ఆ భార్యకూడా మొదట్లో మురిసి పోవచ్చు. అయితే తనకంటూ అభిరుచి ఉంది కదా అనే ఆలోచనకు క్రమేపీ ఆమె రావొచ్చు. తనక్కావల్సింది కొనుక్కొనే స్వాతంత్య్రం కూడా లేదనుకుంటుంది. అది తీవ్ర అసంతృప్తిగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే దంపతుల్లో ఇరువురూ ఎదుటి వారికీ కొంత స్వేచ్ఛ, స్పేస్‌ ఇవ్వడం మరవకూడదు.

కొందరు ప్రతి నిమిషమూ, పనిలోనూ వెనుకే ఉంటారు. బయటికి వెళ్లినా ఒక్కరినీ వదలరు. అది ప్రేమతోనే అయినా కొన్నాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కో సారి ఏంటీ మనిషికి నమ్మకం లేదా అనిపించే ప్రమాదమూ ఉంది. అందుకే మరీ నీడలా ఉంటే మొహం మొత్తుతుంది.

మొహమాటపెట్టి... ఇంకొంత మంది తమ అభిరుచులను, అలవాట్లనూ భాగస్వామికీ అలవరచాలని ప్రయత్నిస్తారు. నీకీ రంగు చీర బాగుంటుంది, ఫలానా నగలు వేసుకుంటే ఫలానా తారలను మించి పోతావు ఇలా పొగుడుతారు. అది నిజమే అయినా ధరించే వాళ్లకూ వాటిపట్ల ఇష్టం ఉండాలన్నది మర్చిపోతారు. మొదట్లో మొహమాటానికి వాటిని ధరించినా కొన్నాళ్లకు నాకంటూ ఇష్టాఇష్టాలు ఉండవా అని అంతర్మథం మొదలై అది కాస్తా అసంతృప్తికి దారితీసే అవకాశం ఉంది. అందుకే మీ ఇష్టాలు ఎదుటి వారికీ నచ్చి వాళ్లంతట వాళ్లు అనుసరించాలే కానీ మొహమాటపెట్టి చేయించకూడదు. వారి ఇష్టాలను, భావోద్వేగాలను గమనించాలి, గౌరవించాలి. అప్పుడే బంధం అన్యోన్యంగా ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని